
మేడారం జాతర ప్రారంభం
నాలుగు రోజుల పాటు కోటి మంది దర్శనం
తెలంగాణ రాష్ట్ర గిరిజను మేళ మేడారం మహా జాతర ఈ ఉదయం ఆరు గంటలకుప్రారంభమయింది. సారలమ్మ జాతరతో మొదలై మొత్తం నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగుతుంది.
రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. బుధవారం నుంచి ఈ జనవరి 31 వరకు వైభవంగా జరిగే జాతరను ఈ సారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. రూ.251 కోట్ల నిధులతో సర్కార్ సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించింది. భక్తులకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించింది.
ఈ రోజు సాయంత్రం గద్దెల పైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం చేయనున్నారు. కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలను గద్దెలపై పూజారులు ప్రతిష్టించనున్నారు. కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాళీ నడకన బయలుదేరారు. పగిడిద్దరాజు పూజారులు పూనుగొండ్ల నుండి 65 కి.మీ నడుచుకుంటూ మేడారంకు వస్తున్నారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ వారికి స్వాగతం పలకనున్నారు.
దేశ నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు కోటి మంది మేడారం సందర్శిస్తారని అంచనా. మేడారం మహాజాతరకు ఈసారి పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు తొలిసారిగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్తు, గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీసు, ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక మొదలవగా.. ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

