
మార్కాపురం ప్రమాదం: 20కి చేరిన మృతుల సంఖ్య..
నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రమాదానికి ముందు నుంచే బస్సు పరిస్థితిపై అనుమానాలు.
మార్కాపురం మండలం రాయవరం పలకల గనుల వద్ద టిప్పర్, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన నేపథ్యంలో వారిలో 20 మంది సజీవదహనం కాగా మరో 20మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారంతా కూడా కూలీలు, సుతారీలు అని సమాచారం. వీరు మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. జీవనోపాధి కోసం తెలంగాణలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం చెప్తోంది.
బాధితుల వివరాలు
- కే అబ్రహాం – చౌడవరం, వెల్లిగండ్ల మండలం
- ప్రవీణ్ – చౌడవరం, వెల్లిగండ్ల మండలం
- వై. గురవయ్య – చింతగుంట్ల, నెల్లూరు జిల్లా
- లక్ష్మీ కుమారి – కనిగిరి
- జేమ్స్ – గంటపల్లి, పెద్దచెర్లోపల్లి
- ఎం. చిట్టిబాబు – శంఖపురం, పెద్దచెర్లోపల్లి
- బి. యోహాన్ – బుప్పాలపురం
- మహింద్రారెడ్డి – రెడ్డి కనిగిరి
- టి. తిరుపాలు – చెర్లోగిరి, కనిగిరి
- ఏ. మనోహర్ – మల్లిఖార్జున, పామర్రు
- ఏ. సౌజన్య – పెద్దరింకట్ల, కేకే మిట్ల
- కే. బాలరాజు – కృష్ణంపల్లి, హెచ్‌ఎం పాడు మండలం
- బి. కిరణ్ – దాసరిపల్లి, వెడ్డగిరి మండలం
- పి. రత్తమ్మ – వెంకటంపల్లి, గుడ్లూరు మండలం
- యూ. మనోహర్ – కనిగిరి
- కే. చందు – వింజమూరు, నెల్లూరు
- కే. చందన – వింజమూరు, నెల్లూరు
- డి. మణియమ్మ – వెలిగట్టిపల్లి
- డి. శ్రీహరి – లింగంరెడ్డిపల్లి, కనిగిరి
- డి. సురేందర్ – వింజమూరు, నెల్లూరు
- కే. ప్రకాశ్ – ఉదయగిరి, నెల్లూరు
- పి. యువరాజు – కనిగిరి
- అయ్యన్న – కొండాపురం మండలం
- మనోజ్ కుమార్ – వింజమూరు, నెల్లూరు
- సి.హెచ్. మేఘన – వింజమూరు, నెల్లూరు
- బి. మౌనిక – కనిగిరి
- ఆర్. మనోహర్ రావు – మాచర్ల, పల్నాడు జిల్లా
- ఏ. మౌనిక – నల్లగల్ల
బస్సు కండిషన్‌పై అనుమానాలు
ఇదిలా ఉండగా, ప్రమాదానికి ముందు నుంచే బస్సు పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రయాణికులు బస్సు సరిగా లేదని డ్రైవర్‌కు ముందే తెలియజేసినట్లు సమాచారం. యర్రగొండపాలెం వద్ద బస్సును గంటసేపు ఆపి మరమ్మతులు చేసిన తర్వాత ప్రయాణం కొనసాగింది. అయితే కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. స్టీరింగ్ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో బస్సు నియంత్రణ కోల్పోయిందని డ్రైవర్ విచారణలో తెలిపినట్లు సమాచారం.
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం 6304285613, 9985733999, 7989537285, 9703578434 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వబడుతుందని ప్రకటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ లోని , మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

