ఒడిశా కాల్పుల్లో మావోయిస్ట్ కీలక నేత మృతి
x

ఒడిశా కాల్పుల్లో మావోయిస్ట్ కీలక నేత మృతి

పాకా హనుమంతు అలియాజ్ గణేశ్ ఉయికే మరణించినట్లు తెలిపిన భద్రతా బలగాలు.


భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కీలక నేత పాకా హనుమంతు అలియాజ్ గణేశ్ అలియా చమ్రు మరణించినట్లు పోలీసులు వెల్లించారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లు వివరించారు. హనుమంతు మావోయిస్ట్ కేంద్ర కమిట సభ్యుడిగాఉన్నారని, అంతేకాకుండా సెంట్రల్ రీజినల్ బ్యూరోలో కూడా అతను సభ్యుడేనని అధికారులు చెప్పారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చండూరు మండలం పుల్లెంల గ్రామం అతని స్వస్థలమని అధికారులు తెలిపారు.

కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసిన గణేష్ చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. అప్పటి నుంచి నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో ఉన్న తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని అధికారులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం కందమాల్ జిల్లాలోని ఎన్‌కౌంటర్ స్థలంలో నుంచి గణేష్‌కు చెందిన ఏకే–47 తుపాకీని స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. నిర్దిష్ట సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు మావోయిస్టుల బృందాన్ని అడ్డుకోవడంతో ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. ఈ స్థలంలో నుంచి రెండు ఇన్సాస్ తుపాకీలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో గణేష్‌తో పాటు మరో ఒక పురుష మావోయిస్టు, ఇద్దరు మహిళా కేడర్లు మృతి చెందారు. మిగిలిన ముగ్గురి గుర్తింపును అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కంధమాల్ జిల్లా చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాం జిల్లాకు సరిహద్దుగా ఉన్న రంభా అటవీ ప్రాంతంలో 20 స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందాలు, రెండు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలు, ఒక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) బృందాన్ని మోహరించినట్లు అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మిగిలి ఉన్న కొద్ది మంది సీనియర్ మావోయిస్టు నేతల్లో గణేష్ ఒకడిగా భావిస్తున్నారు. చాలా మంది సీనియర్ నేతలు కాల్పుల్లో హతమయ్యారు, కొందరు లొంగిపోయారు. తెలంగాణకు చెందిన మరో సీనియర్ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.. సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భద్రతా బలగాలు గాలింపులు చేస్తున్నాయి.

Read More
Next Story