కాంగ్రెస్‌కు మమతా సవాల్: చేతనైతే ఆ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించండి
భారత కూటమిలో కీలకనేతగా ఉన్న టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా ఆ పార్టీకి సవాల్ విసిరారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. చేతనైతే ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిరచాలని సవాల్ విసిరారు.
శుక్రవారం కోల్‌కతాలో చేపట్టిన ధర్నాలో ఆమె ప్రసంగించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజనతో పాటు పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు బకాయిపడిరదని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె కాంగ్రెస్‌ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
‘‘బీజేపీ బలంగా ఉన్న 300 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌కు చెప్పాను. కాని వారు వినలేదు. ఇప్పుడేమో మైనార్టీ ఓటర్ల కోసం రాష్ట్రంలోకి ప్రవేశించారు.’’ అన్నారు మమతా.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లకు మించిరావన్న బెనర్జీ రాహుల్ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రను వలస పక్షుల ఫోటో ప్రదర్శనగా కొట్టిపడేశారు.
పశ్చిమ బెంగాల్‌లో కలిపి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినా తిరస్కరించారని పేర్కొంటూ.. ‘‘పశ్చిమ బెంగాల్ రెండు స్థానాలు కేటాయిస్తామన్నాం. కాని వారు అందుకు అంగీకరించలేదు. 42 స్థానాల్లో పోటీ చేయనివ్వండి. చేతనైతే ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిరచండి. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నపుడు మీరు (కాంగ్రెస్) ఎక్కడున్నారు? మేం అక్కడికి ఒక టీంను పంపాం.’’
‘‘ పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ యాత్ర గురించిన సమాచారం నాకు ఇవ్వలేదు. నేను మా అధికారుల నుంచి తెలుసుకోవాల్సి వచ్చింది.’’ అని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోల్‌కతా మైదాన్ ప్రాంతంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట టీఎంసీ నేతలతో కలిసి బెనర్జీ ప్రదర్శన ప్రారంభించారు. ఇటు సీఎం మేనల్లుడు అయిన టీఎంపీ ఎంపీ అభిషేక్ బెనర్జీ న్యూఢల్లీిలో ఆందోళన నిర్వహించారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్ వెలుపల ధర్నాకు కూర్చున్నారు.