లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
x
డాక్టర్ లమానీ

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

కాంట్రాక్టర్ నుంచి ఐదు లక్షల తీసుకుంటున్న క్రమంలో లోకాయుక్త పోలీసుల దాడులు


Click the Play button to hear this message in audio format

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేను లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. గదగ్ జిల్లాకు చెందిన శిరహట్టి అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమానీ కాంట్రాక్ట్ విషయంలో రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేశాడని తెలిసింది. గదగ్ జిల్లాలోని చించాలికి చెందిన కాంట్రాక్టర్ విజయ్ పూజార్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు ఆపరేషన్ ప్రారంభించి అరెస్టులు చేశారు.

రూ. 11 లక్షల లంచం డిమాండ్

కాంట్రాక్టర్ మైనర్ ఇరిగేషన్ శాఖ కింద రోడ్డుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించే పనులు చేస్తున్నాడు. పని నిర్వహించడానికి సహకారం కోరుతూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు, వారు భారీగా లంచం డిమాండ్ చేసినట్లు లోకాయుక్త పోలీసులు తెలిపారు.
పూజార్ నుంచి ఎమ్మెల్యే, అతని మనుషులు పని పూర్తి కావాలంటే మొత్తం రూ. 11 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. మొదటి విడత రూ. 5 లక్షలు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు ప్రణాళిక ప్రకారం దాడి చేశారు.
డాక్టర్ లమానీతో పాటు, ఆయన సన్నిహితుడు మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ అసిస్టెంట్ గురు నాయక్‌లను అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. పూజార్ లంచం మొత్తాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లోకాయుక్త పోలీసులు రంగప్రవేశం చేశారు. నగదుతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. తరువాత కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసు పెద్ద రాజకీయ కలకలం రేపింది. విస్తృత చర్చకు దారితీసింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల నుంచి ఇంత పెద్ద లంచం డిమాండ్ చేయడంపై కాంట్రాక్టర్ వర్గం నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన డాక్టర్ లమానీ వృత్తిరీత్యా వైద్యుడు.
రాజకీయాల్లోకి రాకముందు చాలా సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవలందించారు. హవేరి జిల్లాలోని హిరేకెరూర్ తాలూకాకు చెందిన ఆయన పేద, మధ్యతరగతి వర్గాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని అంటారు.
వైద్య రంగంలో ఆయన సేవ, సాధారణ ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు ఆయనను క్రియాశీల రాజకీయాల్లోకి ఆకర్షించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన నియోజకవర్గం నుంచి , మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ప్రవేశించారు.
Read More
Next Story