భోగినాడు ఇరగదీస్తున్న సంబరాల ‘రాంబాబు’ : ఎవరో తెలుసా!
ఆయనో మంత్రి.. పెద్ద శాఖ కూడా. పవన్ కల్యాణ్ పై ఒంటికాలితో విరుచుకుపడతారు. చంద్రబాబును దూదేకినట్టు ఏకుతాడు. చిందేస్తాడు, డాన్స్ చేస్తాడు. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. ఆమధ్య ఎవరో అమ్మాయితో హస్కీ టోన్ లో మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఈమధ్య ఎప్పుడో చిందేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇవాళ సంక్రాంతి సందర్భంగా లంబాడా మహిళలతో కలిసి రెచ్చిపోయి డాన్స్ చేసి మళ్లీ వార్తలో వ్యక్తిగా నిలిచారు. పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడూ జనం నోళ్లలో నానడం అంబటి రాంబాబుకి ఇష్టం. ఇక పవన్ కల్యాణ్ మీదికైతే ఒంటికాలి మీద లేస్తారు. చంద్రబాబును, ఆయన పార్టీని దూదేకినట్టు ఏకుతారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నా దేవుడంటారు. జగన్ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఇంట్లో కట్టేసిన గంగిగోవుల్లాంటి వాళ్లమని చెప్పుకొస్తారు. ఇలా ఒకటా రెండా.. సంబరాల రాంబాబుగా మారిన అంబటి గురించి ఎన్నైనా చెప్పవచ్చు.
వాహ్వా.. అంబటి, ఎంత బాగుందో డాన్స్...
ఏపీలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకున్నారు. తాజాగా జరిగిందేమిటంటే, రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. భోగి సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పెద్దఎత్తున భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల్ని పిలిపించారు. లంబాడా మహిళలు వచ్చి నృత్యాలు చేశారు. సంప్రదాయ సంగీతంతో తీన్మార్ పాటలూ వేశారు. ఇక అంతే మంత్రి అంబటి రాంబాబు తట్టుకోలేక పోయారు. మార్నింగ్ వాకింగ్ డ్రస్ లోనే వచ్చిన రాంబాబు రంగంలోకి చిందేశారు. లయబద్ధంగా డాన్స్ చేశారు. ఇలా దాదాపు ఓ పది నిమిషాల పాటు సందడి చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ డాన్స్ చేసి చూపరుల్ని అలరించారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. గత ఏడాది కూడా మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను చుట్టబెట్టాయి.
వెల్లువెత్తిన విమర్శలు..
అయితే మంత్రి అంబటి రాంబాబు డాన్స్ పై పలువర్గాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. మంత్రి అంబటికి ఏమైనా బాధ్యత ఉందా అని కొందరు విరుచుకుపడితే మరికొందరు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మంత్రి ఇటువంటి చిల్లర పనులు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి మొదలు పల్నాడు జిల్లా అంతటా నీళ్లు లేక పంటలు వేయలేని దుస్థితిలో ఉంటే పట్టించుకోవాల్సిన మంత్రి అంబటి చిందులు వేస్తూ డాన్స్ చేస్తారా అని సోషల్ మీడియా ఏకేస్తోంది.
భోగి మంటల్లో వైసీపీ మ్యానిఫెస్టో పేపర్లు..
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ అమరావతి రాజధాని ప్రాంతం మందడంలో భోగిమంటల వేడుకల్లో పాల్గొన్నారు. నాలుగున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి.
గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో బోగి మంటల వేడుకలు జరిగాయి. ‘కీడు తొలగాలి... ఏపీ వెలగాలి’ పేరుతో బోగి మంటలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవో ప్రతులను బోగి మంటల్లో దగ్దం చేశారు. వైసీపీ మ్యానిఫెస్టో పేపర్లను టీడీపీ నేతలు తగలబెట్టారు.