కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే.. ప్రశాంత్ కిషోర్ అంచనా..
x

కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే.. ప్రశాంత్ కిషోర్ అంచనా..

ఆంధ్ర ఎన్నికలపై అంచనాలను ప్రకటించి ఆంధ్రలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వంపై కూడా తన ప్రెడిక్షన్స్ చెప్పారు. మళ్లీ మోదీనే గెలుస్తారని చెప్పారు.


2024 సార్వత్రిక ఎన్నికలతో మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విన్స్ నమోదు చేయనుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. ‘అప్‌కి బార్ 400 పార్’ నినాదంతో బీజేపీ ప్రచారం చేస్తుంటే.. అది సాధ్యమయ్యే అవకాశాలు లేకపోలేదంటూ బీజేపీ నినాదాలకు పీకే ఊతమిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ కావొచ్చని, ఇంకా నెంబర్ పెరిగే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయని జోస్యం చెప్పారు. ఎంత లేదన్నా అదే నెంబర్‌తో అయితే బీజేపీకి మోదీ మరో విజయాన్ని అందిస్తారని, దేశంలో బీజేపీ అంటే పూర్తి వ్యతిరేకత లేదని, అదే విధంగా పూర్తి సానుకూలత లేదని ఆయన వివరించారు.

‘మద్దతుదార్లే అలా అంటారు’

రాహుల్ గాంధీ లాంటి ఛాలెంజర్ ఉంటే దేశంలో పరిస్థితులు తప్పకుండా మారతాయని అనే వారు కూడా లేకపోలేదని పీకే గుర్తు చేశారు. ‘‘అలాంటి మాటలు మద్దతుదారులు అంటుంటారు. కానీ నేను వారిని మించిన విస్తృతమైన ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పైన కానీ, మోదీపైన కానీ దేశమంతటా వ్యతిరేకత లేదు. అదే తరహాలో ఛాలెంజర్‌గా ఉన్న వ్యక్తికి సానుకూలత కూడా లేదు. కాబట్టి ఈసారి కూడా 2019 ఎన్నికలతో పోలిస్తే పార్టీలకు వచ్చే నెంబర్లలో పెద్దగా తేడా వస్తుందని నేను భావించడం లేదు’’అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్.

మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే

అసలు చర్చ నుంచి దృష్టిని మరల్చినందుకు ప్రధాని మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని, దానికి తోడు ఈ చర్యల ద్వారా వాళ్లు లబ్ది కూడా పొందారి పీకే వివరించారు. ‘‘మోడీ ఓడిపోతున్నారని ఎవరూ చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈసారి బీజేపీకి 370 రావనే అంటున్నారు. కానీ వాళ్లు కనీసం 320 సీట్లు గెలుచుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు’’అని చెప్పారు. ప్రభుత్వాన్ని స్థాపించాలంటే 370 రావాల్సిన అవసరం లేదని, మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లు గెలిస్తే సరిపోతుందని చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారుతోంది.

2024లో మోదీ ప్రభుత్వం కుప్పకూలుతుందని, దేశంలో ప్రజాస్వామ్య బద్దమైన కొత్త ప్రభుత్వం వస్తుందని ఎన్నికల ప్రారంభానికి ముందు నుంచే ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు పీకే వ్యాఖ్యలు వారి వాదనలకు పూర్తి విరుద్ధంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More
Next Story