ఒకప్పుడు బుల్లెట్‌ను నమ్మిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తెలంగాణలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి లొంగిపోవడం రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో భారీ లొంగుబాట్లతో మావోయిస్టు కమిటీకి మంగళం పాడినట్లయింది. హైదరాబాద్ నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటరులో తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు. నాలుగు బస్సుల్లో వచ్చిన మావోయిస్టులు 124 తుపాకులను సీఎంకు అప్పగించి సాధారణ జీవితం గడిపేందుకు వీలుగా లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 125 మంది ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన వారని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. నలుగురు తెలంగాణకు చెందిన వారని, ఒకరు ఏపీ వాసి అని పోలీసులు చెప్పారు.ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. మావోయిస్టు కీలక నేతలైన దేవ్ జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డిల గన్ మెన్లు ఉన్నారు.
సీపీఐ మావోయిస్టులకు ఎదురుదెబ్బ
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 130 సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలతో పాటు ఇద్దరు కమాండర్లు ఎండ్రీ కలిత్రమ్ అలియాస్ యుకీతో సహా కల్లు, కోర్సా లక్కు, చలసాని నవత అలియాస్ చంద్ర,ఇర్ప రాము అలియాస్ వినోద్, దేవ్ జీ రక్షణ బృందం కమాండర్ ముచకి ఉంగల్ అలియాస్ సుధాకర్, పొట్టం అరుణ అలియాస్ సానికి, చెర్ల శబరి ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.
లొంగిపోయిన మాజీలకు చెక్కుల పంపిణీ
లొంగిపోయిన మావోయిస్టు కార్యకర్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. రాష్ట్ర, కేంద్ర సహాయ, పునరావాస విధానంలో భాగంగా 130 మంది మావోయిస్టు కార్యకర్తలకు 4,18,20,000 రూపాయలను పంపిణీ చేశారు.మావోయిస్టులు సీఎంకు అప్పగించిన ఆయుధాల్లో ఒక ఇన్ సాస్ ఎల్ ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిల్స్, 21 ఇన్ సాస్ రైఫిల్స్, 20 ఎస్ఎల్ ఆర్ రైఫిల్స్, 18 .303 రైఫిల్స్, 33 ఇతర ఆయుధాలు ఉన్నాయని ఎస్ఐబీ అధికారిణి సుమతి చెప్పారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో లొంగిపోయిన మావోయిస్టులు అందజేసిన అధునాతన ఆయుధాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.
కేసులను ఉపసంహరించుకుంటాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, పెద్ద ఎత్తున మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోవడం పునరావాసం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతపై ప్రతిబింబిస్తుందన్నారు."హింసా మార్గాన్ని వదిలి సమాజంలో తిరిగి చేరాలనుకునే వారి పట్ల ప్రభుత్వం సానుభూతితో సానుకూలంగా ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు. “చట్టపరంగా సాధ్యమైన చోట, ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉంది ’’అని సీఎం పేర్కొన్నారు.మావోయిస్టు నాయకుడు గణపతి ఇతర నాయకులు లొంగిపోయి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలో చేరాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.2024 జనవరినుంచి తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, తాజా లొంగుబాటు రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పరిణామాల్లో ఒకటి అని సీఎ చెప్పారు.
“ఒకప్పుడు బుల్లెట్‌ను నమ్మిన వారు ఇప్పుడు బ్యాలెట్‌ను ఎంచుకుంటున్నారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మొత్తం మీద, భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం తెలంగాణ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.ఒకప్పుడు అడవుల్లో ఆయుధాలతో తిరిగిన వారు ఇప్పుడు సాధారణ జీవితాన్ని ఎంచుకోవడం తెలంగాణలో మారుతున్న పరిస్థితులకు సంకేతంగా కనిపిస్తోంది. మరింత మంది మావోయిస్టులు కూడా లొంగిపోయి సమాజంలో కలవాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.