పర్యావరణం కంటే చమురు ప్రయోజనాలకే అగ్రరాజ్యాల ప్రాధాన్యం!
x

పర్యావరణం కంటే చమురు ప్రయోజనాలకే అగ్రరాజ్యాల ప్రాధాన్యం!

COP31లో విఫలమైన వాతావరణ చర్చలు..


Click the Play button to hear this message in audio format

ప్రపంచాన్ని వాతావరణ సంక్షోభం నుంచి కాపాడేందుకు దాదాపు 200 దేశాలు ఒకే వేదికపై సమావేశమైనా.. ఉమ్మడి కార్యాచరణపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు COP31 చర్చలు చివరకు విఫలమయ్యాయి.

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించడం వంటి కీలక అంశాలపై దేశాల మధ్య విభేదాలు తొలగలేదు. మరోవైపు అమెరికా, చైనా, రష్యా మాత్రం చమురు ఉత్పత్తులు, సరఫరాలను పెంచే విషయంలో ఉమ్మడి వైఖరిని ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

నవంబర్ 22న ఆదివారం ముగియాల్సిన COP31 చర్చలు నిర్ణీత సమయాన్ని దాటి కొనసాగినా ఎలాంటి కీలక ఒప్పందం కుదరలేదు. దాదాపు 200 దేశాల ప్రతినిధులు సమావేశమైనప్పటికీ, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంధన మార్పులపై ఒక ఉమ్మడి రాజకీయ ప్రకటనను కూడా ఆమోదించలేకపోయారు.
యుద్ధాలు, సుంకాల అమలుతో చీలిపోయిన ప్రపంచంలో వాతావరణ కట్టుబాట్లు కంటే ఇంధన సరఫరా, వ్యూహాత్మక ప్రభావం, జాతీయ ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత లభిస్తోంది. శక్తివంతమైన దేశాల ప్రయోజనాలకు వాతావరణ మార్పులు ఎదుపడినప్పుడూ వాతావరణ దౌత్యానికి ఉండే పరిమితులను అంటాల్యా పతనం స్పష్టం చేసింది.

చమురు.. అధికార రాజకీయాలు..

ఈ పరిణామానికి మూడు రోజుల ముందే.. అంటే నవంబర్ 19న చైనా, రష్యా, అమెరికా కీలక ప్రకటన చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షెన్‌జెన్‌లో సమావేశమై శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరాలను పెంచేందుకు తమ ప్రాధాన్యతను ప్రకటించారు.
అయితే ఈ ప్రకటనలో చమురు ఉత్పత్తికి సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలు, గడువులు లేవు. అలాగే అధికారికంగా ఎలాంటి చమురు ఉత్పత్తిదారుల కూటమిని ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ, ప్రపంచ ఇంధన వ్యవస్థలో పెట్రోలియం ప్రాధాన్యతను కొనసాగించాలన్న మూడు దేశాల ఉమ్మడి వైఖరి ఇందులో స్పష్టమైంది.
ఈ మూడు దేశాల ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు కాగా, చైనా అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు. రష్యా కూడా ప్రధాన చమురు ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉంది. అయినప్పటికీ ఇంధన సరఫరాలపై నియంత్రణ సాధించడం, అంతర్జాతీయ మార్కెట్లలో తమ ప్రభావాన్ని కొనసాగించడం విషయంలో ఈ దేశాల ప్రయోజనాలు కలిశాయి.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. మధ్యప్రాచ్యం, రష్యా ప్రాంతాల్లో సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటంతో ముఖ్యంగా డీజిల్ వంటి శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల లభ్యతపై ఒత్తిడి పెరిగింది. మధ్యప్రాచ్యం నుంచి ఆసియాకు ముడిచమురు రవాణా ఖర్చులు కూడా పెరిగినట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ నవంబర్ నివేదిక వెల్లడించింది.
ప్రభుత్వాలకు ఇంధన భద్రత అనేది జాతీయ భద్రతలో భాగంగా మారింది. రవాణా, పరిశ్రమలు, వాణిజ్యం సజావుగా సాగాలంటే చమురు సరఫరా అవసరం. అదే సమయంలో చమురు ఉత్పత్తి, రవాణా మార్గాలపై నియంత్రణ ఉన్న దేశాలకు అంతర్జాతీయంగా వ్యూహాత్మక ఆధిపత్యం కూడా లభిస్తోంది.

వాతావరణ దౌత్యాలు విఫలం..

ఇలాంటి పరిస్థితుల్లోనే అంటాల్యా వాతావరణ చర్చలు విఫలమయ్యాయి. వాస్తవానికి 2023లో దుబాయ్‌లో జరిగిన వాతావరణ సదస్సులో శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థల వైపు వెళ్లాలని దేశాలు అంగీకరించాయి.
ఈ నేపథ్యంలో నవంబర్ 16న విడుదల చేసిన COP31 ముసాయిదా రాజకీయ ప్రకటనలోనూ ఆ హామీని పునరుద్ఘాటించారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని వేగంగా తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే నవంబర్ 19న విడుదల చేసిన సవరించిన ముసాయిదాలో ఈ అంశం కనిపించలేదు. నవంబర్ 22న చివరగా ప్రతిపాదించిన పత్రాల్లోనూ ఈ ప్రస్తావన లేకుండా పోయింది.
దీంతో అంటాల్యా ఒప్పందంగా పిలవాల్సిన ప్రధాన నిర్ణయాలనే దేశాలు ఆమోదించలేకపోయాయి. కేవలం శిలాజ ఇంధనాల అంశమే కాకుండా, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక సాయం, గతంలో పర్యావరణ కాలుష్యానికి ఎక్కువగా కారణమైన దేశాల బాధ్యత వంటి అంశాలపైనా విభేదాలు తలెత్తాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున భారత్ ఈ చర్చల్లో కీలక వైఖరి తీసుకుంది. లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ తరఫున మాట్లాడిన భారత్.. అభివృద్ధి చెందుతున్న దేశాలపై కొత్త బాధ్యతలు మోపాలని సంపన్న దేశాలు ప్రయత్నిస్తున్నాయని, అదే సమయంలో ఆర్థిక సాయం విషయంలో మాత్రం అర్థవంతమైన చర్చలకు ముందుకు రావడం లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే ఈ చర్చల్లో కొన్ని అంశాలపై మాత్రం నిర్ణయాలు తీసుకోగలిగారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్పులు చేసుకునే చర్యలు, అడాప్టేషన్ ఫండ్, న్యాయమైన ఇంధన మార్పు వంటి అంశాలపై ప్రత్యేక నిర్ణయాలు వెలువడ్డాయి. కానీ ప్రధాన రాజకీయ ప్రకటనపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దుబాయ్ సదస్సులో సాధించిన అవగాహన ఎంత బలహీనంగా ఉందో మరోసారి స్పష్టమైంది.

భారత్ కు ఇంధన సంక్షోభం..

ఇక భారత్ విషయానికి వస్తే ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడం పెద్ద సవాలుగా మారింది. దేశంలో వినియోగించే ముడిచమురులో దాదాపు 89 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అదే సమయంలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది.
దీంతో అంతర్జాతీయ చమురు ఉత్పత్తిదారుల నిర్ణయాలు, సరఫరా ప్రాంతాల్లో ఘర్షణలు, రవాణా మార్గాల్లో అంతరాయాలు భారత్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో సమస్యలు తలెత్తితే చమురు సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే రవాణా, తయారీ రంగాలతో పాటు సామాన్య కుటుంబాల ఖర్చులపైనా ప్రభావం పడుతుంది.
అందుకే దేశీయంగా పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించడం, రవాణా రంగాన్ని విద్యుదీకరించడం భారత్‌కు కేవలం పర్యావరణ పరిరక్షణ చర్యలు మాత్రమే కాదు. విదేశీ ఇంధన సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే మార్గాలు కూడా.
అయితే ఈ మార్పులకు భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, తగినంత సమయం అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక అభివృద్ధిని కొనసాగిస్తూనే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలంటే సంపన్న దేశాలు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని కోరుతున్నాయి. అంటాల్యా చర్చల్లోనూ ఇదే ప్రధాన వివాదంగా మారింది.
సదస్సు ప్రారంభంలోనే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వాణిజ్య ఆంక్షలు, సాంకేతిక ఆధిపత్య పోటీ, భౌగోళిక రాజకీయ విభేదాలతో ప్రపంచం విడిపోతే ఇంధన మార్పుల ప్రక్రియ మరింత ఖరీదైనదిగా మారుతుందని, ఎక్కువ సమయం పడుతుందని, కోట్లాది మంది ఈ మార్పుల ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంటాల్యాలో జరిగిన పరిణామాలు గుటెరస్ హెచ్చరికలోని తీవ్రతను మరోసారి బయటపెట్టాయి. వాతావరణ మార్పులపై శాస్త్రీయ అవగాహన, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ప్రపంచ ఇంధన మార్పులకు సరిపోవడం లేదు. దేశాల ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన మార్కెట్లపై ఆధిపత్యం, అంతర్జాతీయ రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, వాతావరణ దౌత్యం పూర్తిగా విఫలమైందని చెప్పలేకపోయినా.. అగ్రరాజ్యాల వ్యూహాత్మక ప్రయోజనాల ముందు అంతర్జాతీయ ఒప్పందాలు ఎంతవరకు ప్రభావం చూపగలవన్న ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే దేశాల మధ్య ప్రకటనలు, హామీలకు మించి ఆచరణాత్మక సహకారం అవసరమని COP31 పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Read More
Next Story