
దేవ్‌జీ సహా పలువురు కీలక నేతల లొంగుబాటు
మావోయిస్ట్ అగ్రనేతలు దేవుజి, మల్లా రాజిరెడ్డి సహా నలుగురు కీలక నేతలు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. వీరికి రూ. 90 లక్షల పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం అందజేసింది.
మావోయిస్ట్ పార్టీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అగ్రనేత దేవ్‌జీతో పాటు కీలక సభ్యులు మల్లా రాజిరెడ్డి, నూనె గంగన్న కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్ట్‌లు కూడా ఆయుధాలను వీడారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీలో భారీ మార్పు నమోదైంది. పొలిట్ బ్యూరో స్థాయి నాయకుడు దేవుజితో పాటు ముగ్గురు సీనియర్ నేతలు ఫిబ్రవరి 24, 2026న డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. ఈ పరిణామంతో పార్టీ అత్యున్నత నిర్మాణం క్షీణించినట్టు అధికారులు వెల్లడించారు.
లొంగిపోయినవారు:
తిపిరి తిరుపతి అలియాస్ దేవుజి (PBM, CCM)
మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (CCM)
బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (TSC కార్యదర్శి, SCM)
నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న (SCM)
దేవుజి ప్రస్థానం
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవుజి 44 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. 1982లో పీపుల్స్ వార్‌లో చేరారు. దండకారణ్యంలో దళ కమాండర్‌గా పని చేశారు. డివిజనల్ కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ స్థాయిలకు ఎదిగారు. 2001లో సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు నిర్వహించారు. 2017లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. ఆయన భార్య సృజన 2020లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
మల్ల రాజిరెడ్డి ప్రస్థానం
పెద్దపల్లి జిల్లా శాస్త్రులపల్లెకు చెందిన రాజిరెడ్డి 46 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 1970లలో ఉద్యమంలోకి వచ్చారు. గడ్చిరోలి, దండకారణ్య ప్రాంతాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. 2007లో పొలిట్ బ్యూరోలో చోటు సంపాదించారు. 2007లో అరెస్టై 2009లో విడుదలయ్యారు. అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్‌గా ఉన్నారు.
దామోదర్ ప్రస్థానం
ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన దామోదర్ 1998లో ఉద్యమంలో చేరారు. దళ సభ్యుడిగా ప్రారంభించి ఏరియా కమిటీ, డివిజనల్ కమిటీ స్థాయిలకు ఎదిగారు. 2015లో రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 2019లో సైనిక వ్యవహారాల ఇన్చార్జ్‌గా నియమితులయ్యారు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలి భార్య 2012లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. రెండో భార్య ప్రస్తుతం జైలులో ఉన్నారు.
గంగన్న ప్రస్థానం
గుంటూరు జిల్లా వల్లూరుకు చెందిన గంగన్న విద్యావంతుడు. బీఎస్సీ పూర్తి చేసి ఎల్ఎల్బీ చదివారు. 1987లో ఆర్ఎస్యూలో చేరి, 1990లో దళ ఇన్చార్జ్ అయ్యారు. 1998లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యారు. పలుమార్లు అరెస్టై 2014లో విడుదలయ్యారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి AOBSZC, DKSZCలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ అయ్యారు.
లొంగుబాటు కారణాలు
సిద్ధాంతపరమైన విభేదాలు, అంతర్గత కలహాలు, క్షేత్రస్థాయి అమలు సమస్యలు పెరిగినట్టు వెల్లడైంది. 2025 అక్టోబర్ 21న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. శాంతియుత జీవితం గడపాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రవాహంలోకి వచ్చారని పేర్కొన్నారు.
దేవుజి, సంగ్రామ్‌పై తలా రూ.25 లక్షలు. దామోదర్, గంగన్నపై తలా రూ.20 లక్షలు. మొత్తం రూ.90 లక్షలను డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో అందజేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పూర్తి సహాయం అందిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
2025–26లో మొత్తం 544 మంది అండర్‌గ్రౌండ్ కేడర్లు లొంగిపోయినట్టు గణాంకాలు తెలియజేశాయి. వీరిలో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు, 15 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. సెంట్రల్ కమిటీలో ఒకే ఒక్క క్రియాశీల సభ్యుడు మాత్రమే మిగిలినట్టు వివరించారు.
డీజీపీ ప్రత్యేక ఇంటెలిజెన్స్ శాఖ కృషిని అభినందించారు. మిగిలిన అజ్ఞాత కేడర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పునరావాస పథకంతో గౌరవప్రద జీవితం నిర్మించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా పరిస్థితులపై కీలక ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.

