అవినీతి పెరిగింది.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: ప్రధాని మోదీ
x

అవినీతి పెరిగింది.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: ప్రధాని మోదీ

కర్ణాటకలో అవినీతి పెరిగిపోయి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు ప్రధాని మోదీ.గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను చూసి జనం విసిగెత్తుతున్నారని చెప్పారు.


కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ లాంఛనంగా కర్ణాటక నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహించిన కలబురిగిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

కర్ణాటకలో అవినీతి పెరిగిపోయి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను చూసి జనం విసిగెత్తడం ప్రారంభించారని చెప్పారు. రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులకు రక్షణ కల్పించడమే అందుకు కారణమని, దాంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సరిగా ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం మొదలు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ఎన్ని వేషాలు మార్చినా ..దుర్మార్గాలు మాత్రం ఆగడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పై కర్ణాటక వాసులు కోపంగా ఉన్నారన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో తాము అత్యధిక స్థానాలు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలోనూ తమ దూకుడు కొనసాగుతుందన్నారు. భారీగా తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే..బీజేపీని రికార్డు స్థాయిలో గెలిపించాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్టుగా ఉందన్నారు. శ్రీనగర్‌లో తాను నిర్వహించిన ర్యాలీకి ఇదే స్థాయిలో జనం వచ్చారని గుర్తు చేశారు. దక్షిణ భారతంలో కూడా బీజేపీకి అన్ని వర్గాల మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

ర్యాలీకి హాజరయిన వారిలో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, ఆయన కుమారుడు, బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కలబురిగి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ ఉన్నారు.

Read More
Next Story