ఫిరాయింపు నేతల కేసులో బిగ్ ట్విస్ట్..
x

ఫిరాయింపు నేతల కేసులో బిగ్ ట్విస్ట్..

పార్టీ మార్పు వివాదంపై స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ. తదుపరి దశలో కీలక పరిణామాలపై దృష్టి.


తెలంగాణ ఫిరాయింపు నేతల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తమతమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణలో స్పీకర్ నిర్ణయంపై వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సంబంధిత ఎమ్మెల్యేలు, స్పీకర్ తమ వాదనలను కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. విచారణ చేపట్టారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పార్టీ మారినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.

దీంతో ఆయన నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన తీర్పును ఛాలెంజ్ చేస్తూ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.బహిరంగంగా పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని వారు వాదించారు. స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని భావించిన హైకోర్టు, కేసును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి ప్రతివాదులందరూ తమ కౌంటర్లు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తదుపరి పరిణామాలు పరిస్థితిని మరింత స్పష్టతకు తీసుకురానున్నాయి.

Read More
Next Story