యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్: ప్రధాని మోదీ పచ్చజెండా
x
యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు (ఫొటో కర్టసీ : రైల్వేశాఖ)

యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్: ప్రధాని మోదీ పచ్చజెండా

భక్తులకు గుడ్‌న్యూస్… ఇక గుట్టకు చవక ప్రయాణం


తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు రైలు ప్రయాణం మరింత సులభం కానుంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సికింద్రాబాద్ నుంచి రాయగిరి వరకు కొత్త రైల్వే మార్గానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో పచ్చజెండా ఊపనున్నారు. ఈ ప్రాజెక్టుతో భక్తులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

పట్టాలెక్కనున్న యాదగిరిగుట్ట రైల్వేలైన్

యాదగిరిగుట్టకు మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టు ఏప్రిల్ మొదటివారంలో పట్టాలెక్కనుంది.తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు భక్తులు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించనున్నారు. రాయగిరి వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు ప్రారంభించనుంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి అయింది. సికింద్రాబాద్ నుంచి మౌలాలి- చర్లపల్లి, ఘట్ కేసర్ మీదుగా రాయగిరి వరకు 33 కిలోమీటర్ల రైలు మార్గాన్ని 430కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ మార్గం నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి లింగంపల్లి, మేడ్చల్, ఉందానగర్, సికింద్రాబాద్ నుంచి సులభంగా యాదగిరిగుట్టకు వెళ్లవచ్చు.

నామమాత్రపు చార్జీతో రైలు ప్రయాణం

హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులు తిరుగుతున్నాయి. నాంపల్లి -లింగంపల్లి, ఫలక్ నుమా- లింగంపల్లి, లింగంపల్లి - హైదరాబాద్, లింగంపల్లి - హైటెక్ సిటీ, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్ నుమా -హైదరాబాద్, సికింద్రాబాద్-బొల్లారం- మేడ్చల్, ఫలక్ నుమా- ఉందానగర్-శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్-మౌలాలి-ఘట్ కేసర్, మౌలాలి- సనత్ నగర్, కాచిగూడ- సీతాఫల్ మండీ- మల్కాజిగిరి-మౌలాలి రైళ్లు నడుస్తున్నాయి. కేవలం 5,10,15 రూపాయల చార్జీతోనే ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.

ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచండి : సీఎం

హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు నడపాల‌ని ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసుల సంఖ్య పెంచ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులను న‌డ‌పాల‌ని సీఎం కోరారు. ఎంఎంటీఎస్‌లో ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు.

లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంచండి

ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం వల్ల ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని తేలింది. ఎంఎంటీఎస్ స్టేష‌న్లు లోప‌లికి ఉండటంతో అక్క‌డ‌కు ప్రయాణికులు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్ర‌యాణికుల సంఖ్య పెంపు, వ‌స‌తులు మెరుగుపరచడానికి ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద సౌకర్యాలు మెరుగుపడితే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. భక్తులకు చవకగా, సురక్షితంగా, వేగవంతంగా ప్రయాణం అందిస్తూ ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజా రవాణా రంగానికి కొత్త దిశ చూపనుంది.
Read More
Next Story