
‘మక్క విస్తీర్ణ పెరుగుదల రైతులకు నష్టదాయకం’
ఎఫ్‌సిఐ సరఫరా చేసే చౌక బియ్యం అందుబాటులో ఉంది కాబట్టి ఇథనాల్ పరిశ్రమల వాటినే ముడిసరుకుగా వాడుకుంటుంది
తెలంగాణలో పెరుగుతున్న‘మక్క’ (మొక్కజొన్న) విస్తీర్ణం బాగా పెరుగుతూ ఉంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా మక్కను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనుకుంటూ ఉంది. ఇలా మొక్కజొన్న పెరిగితే రైతులకు ప్రయోజనకరమేనా? ప్రధానంగా పత్తి పంట స్థానాన్ని మొక్క జొన్న ఆక్రమిస్తోంది. ఇటీవల పత్తి పంట ఉత్పత్తి తగ్గడంతో పాటు, ఎక్కువగా చీడ పీడల బారిన పడటంతో రైతులు పత్యామ్నాయం చూసుకుంటున్నారు. వాళ్లకి మొక్కజొన్న ప్రస్తుతం ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పత్తితో పాటు మక్క పప్పు దినుసులు, నూనె గింజల స్థానాన్ని ఆక్రమిస్తోంది. భారతదేశం ఈ రెండు రకాల పంటల్లో కొరత ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటపుడు కారణమేదయినా, పప్పు ల, నూనెగింజల పంటల రైతులు మొక్కజొన్న పంటకు మరలడం అంత మంచి సూచన కాదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇపుడిపుడే విస్తరిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర మొక్కజొన్నకు ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగా ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మక్క ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక కృషి జరుగుతోంది. 2030 నాటికి ఉత్పత్తి 70 మిలియన్ టన్నులకు పెంచేందుకు కొత్త జర్మ్ ప్లాజం ( వినియోగించి హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
అయితే అమెరికాతో జరిగిన ఒప్పందం నేపధ్యంలో దేశంలోకి వచ్చిపడే చౌక మొక్కజొన్న అందుబాటులో ఉండగా మన మక్కకు డిమాండ్ ఉండదని తెలంగాణతో పాటు దేశంలోని రైతులు నష్టపోతారని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ జీ.వి. రామాంజనేయులు అన్నారు. ఇథనాల్ పరిశ్రమలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేజీ రు. 22 రూపాయలకే అందిస్తోందని మొక్కజొన్న కనీస మద్దతు ధర రు. 24 కేజీ కాబట్టి ఆ పంటను పరిశ్రమ వినియోగించదని ఆయన అభిప్రాయ పడ్డారు.
మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొంటే ఇథనాల్ పరిశ్రమ లాభాలు ఆర్జించలేదు. బియ్యం వాడకమే వాటికి లాభదాయకం. రైతులను దోపిడీ చేస్తూ తక్కువ ధరలకు మక్క కొనగలిగితేనే వాళ్ళకు లాభాలు వస్తాయి, అని ఆయన అన్నారు.
దేశంలో పెరుగుతున్న పౌల్ట్రీ, ఇథనాల్ (Poultry, Ethanol) పరిశ్రమల డిమాండ్ కు అనుగుణంగా మొక్కజొన్న ఉత్పత్తిని పెంచటానికి కృషి చేస్తున్నట్టు ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సైంటిస్టులు పేర్కొన్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి మొక్కజొన్న పిండి పదార్థాలు (Corn Distillers Dried Grains with Solubles, DDGS) చౌకగా పౌల్ట్రీ పరిశ్రమకు అందుతాయి కాబట్టి ఆ రంగం పై ప్రభావం తక్కువగానే వుంటుంది కానీ రైతులు తీవ్రంగా నష్టపోతారు అని ఆయన విశ్లేషించారు. పరిశ్రమలో ఇథనాల్ తీసిన తరువాత వచ్చే వ్యర్థాలను పౌల్ట్రీ పరిశ్రమ వినియోగించుకోగలదని ఆయన గుర్తు చేశారు.
ఉత్పత్తి 2024-25లో 43.41 మిలియన్ టన్నుల నుండి 2030 నాటికి డెబ్బై మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మిల్లెట్స్ రీసెర్చ్ సైంటిస్టులు ‘ఫెడరల్’ తో తెలిపారు.
ఈ ఏడు ఉత్పత్తి యాబై మిలియన్ టన్నులకు చేరుతుందని లూధియానా లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ (Indian Institute of Maize Research, IIMR) డైరెక్టర్, హెచ్.ఎస్. జాట్ పేర్కొన్నారు. 2015 లో 22 మిలియన్ టన్నులుగా ఉన్న మొక్కజొన్న ఉత్పత్తి గత ఐదు సంవత్సరాలుగా ఆరు శాతం మేర పెరుగుతొంది. ఆయన ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ (All India Coordinated Research Projects, AICRP) తరపున నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న పంటలో జన్యు పరిశోధనలపై ఆయన సైంటిస్టులతో చర్చించారు. ప్రతి ప్రత్యామ్నాయ సంవత్సరం 40 నుండి 50 మంది సైంటిస్టులు హైదరాబాద్ లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రానికి వచ్చి చర్చించటం ఆనవాయితీ.
‘మేజ్ జర్మ్ ప్లాజం ఫీల్డ్ డే’ లో భాగంగా జన్యు వైవిధ్యత, పరిశోధన వాటిలో జరిగిన పురోగతిని బేరీజు వేస్తారు. జన్యు వైవిధ్యాన్ని, ఉత్పత్తి పెంచటంలో ఈ ప్రక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం మొక్కజొన్న వినియోగం ఫీడ్ గా 58 నుండి 60 శాతం, బయో ఇంధనంగా 23 శాతం, స్టార్చ్ గా 12 శాతం, ఆహారంగా ఐదు నుండి ఆరు శాతం మరో 1.3 శాతం ఎగుమతి అవుతోంది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తిలో 50 శాతం మొక్కజొన్న నుండే జరుగుతోంది. సగటున హెక్టార్ కు 3.6 టన్నుల ఉత్పత్తితో మొక్కజొన్న దేశ పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించినట్టు పెట్రోల్ లో 30 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని చేరుకోవటంలో మొక్కజొన్న ప్రధాన పాత్ర పోషిస్తుంది. 800 నుంచి 900 కోట్ల లీటర్ ల ఇథనాల్ దీని ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుందని, హెచ్.ఎస్. జాట్ తెలిపారు. గత రెండేళ్లుగా మొక్కజొన్న ఉత్పత్తి రెండు మిలియన్ హెక్టార్లు పెరిగిందని అయితే అది పత్తి, పప్పు దినుసులు, నూనె గింజల స్థానంలో పెరుగుతోందని ఆయన అన్నారు.
దీనిని అరికట్టటానికి భూమికి తగినట్టుగా పంటలను పండించే విధానాన్ని రూపొందించాలి. తద్వారా బియ్యం స్థానంలో మొక్క జొన్న పెరగాలి. ఇథనాల్ పరిశ్రమలో వినియోగం పెరిగిన తరువాతే మక్కకు మద్దతు ధరకు దగ్గరగా రైతులకు గిట్టుబాటు అవుతోందని ఫెడరల్ తో మాట్లాడుతూ జాట్ అన్నారు.
“బియ్యం స్థానంలో మొక్కజొన్నను ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నాం. దీని వలన మనకు అనేక ప్రయోజనాలు ఒనగూడుతాయి. బియ్యంతో పోల్చితే ఈ పంట నీటి వినియోగం 20 శాతం మాత్రమే తద్వారా భూగర్భ నీటి వినియోగం తగ్గుతుంది, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గటంతో పాటు భూమి ఉత్పాదకత పెరుగుతుంది. మొక్కజొన్నకు చీడపీడల బెడద తక్కువ కాబట్టి పురుగుమందులు, కీటకనాశినుల వినియోగం పరిమితంగా ఉంటుంది. పత్తి ఉత్పాదకత తక్కువ కావటంతో దాని స్థానంలో మొక్కజొన్న వైపు ప్రజలు మల్లుతున్నారు. దీని గింజల నుంచి 4 శాతం ఆయిల్ వస్తుంది. మన దేశం పప్పు దినుసులు, నూనె గింజలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు జరగాలి,” అని అన్నారు.
వడ్లకు మాత్రమే కనీస మద్దతు ధర ఉంటడం వలన రైతులు ఆ పంట వైపు మొగ్గుచూపుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోనూ ఇదే జరుగుతోంది. రైతులు మొక్కజొన్న వైపు మొగ్గుచూపటం లేదు. ఇలాంటి మార్పులను ప్రభుత్వాలు విధానాలను మార్చటం ద్వారా సాధించచ్చు, అని ఆయన తన అభిప్రాయం తెలిపారు.
పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన కొత్త రకాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశంలో వర్షం పడే రోజులు గతంలో 45 రోజుల నుండి 20 నుండి 25 రోజులకు పడిపోయింది. అందుకు తగినట్టుగా పాప్ కార్న్(pop corn), స్వీట్ కార్న్(sweet corn), బేబీ కార్న్(baby corn) రకాలలో జన్యుమార్పులు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన స్ఫష్టం చేశారు.
అమెరికాతో జరిగిన వ్యాపార ఒప్పంద ప్రభావం గురించి మాట్లాడుతూ, ఆ దేశం తాము ఉత్పత్తి చేసే మొక్కజొన్నను మన దేశంలో డంప్ చేయాలనుకుంటోంది అన్నారు. “మన అవసరాల మేరకు మనం ఇప్పటికే పండించుకుంటున్నాం. దిగుమతులు చేయాల్సిన అవసరం లేదు. పైగా వాళ్ళు పండించేది జీఎం మొక్కజొన్న మనం ఆ పంటను దేశంలోకి అనుమతించటం లేదు. ఇప్పటివరకు జీఎం పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించారు,” అన్నారు.
మొక్కజొన్న పంట ఉత్పత్తి పెంచటానికి జీఎం కంటే జీన్ ఎడిటింగ్ (gene editing) సాంకేతికత ఉపయోగించుకోవటం మెరుగైన పరిజ్ఞానం అన్నారు. జీన్ ఎడిటింగ్ లో అదే మొక్కకు చెందిన జీన్స్ ను విత్తనంలోకి ప్రవేశపెడతారు. జీఎం ద్వారా ఇతర సూక్ష్మజీవులు, ఫంగస్ లనుండి జన్యువులు ప్రవేశ పెడతారు అని వివరించారు.
కొత్త రకాలను రూపొందించటానికి, ఇతర దేశాల నుంచి తెచ్చిన ‘జెర్మ్ ప్లాజమ్’ ను మన రకాల్లో ప్రవేశపెట్టటానికి హైదరాబాద్ లోని మొక్కజొన్న కేంద్రాన్ని ఎంచుకోవటానికి ఇక్కడి సమశీతోష్ణ వాతావరణమే కారణమని లూధియానా నుంచి వచ్చిన సైంటిస్టు డా బి. ఎస్. జాట్ చెప్పారు. ఈ కారణం చేతనే తెలంగాణ విత్తన ఉత్పత్తికి కేంద్రంగా ఉందని అన్నారు.

