కర్ణాటకలో సుమలతకు రాజకీయ కష్టాలు...
x

కర్ణాటకలో సుమలతకు రాజకీయ కష్టాలు...

ఒకసారి గెల్చినా రెండో సారి సీటు టికెట్ తెచ్చుకుకోవడం కష్టంగా ఉంది మాజీ హీరోయిన్ సుమలతకు. ఆమెకొక విఐపి అడ్డొస్తున్నాడు. బిజెపి ఎటు మొగ్గుతుందో చూడాలి...


కర్ణాటకలో సీట్ల కేటాయింపు బీజేపీకి తలనొప్పిగా మారింది. ఆ పార్టీతో జేడీ(ఎస్) పొత్తే అందుకు కారణం. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గం నుంచి పోటీచేస్తామని పట్టుబడుతున్నారు. వారిద్దరిలో ఎవరిని బరిలో నిలపాలో బీజేపీ తేల్చుకోలేకపోతుంది.

సీట్ల పంపకాల చర్చల్లో మాండ్య తమకు అత్యంత కీలకం అని జేడీ(ఎస్) పేర్కొంది. కాగా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సుమలత తాను కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో బీజేపీ సందిగ్ధంలో పడింది.

పోటీ చేసేది హెచ్‌డీకేనే..

ఇటీవల మాండ్యాలో మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ కుమారస్వామి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జేడీ(ఎస్) అధికార ప్రతినిధి డీసీ తమ్మన్న మీడియాతో మాట్లాడుతూ మాండ్య జేడీ(ఎస్) కంచుకోట అని, ఆ సీటును ‘ఎవరి కోసం’ త్యాగం చేసే ప్రసక్తే లేదని అన్నారు. జెడి(ఎస్)లో చాలా మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నా, మాండ్యా నుంచి హెచ్‌డికే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. హెచ్‌డికేనే పోటీచేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.

కూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీ(ఎస్)ల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్న క్రమంలో హెచ్‌డీకే చిక్కబల్లాపూర్ లేదా మాండ్య నుంచి పోటీ చేయవచ్చని బీజేపీ వర్గాలు ఫెడరల్‌కి తెలిపాయి. 2009లో బెంగళూరు రూరల్ నుంచి ఒక పర్యాయం ఎంపీగా ఎన్నికైన కుమారస్వామి 2014లో చిక్కబల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీ చేతిలో ఓడిపోయారు.

ప్రత్యామ్నాయ సీట్లు..

మాండ్యాను జెడి(ఎస్)కు కేటాయిస్తే, సుమలత కోసం బిజెపి మరో నియోజక వర్గం కోసం వెతకాలి. దానికి కూడా వొక్కలిగ మెజారిటీ అవసరం. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. నియోజకవర్గంలో ఆమెకు ఆదరణ తగ్గడంతో మండ్య నుంచి ఆమెను పోటీ చేయించకూడదని పార్టీ నేతలు భావిస్తున్నారు. బుజ్జగింపు చర్యల్లో భాగంగా సుమలతను బెంగళూరు రూరల్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్‌పై పోటీ చేయించాలని చూస్తుంది. ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న బిజెపి అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి డివి సదానంద గౌడను బెంగళూరు నార్త్‌కు మార్చే అవకాశం ఉంది.

మాండ్యాపై ఆసక్తి..

సుమలత మాత్రం మాండ్య నుంచి పోటీ చేస్తారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఆ సీటు ఇవ్వడానికి నిరాకరిస్తే మాండ్యా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సి వస్తుందని అంటున్నారు. కాగా, బెంగళూరు నార్త్ లేదా బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలను సుమలత ఖండించారు. మాండ్యాకు చెందిన కన్నడ నటుడు దర్శన్ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చేసినట్లుగానే మళ్లీ తన ప్రచారానికి మద్దతు ఇస్తారని ఆమె మీడియాతో అన్నారు. ‘‘బెంగళూరు నార్త్‌తో పాటు ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తానన్న నమ్మకం నాకుంది. కానీ, మాండ్యా నా భర్త అంబరీష్‌ పుట్టిన జిల్లా. కాబట్టి దాన్ని కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు.’’ అని సుమలత అన్నారు.

విజిటింగ్ ఎంపీగా ముద్రవేశారా?

ఇప్పుడు సుమలతకు తన నియోజకవర్గంలో పాపులారిటీ తగ్గిందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019లో 1.25 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన నాయకురాలు నియోజక వర్గంలో మెల్లమెల్లగా ఆదరణ కోల్పోయిందని అంటున్నారు. అప్పట్లో జేడీ(ఎస్) అభ్యర్థిని ఓడించేందుకు ఆమె గెలుపునకు కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మద్దతు పలకడంతో ఆమె గెలుపు సులవైందని అంటున్నారు. ఇప్పుడు మాత్రం మాండ్యా ఓటర్లు ఆమెపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలయ్యాక సుమలత నియోజకవర్గాన్ని మరిచిపోయిందని, మాండ్యాలో ఆమె నివాసం ఉండదని ఆరోపించారు. ఆమెను ‘విజిటింగ్ ఎంపీ’గా ముద్ర వేశారు.

ఆత్మగౌరవ కార్డు మళ్లీ పని చేస్తుందా?

“గెలిచిన తర్వాత, మాండ్యాలో ‘థాంక్స్ గివింగ్ కన్వెన్షన్’ నిర్వహిస్తానని గతంలో ఆమె హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేదు’’ అని మండ్య తాలూకాలోని అలకెరె గ్రామానికి చెందిన రాణి రుద్రేష్ అన్నారు. ఆమె కార్యకర్తల మద్దతు కూడగట్టుకోవడం లేదని, బదులుగా దొడ్డన్న, దర్శన్, రాక్‌లైన్ వెంకటేష్ సహా సన్నిహిత మద్దతుదారులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.

అంబరీష్‌ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌లోని కొంతమంది సభ్యులు తప్ప ఎవరూ ఆమెకు టిక్కెట్‌ ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి చేయడం లేదని అంబరీష్‌ జన్మస్థలం దొడ్డరసినకెరె గ్రామానికి చెందిన రాజేగౌడ తెలిపారు. కానీ సుమలత మాండ్య నుంచి పోటీ చేయమని తన మద్దతుదారుల నుండి విపరీతమైన ఒత్తిడి ఉందని, తాను కూడా నియోజకవర్గంతో మానసికంగా అటాచ్ అయ్యానని పేర్కొంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం ఖాయమని ఆమె పునరుద్ఘాటించారు.

Read More
Next Story