ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ చీఫ్ మాయవతి ఎందుకు తప్పించారు?
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తప్పించారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తప్పించారు. ఆ స్థానంలో తన సోదరుడు ఆనంద్ కుమార్ తిరిగి నియమించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ఆకాశ్ రాజకీయాల్లో పూర్తి పరిపక్వత సాధించే వరకు తన సోదరుడే కొనసాగుతారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరిగిన రోజే మాయవతి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆకాశ్ వ్యాఖ్యలతో..
బీజేపీ ప్రభుత్వాన్ని బుల్‌డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే అది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్‌లో ఆయనపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆకాశ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఇటీవల ఆకాష్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఎస్పీ ఆయన ఎన్నికల ర్యాలీని కూడా రద్దు చేసింది.
మాయావతి తన రాజకీయ వారసుడిగా తమ్ముడి కుమారుడైన ఆకాశ్‌ను డిసెంబరులో ప్రకటించారు. లండన్‌లో ఎంబీఏ చదివిన ఆకాశ్ 2017లో బీఎస్పీలో చేరి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. అతి తక్కువ కాలంలోనే పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
కాగా బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్‌పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్‌పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Next Story