
మలేషియా కీలక నిర్ణయం.. చిక్కుల్లో 2000 మంది తెలంగాణ వాసులు
వీసా గడువు మించిన విదేశీయులు ఏప్రిల్ 30లోపు వెళ్లాలని మలేషియా ఆదేశం. పత్రాలు లేని తెలంగాణ కార్మికులపై ప్రభావం ఉండొచ్చని అంచనా.
మలేషియా ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం తెలంగాణకు చెందిన వేలాది మంది వలస కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. వలస కార్మికుల విషయంలో తమ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించనుందని, గడువు ముగిసిన వీసాలతో, పరిమితులు లేని వలస కార్మికులను దేశం నుంచి పంపేయాలని మలేషి నిర్ణయించుకుంది. ఇందుకు ఏప్రిల్ 31 ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అక్కడ పత్రాలు లేకుండా ఉన్న సుమారు రెండు వేల మంది తెలంగాణ వాసులు చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడింది.
అక్రమ వలసదారులకు గడువు
మలేషియాలో అక్రమంగా ఉన్న విదేశీయులు గడువులోపు స్వదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ గడువు లోపల వెళ్లినవారిపై జైలు శిక్షలు ఉండవని తెలిపారు. అయితే గడువు ముగిసిన తరువాత చట్టవిరుద్ధంగా అక్కడే ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మే 1 నుంచి కఠిన తనిఖీలు
ఏప్రిల్ 30 తర్వాత సరైన పత్రాలు లేకుండా మలేషియాలో ఉంటే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2026 మే 1 నుంచి తనిఖీలు మరియు అమలు చర్యలను మరింత కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ నుంచి భారీగా కార్మికులు
రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్విజరీ కమిటీ అంచనాల ప్రకారం మలేషియాలో దాదాపు 80 వేల మంది తెలంగాణ వాసులు మలేషియాలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా పాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని కమిటీ పేర్కొంది.
కాగా ఈ 80 వేల మందిలో దాదాపు 2 వేల మంది సరైన పత్రాలు లేకుండా మలేషియాలో ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గడువు ముగిసేలోపు వారు తమ ఇమ్మిగ్రేషన్ స్థితిని సరిచేసుకోకపోతే కొత్త అమలు చర్యల వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
ప్రత్యేక పథకం ప్రారంభం
వలసదారులకు సహాయం చేసేందుకు మలేషియా ప్రభుత్వం మైగ్రంట్ రెపట్రియేషన్ ప్రోగ్రామ్ 2.0 అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అధీకృత ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ పోస్ట్‌లు, అనుమతి పొందిన టైపింగ్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకుని వీసా పునరుద్ధరణ లేదా స్వదేశాలకు తిరిగి వెళ్లే ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.
పాస్‌పోర్ట్ లేకున్నా స్వదేశానికి అవకాశం
అనేక మంది వలసదారులకు పాస్‌పోర్ట్ కోల్పోవడం లేదా గడువు ముగియడం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కౌలాలంపూర్‌లో ఉన్న ఇండియన్ హైకమిషన్ అత్యవసర ధృవపత్రాలను జారీ చేస్తోంది. ఈ అత్యవసర సర్టిఫికెట్ ద్వారా పాస్‌పోర్ట్ లేకున్నా భారతీయులు చట్టబద్ధంగా స్వదేశానికి తిరిగి రావచ్చు.
రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ సభ్యుడు స్వదేష్ పారికిపండ్ల ప్రకారం, మరిన్ని వివరాల కోసం ఎన్‌ఆర్‌ఐ సంఘాలు లేదా హై కమిషన్‌ను సంప్రదించాలని సూచించారు. మలేషియా నిర్ణయించిన గడువులోపు భారత్‌కు తిరిగి వస్తే వారికి ఎలాంటి సమస్యలు ఉండవని ఆయన వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మలేషియాలో ఉన్న తెలంగాణ వలస కార్మికులు తమ పత్రాలపై స్పష్టత తీసుకుని త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

