కాంగ్రెస్‌కు రాజీనామా పక్కా.. ఒత్తిడులకు లొంగని జీవన్ రెడ్డి
x

కాంగ్రెస్‌కు రాజీనామా పక్కా.. ఒత్తిడులకు లొంగని జీవన్ రెడ్డి

ఇది పరిష్కారం లేని సమస్య అని, దీనికి పరిష్కారం తన దగ్గర కానీ, పార్టీ దగ్గర కానీ లేదని జీవన్ రెడ్డి స్పష్టం


కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడులకు జీవన్ రెడ్డి లొంగడం లేదు. కొన్ని రోజులుగా ఆయనను పార్టీలోనే కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమయ్యాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రతినిధి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా జీవన్ పట్టు వదలలేదు.

పైగా ఇది పరిష్కారం లేని సమస్య అని, దీనికి పరిష్కారం తన దగ్గర కానీ, పార్టీ దగ్గర కానీ లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు జీవన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి ఇంటిపై ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీని కార్యకర్తలు తొలగించడమే ఇందుకు నిదర్శనంగా మారింది. అంతేకాకుండా ఆయన పార్టీ వీడటానికి నిశ్చయించుకున్నారని తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలోనే తన అనుచరులకు జీవన్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. బుధవారం సమావేశం కావాలని, భవిష్యత ప్రణాళికలపై చర్చిద్దామని చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి తదుపరి అడుగులు ఎటు పడతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అధిష్టానంతో మేము మాట్లాడతాం: మహేష్ కుమార్

మంగళవారం ఉదయం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసంలో మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. చాలా సేపు వారి చర్చ కొనసాగింది. ఈ క్రమంలోనే పార్టీలోనే కొనసాగాలని, పార్టీ అధిష్టానంతో తాము మాట్లాడి ఆయనకు న్యాయం చేపిస్తామని మహేష్ కుమార్ సహా ఇతర నేతలు హామీల వర్షం కురిపించారు. వారు ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి మాత్రం తన పట్టు వదలలేదు.

‘‘జీవన్ రెడ్డి పార్టీలో చాలా సీనియర్ నాయకులు. మా తండ్రి సమానులు. ఆయనకు 43 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. రాష్ట్రంలో ఆయనను మించిన సీనియర్ నేత ఎవరూ లేరు. కొన్ని కొన్ని సార్లు రాజకీయాల్లో అనుకోని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. జీవన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నా మాట మేరకు మంత్రి శ్రీధర్ బాబు వచ్చి కలిశారు. ఇప్పుడు నేను వచ్చాను. ఆయనను పార్టీని వీడొద్దని కోరాం. కార్యకర్తల ఒత్తిడి సహా పలు ఇతర కారణాల వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఆయనతో 1986 నుంచి పరిచయం ఉంది. అప్పటి నుంచి మాకు ఆయన ఎన్నో రాజకీయ సలహాలు ఇచ్చారు. ఆయన రాజీనామా చేయరన్న ఆశతోనే ఇక్కడి నుంచి వెళ్తున్నాం’’ అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

స్వపక్షంతో యుద్ధం నావల్ల కాదు: జీవన్

భేటీ అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫలించలేదని తెలిపారు. కార్యకర్తలంతా కూడా బుధవారం భేటీ కావాలని, అందుకోసం గార్డెన్‌కు రావాలని కోరారు. ‘‘ఈ సమస్యకు పరిష్కారం లేదు. స్వపక్షంతో యుద్ధం నేను చేయలేను. రేపు నా నిర్ణయం ప్రకటిస్తా. నా నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తున్నా’’ అని చెప్పారు. దీంతో ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారన్న విషయం స్పష్టమవుతోంది.

మారనున్న జగిత్యాల జిల్లా సమీకరణాలు

జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే జగిత్యాల రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. స్థానిక కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఆయన వర్గం మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ప్రస్తుతం జగిత్యాలలో ఉన్న జీవన్ వర్సెస్ సంజయ్ అన్న గ్రూపు రాజకీయాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ నష్టాలు కూడా బాగానే ఉంటాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆయన వైపు నుంచి ఉన్న ఓటు బ్యాంక్, కేడర్ అంతా కాంగ్రెస్‌కు నష్టమే అవుతుంది. జగిత్యాలలో జీవన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆయన పార్టీ వీడటంతో స్థానికంగా కాంగ్రెస్ బలహీన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా ఆయన వేరే పార్టీకి వెళ్లినా, స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నా కాంగ్రెస్ ఓట్ షేర్‌ను పక్కాగా చీల్చే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల మాట. దాంతో పాటుగానే పార్టీలో సీనయర్లకు తగిన గౌరవం దక్కడం లేదన్న భావన ఇతర అసంతృప్తి నేతల్లో కూడాపెరిగే అవకాశం ఉందని, వారు కూడా ఇదే బాట పట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story