ఎమ్మెల్యేకే సైబర్ టోపీ..
x

ఎమ్మెల్యేకే సైబర్ టోపీ..

ప్రభుత్వ పథకం పేరుతో కాల్ చేసి నమ్మబలికి డబ్బులు తీసుకున్న సైబర్ మోసగాళ్లపై పోలీసుల దర్యాప్తు వేగం పెరిగింది.


జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. వికసిత్ భారత్ పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన వ్యక్తి మాయమాటలు చెప్పి పల్లారాజేశ్వర్ రెడ్డిని ముగ్గులోకి దింపాడు. పేదలకు రుణాలు అందిస్తున్నామని, మీ నియోజకవర్గంలోని అర్హుల జాబితా పంపాలని నమ్మబలికాడు. ప్రజలకు మేలు జరుగుతుందన్న భావనతో ఎమ్మెల్యే.. నేరగాడు చెప్పినట్లు చేశాడు. తీరా.. చివరకి లక్ష రూపాయాలు మోసపోయారు. ఇదంతా తన చుట్టూ అల్లిన సైబర్ మోసం అని గ్రహించిన వెంటనే ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. సైబర్ నేరాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. అధికారులు ఎంత అప్రమత్తం చేస్తున్నా సైబర కేటుగాళ్ల వలలో పడుతున్న వారు పెరుగుతూనే ఉన్నారు. విద్యావంతులు, ఉన్నపదవుల్లో ఉన్నవారికి సైతం ఈ సైబర్ నేరగాళ్లు సులభంగా కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘటనతో సైబర్ నేరగాళ్ల దగ్గర హిట్ లిస్ట్ జాబితాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తాను ప్రభుత్వ అధికారినని నమ్మబలికినట్లు తెలిసింది. వికసిత్ భారత్ పథకం కింద అర్హులకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారుల జాబితా అందిస్తే వారికి ప్రయోజనం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలిసింది. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో మోసం ప్రారంభమైంది. ప్రతి లబ్ధిదారుడి నుంచి రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పి, 40 మందికి సంబంధించిన మొత్తం రూ.1 లక్షను వెంటనే పంపాలని నిందితుడు కోరినట్లు సమాచారం. దీనిని నిజమని నమ్మిన ఎమ్మెల్యే ఫోన్ పే ద్వారా ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

డబ్బు అందుకున్న తర్వాత కూడా నిందితుడు మరింత డబ్బు కోరడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చినట్లు సమాచారం. వెంటనే విచారణ చేయగా ఇది ప్రభుత్వ పథకం కాదని, మోసం జరిగిందని ఆయన గ్రహించినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి ఫోన్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముందస్తుగా ఫీజులు అడిగితే అది మోసం కావచ్చని సూచిస్తున్నారు. ఈ సంఘటనతో డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి బయటపడింది.

Read More
Next Story