డీఎంకే సర్కార్ క్షమాపణ చెప్పాల్సిందేనన్న ప్రధాని మోదీ.. కారణమేంటి?
x

డీఎంకే సర్కార్ క్షమాపణ చెప్పాల్సిందేనన్న ప్రధాని మోదీ.. కారణమేంటి?

త‌మిళ‌నాడులో నూత‌న ఇస్రో స్పేస్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ప్ర‌క‌ట‌న‌లో వివాదానికి కేంద్ర బిందువైంది.


త‌మిళ‌నాడులో నూత‌న ఇస్రో స్పేస్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ప్ర‌క‌ట‌న‌లో వివాదానికి కేంద్ర బిందువైంది. కుల‌శేఖ‌ర‌ప‌ట్నంలో ఇస్రో స్పేస్‌పోర్ట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర మ‌త్స్య‌శాఖ మంత్రి అనితా రాధాకృష్ణ‌న్ ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశార‌ని చెబుతున్నారు. ప్రక‌ట‌న‌లో రాకెట్‌పై చైనా జెండా ప్ర‌చురిత‌మ‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యవ‌హారంపై బీజేపీ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించింది. స్ధానిక దిన‌ప‌త్రిక‌ల్లో జారీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌ను బీజేపీ రాష్ట్ర చీఫ్ కే. అన్నామ‌లై ఖండించారు. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని డీఎంకే దెబ్బతీశారని మండిప‌డ్డారు.

ఆ ప్రకటనలో ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరుల ఫోటోలు ఉన్నాయి. చైనా జెండాతో కూడిన రాకెట్ ఉంది.

ప్రకటన దేని గురించి..

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినం పట్టణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టనున్న కొత్త రాకెట్ ప్రయోగ కేంద్రానికి సంబంధించిన ప్రకటన అది. ప్రధాని మోదీ రూ. 986 కోట్లతో ఇస్రో కొత్త ప్రయోగ సముదాయానికి కులశేఖరపట్టినంలో బుధవారం శంకుస్థాపన చేశారు. తూత్తుకుడిలో దాదాపు రూ.17,300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రారంభోత్సవం చేశారు.

డీఎంకే క్షమాపణ చెప్పాలని ప్రధాని డిమాండ్ ..

చైనా జెండాతో కూడిన రాకెట్‌తో ఇస్రోపై వార్తాపత్రికల్లో ప్రకరణ ఇవ్వడంపై ప్రధాని మోదీ తమిళనాడు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. తిరునెల్వేలిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని, దేశ అంతరిక్ష రంగాన్ని అవమానించిన డిఎంకె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘ఈరోజు డీఎంకే భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని, భారత అంతరిక్ష రంగాన్ని అవమానించింది. దీనికి వారు క్షమాపణలు చెప్పాలి” అని మోదీ తన X (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.

"భారతదేశ అంతరిక్ష పురోగతిని చూడటానికి వారు సిద్ధంగా లేరు. మీరు చెల్లించే పన్నులతో వారు ప్రకటనలు ఇస్తారు. వారు మన శాస్త్రవేత్తలను, మన అంతరిక్ష రంగాన్ని, పన్నులు చెల్లించే ప్రజలను అవమానించారు. డీఎంకేను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని’’ అన్నారు.

డీఎంకేపై అన్నామలై దాడి ..

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కూడా చైనా జెండాతో కూడిన ప్రకటనపై డీఎంకేపై విరుచుకుపడ్డారు.


‘‘ఇస్రో తొలి ఎంపిక త‌మ‌ళ‌నాడే. ఇస్రో తొలి లాంఛ్ ప్యాడ్ కు సిద్ధ‌మైన‌ప్పుడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అప్ప‌టి సిఎం తిరు అన్నాదురై తీవ్రమైన భుజం నొప్పి కారణంగా హాజరుకాలేకపోయారు. ఆయన స్థానంలో మంత్రి మథియాళగన్‌ను సమావేశానికి పంపారు. ఆయన "మత్తులో" కార్యక్రమానికి వచ్చారు. ఇదీ DMK తీరు. వారు పెద్దగా మారలేదు. సరికదా.. ఇంకా అధ్వాన్నంగా తయారయ్యారు. ’’ అని కె. అన్నామలై పేర్కొన్నారు.

ప్రకటనను సమర్థించిన కనిమొళి


ప్రకటనపై డీఎంకే ఎంపీ కనిమొళిని ప్రశ్నించగా.. “ఆర్ట్‌వర్క్ చేసిన వ్యక్తి ఈ చిత్రాన్ని ఎక్కడ నుండి తెచ్చారో నాకు తెలియదు. చైనాను భారత్ శత్రు దేశంగా ప్రకటించిందని నేను అనుకోవడం లేదు. చైనా ప్రధానిని మన ప్రధాని మోదీ ఆహ్వానించడం, వారు మహాబలిపురం వెళ్లడం చూశాను. మీరు వాస్తవాన్ని గ్రహించడం లేదు. సమస్యను దారి మళ్లించడానికి కారణాలు వెతుకుతున్నారు.” అని అన్నారు.

Read More
Next Story