
మజ్లిస్ ను దెబ్బ కొట్టడానికి ఎంబిటీ ప్లాన్
తెలంగాణా రాజ్యాధికార పార్టీ తో పొత్తు ఉంటుందని ఊహాగానాలు
రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మజ్లీస్ బచావో తెహ్రీక్ (MBT) పోటీచేయడానికి సిద్ధమైంది. భావ సారూప్యత ఉన్న రాజకీయ పార్టీల మద్దతుతో ఆపార్టీ పోటీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ పాత బస్తీలో అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకోవడానికి ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేస్తుంది. మజ్లిస్ బచావ్ తెహ్రీక్ అంటే మజ్లీస్ పరిరక్షణ ఉద్యమం. చాంద్రాయణగుట్ట మాజీ శాసన సభ్యుడు అమానుల్లా ఖాన్ దీన్ని స్థాపించారు. మజ్లీస్ పార్టీ వ్యవస్థాపకులు అయిన సుల్తాన్ సల్లాఉద్దీన్ ఒవైసీతో విభేదించి ఆయన ఎంబీటీ స్థాపించారు. బాబ్రీ మసీదు కూలి పోవడానికి సుల్తాన్ సల్లాఉద్దీన్ ఒవైసి కారణమని నిందిస్తూ అమానుల్లాఖాన్ మజ్లీస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 1994 లో ఎంబిటీ స్థాపించారు.
వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో సుల్తాన్ సల్లాఉద్దీన్ ఒవైసి బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఛైర్మెన్ గా వ్యవహరించారు. ఆ సమయంలోనే బాబ్రీ మసీదు కూలి పోయింది. బీజేపీ , సంఘ్ పరివార్ కి సుల్తాన్ సల్లాఉద్దీన్ ఒవైసీ సహకరించడం వల్లే బాబ్రీ మసీదు కూలి పోయిందని అమానుల్లాఖాన్ ఆరోపిస్తూ మజ్లీస్ పార్టీ నుంచి వైదొలి గారు. ఆయన మరణానంతరం ఇద్దరు కుమారులు ఎంబీటీ కార్యకలాపాలను చూస్తున్నారు.
మజ్లీస్ పార్టీ అరాచకాలను వెలికి తీయడమే తమ లక్ష్యమని అమానుల్లా ఖాన్ కుమారుడు అంజదుల్లాఖాన్ "ఫెడరల్ తెలంగాణ"తో అన్నారు. ఆయన ఆజాంపురా మాజీ కార్పొరేటర్. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంబీటీ పాతబస్తీలోని మెజారిటీ వార్డుల నుంచి పోటీ చేయాలని అంజదుల్లాఖాన్ ప్లాన్ చేస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మజ్లీస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓడించనున్నట్టు ఆయన ప్రకటించారు. మజ్లీస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం వల్లే పాతబస్తీలో అరాచకాలు పెట్రేగి పోయాయని అంజదుల్లా ఖాన్ అంటున్నారు. కాంగ్రెస్ శాసన మండలి సభ్యులైన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం తెలంగాణా రాజ్యాధికార పార్టీ స్థాపించి ఎంబీటీతో జత కట్టి అనేక సామాజిక ఉద్యమాలు చేపడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీటీ తీన్మార్ మల్లన్న సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో యకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో మజ్లీస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన ఎంబీటీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పాతబస్తీలో ఎక్కువ కార్పో రేటర్లను కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంబీటీ కి ముస్లిం ఓటర్లతో బాటు హిందూ ఓటర్లు ఎక్కువ సంఖ్య లో మద్దతు పలుకుతున్నట్టు యకుత్పురా అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గడువు ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన సాగుతోంది.ఈ సంవత్సరం చివర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ , బి ఆర్ ఎస్ పార్టీలకు తోడు పాతబస్తీలో ఎంబీటీ పోటీ చేయడానికిసిద్ధమైంది.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం చేయాలని చూస్తోంది. బీజేపీ, బి ఆర్ ఎస్ బలం పెంచుకోవాలని చూస్తున్నాయి. పాతబస్తీలో మజ్లీస్ పార్టీ బలంగా ఉంది. మజ్లీస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఎం బి టీ తెలంగాణా రాజ్యాధికార పార్టీ తో కల్సి పని చేయాలని అనుకుంది. ఎంబీటీ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సిందే .

