మీసేవ ఛార్జీలు పెంపు.. జీఎస్టీతో భారం 78% వరకు
x

మీసేవ ఛార్జీలు పెంపు.. జీఎస్టీతో భారం 78% వరకు

మీసేవ సేవలపై వినియోగ ఫీజులు పెరిగాయి. కొత్త రేట్లు, జీఎస్టీతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.


మీసేవ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లూ అనేక అవసరాలకు మీసేవకు వెళ్తున్న వారు రానున్న రోజుల్లో మీసేవకు వెళ్లాంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే మీసేవ సర్వీస్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. దాదాపు 50శాతం ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు వెల్లడించారు. ఆయన విడుదల చేసిన ఉత్తర్వుల్లో మరిన్ని విషయాలను వివరించారు. ప్రభుత్వం తాను అందించే పౌర సేవలపై 18శాతం జీఎస్‌టీ విధించనుందని ప్రకటించారు. జీఎస్టీతో కలిపి మొత్తం పెరుగుదల భారం 78 శాతం వరకు ఉంది.

కొత్త రేట్ల ప్రకారం, కేటగిరీ-ఏ సేవల ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి, కేటగిరీ-బీ సేవల ఛార్జీ రూ.45 నుంచి రూ.80కి పెరిగింది. ఈ పెంపుతో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, దరఖాస్తుదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. మీసేవ సేవల్లో కేటగిరీ-ఏలో సంబంధిత విభాగం పరిశీలన అవసరం లేకుండా సేవలు అందుతాయి. కేటగిరీ-బీలో మాత్రం విచారణ అనంతరం సేవలు అందుతాయని అధికారులు వివరించినట్లు తెలిసింది. ఇప్పటివరకు దరఖాస్తు సమయంలో కేవలం వినియోగ ఛార్జీ చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అదనపు ఖర్చులు కూడా పెరిగాయి. నాలుగు పేజీలకు మించి డాక్యుమెంట్లు స్కాన్‌ లేదా ప్రింట్‌ చేస్తే ఒక్కో పేజీకి రూ.2.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణగా, కుల ధ్రువీకరణ పత్రం కోసం గతంలో రూ.45 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు పెరిగిన ఛార్జీ, జీఎస్టీ కలిపి దాదాపు రూ.80 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక మీసేవ నిర్వాహకులకు చెల్లించే కమీషన్‌ కూడా గణనీయంగా పెరిగింది. కేటగిరీ-ఏ సేవలపై కమీషన్‌ రూ.13 నుంచి రూ.40.34కి చేరింది. కేటగిరీ-బీ సేవలపై కమీషన్‌ రూ.52.10కి పెరిగింది. కొన్ని సేవల్లో ప్రభుత్వానికి వాటా రూ.7గా కొనసాగుతుందని సమాచారం. అయితే కొన్ని సేవల్లో ఆ మొత్తాన్ని ఈ-సేవ కమిషనరేట్‌ మరియు మీసేవ నిర్వాహకుల మధ్య పంచుకుంటారని పేర్కొన్నారు.

అలాగే ఉపకార వేతనాల దరఖాస్తులో ఆధార్‌ ధ్రువీకరణ ఫీజును రూ.20 నుంచి రూ.35కి పెంచినట్లు వెల్లడైంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఎక్కువ వసూలు చేస్తే 1100 లేదా 18004251110 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అవసరమైతే అధికారిక ఈమెయిల్‌ ద్వారా కూడా సమాచారం ఇవ్వాలని తెలిపింది. మొత్తంగా ఈ నిర్ణయం ప్రజలపై అదనపు భారం మోపుతున్నప్పటికీ, మీసేవ నిర్వాహకులకు కొంత ఉపశమనం కలిగించేలా ఉంది.

Read More
Next Story