సిద్దిఖ్ కప్పన్ గుంటూరు వస్తున్నాడు, ఇంతకీ ఎవరీ  కప్పన్?
x
Siddique Kappan

సిద్దిఖ్ కప్పన్ గుంటూరు వస్తున్నాడు, ఇంతకీ ఎవరీ కప్పన్?

ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎప్ కార్యాలయంలో ఈ సమావేశం ఉంది. సిద్ధిఖ్ కప్పన్ న్ ఏమి చెబుతున్నారో వినాల్సిన అవసరం ఉంది...


ఈ నెల 26న గుంటూరు లో సిద్దిఖ్ కప్పన్ తో సమావేశం


ఇంతకీ సిద్ధిఖ్ కప్పన్ ఎవరు?

సిద్దిఖ్ కప్పన్ (Siddique Kappan) కేరళకు చెందిన జర్నలిస్టు. అళిముఖం(Azhimukham) న్యూస్ పోర్టల్ కు ఢిల్లీ నుండి పని చేస్తున్నాడు వయసు 40. 2020 సెప్టెంబర్ 14న, ఒక పందొమ్మిదేళ్ల హథ్రాస్ దళిత బాలిక మీద జరిగిన సామూహిక అత్యాచారం, హత్యను ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఉత్తర ప్రదేశ్ వెళ్లాడు. జైలు పాలయ్యాడు. నరక యాతన అనుభవించాడు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదల అయ్యాడు. ఆయన అరెస్టు జీవితం దేశంలో ఏమిజరుగుతున్నదో వివరంగా చెబుతుంది. అసలేం జరిగిందంటే..

దళిత బాలిక మరణాన్ని రిపోర్ట్ చేయటానికి ఆయన ఢిల్లీ నుండి హథ్రాస్ బయలుదేరాడు. అయితే, ఉత్తరప్రదేశ్ పోలీసులు అతన్ని మధుర టోల్ ప్లాజా వద్ద అడ్డగించి అరెస్టు చేశారు. ఉపా (UAPA)తో సహా అనేక అక్రమ కేసులను బనాయించి రెండేళ్లు జైల్లో పెట్టారు.

ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఒప్పుకోమని అతన్ని జైల్లో హింసించారు. కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి కార్యదర్శిగా ఉన్న కప్పన్ ను నకిలీ జర్నలిస్టు అని ఆరోపించారు. జైలు కాలంలోనే కప్పన్ తల్లి మరణించారు. షుగర్ వ్యాధి ఉన్న కప్పన్ జైల్లో కోవిడ్ బారిన పడటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన అనారోగ్య సమయంలో పోలీసులు అతని పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు. 2022 సెప్టెంబర్ లో సుప్రీం కోర్టు ‘ఈ దేశంలో ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వుంది’ అంటూ ఆయనకు బెయిలు యిచ్చినా కూడా, మనీ లాండరింగ్ కేసును ఆయన మీద బనాయించటం వలన ఆయన వెంటనే బయటకు రాలేక పోయారు. 2022 డిసెంబర్ 23 వరకూ ఆయన జైల్లోనే వుండిపోయాడు. ఆరోజు ఆయనకు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరుచేసింది.

హథ్రాస్ అత్యాచారం హత్య ఏమిటి?

2020 సెప్టెంబర్ 14న, ఉత్తర ప్రదేశ్ లోని హథ్రాస్ జిల్లాలో ఒక పందొమ్మిదేళ్ల దళిత బాలిక పేడ ఏరుకోవటానికి పొలాల్లోకి వెళ్లింది. సందీప్, రాము, లవ్ కుష్, రవి అనే నలుగురు ఠాగుర్ అనే ఆధిపత్య కులానికి చెందిన యువకులు ఆమెను చున్నీతో లాక్కొని వెళ్లి పొలాల్లో అత్యాచారం చేశారు. అలా లాక్కుని వెళ్లే క్రమంలో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. అత్యాచారం తరువాత ఆమెను గొంతు నులిమి చంపటానికి ప్రయత్నించగా ఆమె నాలుక తెగి పోయింది. చావుబతుకుల్లో పడి ఉన్న ఆ బాలికను అనేక ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేక సెప్టెంబర్ 29న మరణించింది. చనిపోయే లోగా ఆమె ఇచ్చిన నాలుగు వాంగ్మూలాలలోనూ తనను అత్యాచారం చేసి చంప ప్రయత్నించిన నలుగురి పేర్లను పేర్కొన్నది.

దేశమంతా ఈ ఘటనకు ఉలిక్కి పడింది. ఆమె మరణం తరువాత కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి, పోలీసులు అర్థరాత్రి పూట ఆ బాలిక శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితర రాజకీయ నాయకులను అడ్డగించారు. జర్నలిస్టులను రానీయకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హథ్రాస్ బాలికకు న్యాయం జరగాలని దేశ విదేశాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.




నిజాయితీపరుడైన జర్నలిస్టుగా, ముస్లింగా, కేరళా రాష్ట్రీయుడిగా సిద్దిక్ కప్పన్ -బహువిధాల బాధితుడయ్యాడు. అదే సమయంలో భయాన్ని జయించి ఆయన విజేత కూడా అయ్యాడు. మానవ హక్కులను కాపాడుకోవటానికి సిద్దిక్ కప్పన్ లాంటి పౌరులు కావాలి. నిజాలను నిష్పక్షపాతంగా ప్రపంచానికి తెలియచేయటానికి వెన్ను చూపని సిద్దిక్ కప్పన్ లాంటి జర్నలిస్టులు ఈ దేశానికి ఇప్పుడు కావాలి. సిద్దిక్ కప్పన్ జై కొట్టి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొందాం. ఆయన ముఖాముఖిలో ప్రజాస్వామిక వాదులు పాల్లొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.




Read More
Next Story