కేరళలో ప్రధాని మోదీ మూడోసారి పర్యటన.. బీజేపీని గెలిపిస్తుందా?
x

కేరళలో ప్రధాని మోదీ మూడోసారి పర్యటన.. బీజేపీని గెలిపిస్తుందా?

ఉత్తరాధిపై పట్టు సాధించిన కమలం పార్టీ.. ఇక దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. పార్లమెంటు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేరుగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగుతున్నారు.


ఉత్తరాధిపై పట్టు సాధించిన కమలం పార్టీ.. ఇక దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. పార్లమెంటు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేరుగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగుతున్నారు. సౌత్ ఇండియా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు మోదీ.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక , తమిళనాడు, కేరళలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. కేరళను చేజిక్కించుకోవడంలో భాగంగా ఆయన త్వరలో ఆ రాష్ర్టంలో మరోమారు పర్యంటించనున్నారు. ప్రధాని రెండు నెలలలోపే కేరళలో పర్యటించడం ఇది మూడోసారి.

దాదాపు ఏడాది క్రితం కేరళలో అధికారం దక్కించుకోవాలన్న తమ పార్టీ ఆకాంక్షను మోదీ బయటపెట్టారు. మార్చి 2, 2023న మోదీ చేసిన ప్రకటనతో క్రైస్తవులు అధికంగా ఉన్న నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో BJP అద్భుతమైన పనితీరును కనపర్చింది. దీంతో పార్టీలో జోష్ ను కూడా పెంచింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మోదీ మంగళవారం ఒక అధికారిక కార్యక్రమం కోసం కేరళ రాష్ట్ర రాజధానికి రానున్నారు. అక్కడ బీజేపీ రాష్ట్ర విభాగం నిర్వహిస్తున్న 'పాదయాత్ర' ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవాలని లక్ష్యంతో కేరళలో మోదీ పర్యటించడం పట్ల రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది.

బీజేపీకి ఆదరణ పెరుగుతోంది.. వాచస్పతి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ప్రధాని పర్యటన తమకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తోందని కేరళ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ వాచస్పతి అన్నారు. కేరళపై కేంద్ర నాయకత్వం దృష్టి, మోదీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ఉటంకిస్తూ.. పార్టీ అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు.

మోడీ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయడం తమ కర్తవ్యమని, కేరళ ప్రజల్లో ప్రధానికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని ఓ బిజెపి కార్యకర్త అన్నారు. సర్వేల ప్రకారం రాష్ట్రంలోని 40 శాతం మంది ఓటర్లు మోదీని మరోసారి ప్రధానిగా చూడాలనుకుంటున్నారని అన్నారు.

2014, 2019 ఎన్నికలతో పోల్చితే.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బీజేపీకి అనుకూల వాతావరణం, గుర్తింపు, ఆదరణ కనిపిస్తున్నాయని వాచస్పతి అన్నారు.

2019లో వయనాడ్ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ విజయానికి యుడీఎఫ్ దోహదపడిందని, అయితే ఇప్పుడు అలాంటి వేవ్ లేదని అన్నారు. దేశవ్యాప్తంగా, ఇటు మలయాళీలలో మోదీ సెంటిమెంట్ బలంగా ఉందని వాచస్పతి పేర్కొన్నారు.

"కేరళలోని చాలా మంది ఇప్పుడు మోడీ క్యాబినెట్‌లో రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఆయన పర్యటన ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ కోరిక నెరవేర్చడానికి పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

బిజెపి కార్యనిర్వాహకుడు ఒకరు మోదీ విజ్ఞప్తిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలోని ఎక్కువగా ఉన్న మైనార్టీలు ఈ సారి మోదీకి జై కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్, సీపీఎం మాత్రం బీజేపీ గెలువకుండా చేయాలని చూస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రలోభాలకు లొంగరు..సీపీఎం

ఎన్‌డిఎకు వెలుపల ఉన్న పార్టీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని, అయితే అది కేరళలో పని చేయదని సీపీఎం సీనియర్ నేత ఎంఎ బేబి అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు చెందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను బీజేపీ నియమించడం ఈ రాజకీయ అవకాశవాదానికి ఒక ఉదాహరణ అని బేబీ విమర్శించారు. కేరళలో ఇలాంటి వ్యూహాలు ఫలించవని, ఈ వాస్తవాన్ని మోదీ గ్రహించాలని ఆయన స్పష్టం చేశారు.

మోడీ ఇమేజ్ కేరళలో ఓటర్లను ప్రభావితం చేస్తుందన్న భావనను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొట్టిపారేశారు. 2016లో కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే సాధించగలిగిందని ఆయన గుర్తుచేశారు.

మోదీ పదేపదే పర్యటనలు చేయడం వల్ల కేరళలోని సీపీఐ(ఎం)కు, దాని మిత్రపక్షాలకు ఎలాంటి ముప్పు ఉండదని బేబీ అన్నారు.

బీజేపీ పాలనలో మైనారిటీలు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొడిక్కున్నిల్ సురేష్ అన్నారు.

"మోడీని చాలాసార్లు కేరళకు రానివ్వండి. కాని బిజెపి వ్యతిరేకించే వారిలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే మెజారిటీ ఓటర్లు సమాజంలోని ప్రజాస్వామ్య-లౌకిక వర్గాలతో జతకట్టారు" అని ఆయన అన్నారు.

మణిపూర్ లో ఎందుకు పర్యటించలేదు..

మణిపూర్ హింసాకాండ గురించి సురేష్ మాట్లాడుతూ.. ప్రధాని హోదాలో మణిపూర్‌ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కొంతమంది నాయకులు జోక్యం చేసుకోగా, మోదీ మాత్రం మణిపూర్‌లో పర్యటించలేదు కదా.. ప్రజల సమస్యలను గుర్తించలేదన్నారు.

కేరళలో కీలకమైన మైనారిటీ ఓట్లను దక్కించుకోవడానికి బీజేపీ కష్టపడుతుందని సురేష్ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఎన్నికల అవకాశాలు సన్నగిల్లాయన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ మధ్యనే ఉంటుందన్నారు.

జనవరిలో రెండు సార్లు పర్యటించిన మోదీ..

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల ప్రాబల్యం ఉన్న రాష్ట్రంపై బిజెపి దృష్టి పెట్టింది. మోదీ జనవరిలో కేరళలో రెండు పెద్ద రోడ్‌షోలు నిర్వహించారు. ఒకటి త్రిస్సూర్‌లో, మరొకటి కొచ్చిలో.

జనవరి మొదటి వారంలో త్రిసూర్‌లో పర్యటించిన మోదీ.. బీజేపీ నిర్వహించిన మహిళా సదస్సుకు హాజరయ్యారు.

జనవరి మధ్యలో మరోసారి మోడీ కేరళను సందర్శించారు. అక్కడ ప్రముఖ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిన నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహంతో సహా వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు.

త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయంలో ప్రార్థనలు చేసిన మోదీ..కొచ్చిలోని మెరైన్ డ్రైవ్‌లో దాదాపు 6,000 మంది 'శక్తి కేంద్రాల' ఇన్‌చార్జ్‌లతో ఏర్పాటుచేసిన పార్టీ సమావేశంలో ప్రసంగించారు కూడా.

Read More
Next Story