మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్ జీ లొంగుబాటు, పెద్ద షాక్
x
Maoist chief Dev Ji surrenders before police

మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్ జీ లొంగుబాటు, పెద్ద షాక్

మరో 16 మంది మావోయిస్టులు కూడా తమ ఆయుధాలతో లొంగిపోవటం మావోయిస్టుపార్టీకి పెద్ద షాకనే చెప్పాలి.


మావోయిస్టులపైన దెబ్బమీద దెబ్బ పడుతునే ఉంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా దొరికిన మావోయిస్టులను దొరికినట్లుగా లేపేయాలని భద్రతాబలగాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఎంతో కీలకమైన కర్రెగుట్టల్లో ఐదురోజులుగా కూంబింగ్ జరుగుతోంది. సుమారు 5 వేలమంది భద్రతాదళాలు అత్యాధునిక ఆయుధాలు, ద్రోన్లు, హెలికాప్టర్లతో అడవులను జల్లెడపడుతున్నాయి. తప్పించుకోవటం కష్టమవుతున్న నేపధ్యంలో ఆదివారం మావోయిస్టు చీఫ్, ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు మరో కీలక నేత, కేంద్ర కమిటి సభ్యుడు మల్లా రాజిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా తమ ఆయుధాలతో లొంగిపోవటం మావోయిస్టుపార్టీకి పెద్ద షాకనే చెప్పాలి.

ఆపరేషన్ కగార్ కు డెడ్ లైన్ మార్చి 31 అన్న విషయం అందరికీ తెలిసిందే. మార్చి 31 తర్వాత దేశంలో మావోయిస్టులు అన్నవాళ్ళే ఉండకూడదు అన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టుదల. దానికి తగ్గట్లే కేంద్రబలగాలకుతోడు తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సాలోని పోలీసులను తీసుకుని సుమారు 2 లక్షలమందితో కేంద్రం ఆపరేషన్ కగార్ ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దొరికిన మావోయిస్టులను దొరికినట్లుగా భద్రతాదళాలు ఎన్ కౌంటర్లో చంపేస్తున్నాయి. మావోయిస్టులకు అమిత్ షా ఒకటే ఛాయిస్ ఇచ్చారు. లొంగిపోవటమా ? ఎన్ కౌంటర్లో చనిపోవటమా ? అంతే. గడచిన ఏడాదిలో సుమారు 450 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోగా అంతేమంది ఎన్ కౌంటర్లలో చనిపోయారు.

మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, మావోయిస్టు గెరిల్లా దళం కార్యదర్శి హిడ్మా లాంటి ఎంతోమంది కీలక నేతలు ఎన్ కౌంటర్లలో చనిపోయిన విషయం తెలిసిందే. ఇదేసమయంలో కేంద్రకమిటి సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, సుజాత లాంటి ఎంతోమంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఆపరేషన్ కాగార్ డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో దండకారణ్యంలోని మావోయిస్టుల షెల్టర్ జోన్ కర్రెగుట్టలను ఐదురోజుల క్రితమే భద్రతాదళాలు అన్నీవైపుల నుండి చుట్టుముట్టి ఎలాగైనా ఎన్ కౌంటర్లు చేసేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎన్ కౌంటర్లలో చనిపోవటం కన్నా లొంగిపోవటమే మేలని అనుకున్నట్లున్నారు.

అందుకనే ఈరోజు ఉదయం అసిఫాబాద్ అడవుల్లో ఎస్ఐబీ ముందు దేవ్ జీ, రాజిరెడ్డితో పాటు 16 మంది లొంగిపోయారు. దేవ్ జీ ఇపుడు మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నంబాల చనిపోయిన తర్వాత దేవ్ జీ నే పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. కర్రెగుట్టల అడవుల్లో దేవ్ జీ, రాజిరెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో భద్రతాదళాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో వీళ్ళందరినీ చుట్టుముట్టడం, ఎన్ కౌంటర్ ఖాయమని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో సడెన్ గా కీలక నేతల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద షాకనే అనుకోవాలి.

Read More
Next Story