
అడవిలో పులి సంచారం : కెమెరా ట్రాప్ చిత్రం (క్రెడిట్ : అటవీశాఖ)
తెలంగాణలో మహారాష్ట్ర పులుల సంచారం
తెలంగాణ అటవీ గ్రామాలకు మహారాష్ట్ర పులుల వలస,ప్రజల భయాందోళనలు
పొరుగున ఉన్న మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి అయిదు పులులు (Tigers) గోదావరి-పెనుగంగా నదులను దాటి తెలంగాణ (Telangana) అడవుల్లోకి వలస (Migration) వచ్చాయి. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, సిద్దిపేట, కరీంనగర్,కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో పెద్దపులుల సంచారం పెరిగింది.దీంతో అటవీశాఖ, వన్యప్రాణి విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు.
నదులను దాటి వచ్చిన పులులు
మహారాష్ట్రలోని అభయారణ్యాల నుంచి పులులు గోదావరి, పెనుగంగా నదులను దాటి తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చాయి.మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతోపాటు అక్కడ అవి నివాసం ఉండేందుకు కావాల్సిన ఆవాసాలు, టెరిటరీ లేక పోవడంతో కవ్వాల్ అభయారణ్యంలోకి వలసబాట పట్టాయి. జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని అడవుల్లో తాజాగా పులుల సంచారం కనిపించింది. మంచిర్యాల్, చెన్నూర్, ఓపెన్ కాస్ట్ సింగరేణి ప్రాంతాల్లో అయిదు పులులు సంచరిస్తున్నట్లు అటవీ గ్రామాల ప్రజలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా నుంచి పులులు కాగజ్ నగర్ డివిజన్ లోని కర్జల్లి అటవీప్రాంతం మీదుగా కవ్వాల్ లోకి వచ్చాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. తెలంగాణ సరిహద్దుల్లోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వు పరిధిలోని పులులు కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చి ఆవాసం కోసం వెతుకుతున్నాయని దీనివల్ల పులుల సంచారం పెరిగిందని తెలంగాణ వన్యప్రాణుల విభాగం అధికారి ఆంజనేయులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కవ్వాల్ అభయారణ్యంలో వలస పులుల సంచారం
కవ్వాల్ అభయారణ్యంలో పొరుగు రాష్ట్రాల అభయారణ్యాల నుంచి వచ్చిన అయిదు పులుల సంచారంతో తెలంగాణ టైగర్ సెల్ అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలోని మేల్ ఘాట్, పెంచ్, తడోబా, సహ్యాద్రి, నవగావ్ -నాగ్జీరా, బోర్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఇంద్రావతి , ఉదంతీ- సీతానది, గురు ఘాసిదాస్ -తామోర్ పింగ్లా, అఛానక్మార్, జార్ఖండ్ లోని పలమౌ పులుల అభయారణ్యాలున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లోని పులుల అభయారణ్యాల్లో బ్రీడింగ్ వల్ల పులుల సంతతి అనూహ్యంగా పెరిగింది.ఒక పులి తిరిగేందుకు అవసరమైన అటవీప్రాంతంతోపాటు, నీటి వనరులు, వాటికి ఆహారంగా జింకలు, అడవి పందులు అవసరం. దీంతో పెరిగిన పులులకు కావాల్సిన టెరిటరీ ఏరియా అక్కడి అభయారణ్యాల్లో లేదు. దీంతో ఆవాసంతోపాటు టెరీటరీని వెతుక్కుంటూ అయిదు పులులు కవ్వాల్ పులుల అభయారణ్యంలోకి వలస వచ్చాయి. ఇక్కడికి వచ్చిన పులులు అనువైన నివాస ఆవాసం కోసం సంచరిస్తున్నాయి. వలస పులుల సంచారాన్ని కెమెరా ట్రాప్ చిత్రాలు, వీడియోల ద్వారా చూస్తూ తెలంగాణ టైగర్ సెల్ మానిటరింగ్ చేస్తుంది. పులులు సంచరిస్తున్న అటవీ ప్రాంతాల ప్రజలను అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు అప్రమత్తం చేస్తూ, పులులకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ కోరుతున్నారు.
పెరిగిన పులుల సంచారం
- డిసెంబరు 30,2025 : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్ పేట్ శివారు గాంధీనగర్ లో బొట్ల రాజపోయయ్య పొలంలో ఎద్దును పులి చంపింది.కాటారం అడవుల్లో పులి మరో ఎద్దను చంపింది. కమలాపూర్, రాంపూర్, మేడిపల్లి, కొత్తపల్లి,రేగొండ , కాటారం, కొత్తపెల్లిగోరి ప్రాంతాల్లో పులి సంచరించింది. జయశంకర్, ములుగు జిల్లాల్లో ఓ మగపులి ఆడపులి కోసం తిరుగుతోంది. జాకారం, మల్లంపల్లి, ములుగు, పాకాల, తిర్మలగిరి ప్రాంతాల్లో పులి పాదముద్రలు అటవీశాఖ అధికారులకు కనిపించాయి.
- డిసెంబరు 26, 2025 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, బుస్వాపూర్, తొగుట,మత్ పల్లి, వరదరాజుపల్లి ప్రాంతాల్లో పులి సంచరించిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
- డిసెంబరు 31, 2025 : కరీంనగర్ జిల్లా బహదూర్జాన్ పేట్, వెదురుగట్ట గ్రామాల శివార్లలో పులి సంచరించింది. తన పొలంలో పులి అడుగుజాడలు కనిపించాయని స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి పగ్ మార్కులను పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి సంచారం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
- రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో గత వారం రోజులుగా పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులుల సంచారం నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు.
- ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పత్తి చేలో పులి కనిపించింది. దీంతో పొలాల్లో రైతులు, కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బోథ్ మండలంలోని నిగిని, కంటెగాం, రఘునాత్ పూర్ అజ్జర్, వజ్జర్, చింతల్ బోరి, డేడ్రా ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
- కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట్, కౌటాల, దేహేగాం, కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల్లోనూ పెద్ద పులులు సంచరిస్తున్నాయి.
ప్రాజెక్ట్ టైగర్ కు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆమోదం
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, కడంబా రిజర్వ్ ఫారెస్టుల్లో పులుల సంఖ్య విస్తారంగా పెరిగింది. పులుల సంచారానికి కావాల్సిన అటవీ టెరీటరీ కంటే పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. తడోబా పులుల అభయారణ్యంలో 50 పులులు, ఇంద్రావతి నేషనల్ పార్కులో 35 పులులు ఉన్నాయని అధికారుల సర్వేలో వెల్లడైంది. పొరుగు రాష్ట్రంలో పులులకు కావాల్సిన ఆహారం లభించక పోవడం, సరైన ఆవాసాలు లేకపోవడంతో మహారాస్ట్ర పులులు తరచూ కవ్వాల్ అభయారణ్యంలోకి వలస వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అడవుల నుంచి పులులను తెలంగాణలోని కవ్వాల్ కు పంపించాలని తెలంగాణ అటవీశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలూసింగ్ మహారాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు అంగీకరించారు. ప్రాజెక్టు టైగర్ లో భాగంగా మహారాష్ట్ర పులులను తెలంగాణలోని కవ్వాల్ అభయారణ్యంలోకి రీలొకేట్ చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.
పులుల నివాసానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనుకూలం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యం పులుల నివాసానికి అనుకూలంగా ఉంది. గోదావరి, పెనుగంగా నదుల పరివాహక ప్రాంతంలో 892.23 చదరపు కిలోమీటర్ల ఫారెస్ట్ కోర్ ఏరియా, 1,123.21 చదరపు కిలోమీటర్ల బఫర్ ఫారెస్ట్ ఏరియాతో కలిపి మొత్తం 2,015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కవ్వాల్ అభయారణ్యం విస్తరించి ఉంది. కవ్వాల్ అభయారణ్యంలో పులులకు కావాల్సిన జింకలు, సాంబార్, నీలుగాయి, దుప్పులు లాంటి వన్యప్రాణులు విస్తారంగా ఉన్నాయి. పులులకు కావాల్సిన ఆహారం,పొదలు, గుహలు లాంటి ఆవాసాలు, నీటి వసతి సౌకర్యాలున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో గడ్డి భూముల విస్తీర్ణం పెరగడంతో జింకలు, దుప్పులు, సాంబార్ ల సంఖ్య కూడా పెరిగింది. జింకలకు కావాల్సిన మేత విరివిగా లభిస్తుండటంతో జింకలు, దుప్పుల సంఖ్య పెరిగిందని, దీంతో పొరుగు రాష్ట్రాల పులులకు కవ్వాల్ లో వేటాడేందుకు పుష్కలంగా జింకలు ఉండటంతో అవి వలస వస్తున్నాయని అటవీశాఖ జన్నారం అధికారి కారెం శ్రీనివాస్ చెప్పారు.
పులుల కోసం రెండు అటవీ గ్రామాల తరలింపు
కవ్వాల్ అభయారణ్యంలో పులుల నివాసానికి అనుకూలంగా అటవీ కోర్ ఏరియాలో ఉన్న మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలను కడెం ప్రాంతానికి తరలించి వారికి అటవీశాఖ ఇటీవల పునరావాసం కల్పించింది. రెండు గ్రామాల తరలింపుతో కవ్వాల్ అడవిలో పులుల సంచారానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతోపాటు వేటగాళ్ల బారి నుంచి పులులను పరిరక్షించేందుకు అటవీశాఖ పులుల కదలికలను రికార్డు చేసేందుకు అడవుల్లో కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేశారు. వేటగాళ్లకు చెక్ పెట్టేలా అడవిలోకి ప్రవేశించే మార్గాల వద్ద ఫారెస్ట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
పులి సంచారానికి టెరిటరీ
ఒక పులికి ఎంత అడవి కావాలో ఖచ్చితమైన కొలత లేదు, కానీ అది వేటాడే జంతువులు, ఆహారం, నీరు మరియు తన నివాసం కోసం చాలా పెద్ద భూభాగం (టెరిటరీ) అవసరం; ఇది వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉండొచ్చు, ఎందుకంటే పులులు ఒంటరిగా జీవిస్తాయి, వేటాడతాయి, మరియు వాటికి విస్తారమైన ఆహార సరఫరా (జింకలు, అడవి పందులు వంటివి) అవసరం, అందుకే వాటిని పర్యావరణ సమతుల్యతకు కీలకంగా భావిస్తారు.
2021 గణనలో కవ్వాల్‌లో 8 పులులు
2021వ సంవత్సరంలో జరిగిన పులుల గణనలో కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ విభాగంలో ఎనిమిది పులులున్నాయని వెల్లడైంది. నాటి గణనలో వెలుగుచూసిన పులులు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తబోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వుల నుంచి కవ్వాల్ అభయారణ్యానికి వలస వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఎన్నెన్నో పులి దాడుల ఘటనలు
2020 నవంబరు 11 : దహేగాం మండంల దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్ చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళితే పులి దాడి చేసి అతన్ని చంపింది.
2020 నవంబరు 29 : పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల పొలంలో పత్తి తీస్తుండగా పులి దాడి చేసి ఆమెను హతమార్చింది.
2024 నవంబరు 29 : కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మీ పొలంలో పత్తి తీస్తుండగా పులి ఆమెపై పంజా విసిరి ప్రాణం తీసింది.
అటవీశాఖ అధికారుల గస్తీ
తెలంగాణ జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల అభయారణ్యాల నుంచి వలస వచ్చిన పులులు సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు గస్తీని పెంచారు.ఎర్రరంగు దుస్తులు ధరిస్తే పులి వెంటాడే ప్రమాదం ఉందని, పులి కనిపిస్తే వెనుతిరిగి వీపు కనిపించేలా పరుగెత్తవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి కనిపిస్తే పెద్దగా అరవాలని కోరారు. రాత్రివేళ అటవీ గ్రామాల ప్రజలు ఒంటరిగా కాకుండా గుంపులుగా కలిసి వెళ్లాలని, ఎర్ర రంగు దుస్తులు ధరించవద్దని అటవీశాఖ అధికారులు ప్రజలను కోరారు. అడవిలో జింక, లేదా ఏదైనా పశువు కళేబరం కనిపించిందంటే దాని సమీపంలో పులి సంచరిస్తుందని గుర్తించాలి. పక్షులు, నెమళ్ల అరుపులు వినిపిస్తే పులి ఉందని అప్రమత్తమవ్వాలి.
పులికి హాని కలిగించొద్దు : అటవీశాఖ అధికారులు
కవ్వాల్ అభయారణ్యంలో పులులు సంచరిస్తున్న నేపథ్యంలో వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. పులికి హాని కలిగించేలా విద్యుత్ కంచెలు, ఉచ్చులు, విషప్రయోగం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
పులుల సంచారంపై టైగర్ సెల్ ఈ-సర్వ్‌లెన్స్
తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ అభయారణ్యంలోకి మహారాష్ట్ర నుంచి అయిదు పులులు వలస వచ్చాయని, వీటి కదలికలపై తెలంగాణ టైగర్ సెల్ ఈ- సర్వ్ లెన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తుందని వన్యప్రాణుల విభాగం సీనియర్ అధికారి ఆంజనేయులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అడవుల్లోని కెమెరా ట్రాప్ చిత్రాలు, వీడియోలను హైదరాబాద్ లోని టైగర్ సెల్ కు అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. అత్యంత అధునాతన కెమెరా ట్రాప్ ల ద్వారా పులుల సంచారాన్ని రికార్డు చేస్తున్నామని ఆయన తెలిపారు. పులులు సంచరిస్తున్న అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, పులులు- మనుషుల మధ్య సంఘర్షణను నివారిస్తామని ఆయన వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అయిదు పులులు కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ టైగర్ సెల్ మానిటరింగ్ చేస్తుంది. అటవీప్రాంతాల్లో సోలార్ విద్యుత్ సాయంతో పనిచేసేలా అధునాతన కెమెరా ట్రాప్ లను అమర్చి పులుల కదలికలను సెల్ పరిశీలిస్తోంది.
జనవరి 19 నుంచి పులుల గణన
దేశవ్యాప్త పులుల గణనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో జనవరి 19 నుంచి 26వతేదీ వరకు వన్యప్రాణుల గణన జరగనుంది. ఈ గణనలో భాగంగా మొదటి మూడు రోజుల్లో మాంసాహార జంతువులను, తర్వాత మూడురోజులపాటు శాకాహార జంతువులను గణించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. పులుల పగ్ మార్క్ ట్రాకింగ్, స్కాట్, వెంట్రుకల నమూనాల సేకరణ, కెమెరా ట్రాప్ ల ద్వారా పులుల సంఖ్యను గణించనున్నారు.
పులుల పరిరక్షణా చర్యల కోసం అటవీశాఖ, తెలంగాణ టైగర్ సెల్ శాస్త్రీయ పద్ధతుల్లో పులుల సంచారాన్ని గమనిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి పులుల వలస తెలంగాణ అడవుల్లో జీవ వైవిధ్యం కోసం కొత్త ఆశలను తీసుకు వస్తోంది.
Next Story

