మొయినాబాద్ ఫామ్ హౌస్ మిస్టరీ: రాజకీయ డ్రామా నుంచి డ్రగ్స్ పార్టీ దాకా
x
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాం హౌస్

మొయినాబాద్ ఫామ్ హౌస్ మిస్టరీ: రాజకీయ డ్రామా నుంచి డ్రగ్స్ పార్టీ దాకా

నాడు రాజకీయ తుపాన్… నేడు డ్రగ్స్ దుమారం – మళ్లీ చర్చలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్


హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. ఒకప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర ఆరోపణలతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఇదే ఫామ్ హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ దాడులతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. పోలీసుల ఈగల్ బృందం నిర్వహించిన ఆకస్మిక దాడులు, కాల్పుల కలకలం, డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు భారీ సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటన నాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమైన ఈ కేసు జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర కేసు

2022వ సంవత్సరం అక్టోబర్ నెలలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన సంఘటన పెద్ద రాజకీయ తుఫాన్‌ను రేపింది. కొంతమంది వ్యక్తులు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీ మారాలని ప్రలోభపెట్టారని ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీర్‌వెల్లి హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు వంటి ఎమ్మెల్యేలను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ఆరోపించారు. భారీ మొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, రాజకీయ పదవుల ఆఫర్లు ఇచ్చి బీజేపీలో చేరాలని ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

నాడు ఫామ్‌హౌస్‌లో సోదాలు

నాడు పోలీసులు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజులు వంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై అప్పటి సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఇది బీఆర్ఎస్ సృష్టించిన రాజకీయ నాటకమని విమర్శించారు.

న్యాయపరమైన పరిణామాలు

ఈ కేసు దర్యాప్తు విషయం అనేక మలుపులు తిరిగింది. తొలుత తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా, తర్వాత ఈ వ్యవహారం న్యాయస్థానాల్లోకి వెళ్లింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న అంశంపై కూడా పెద్ద చర్చ జరిగింది. కోర్టుల్లో ఈ కేసుపై విచారణలు కొనసాగాయి.గతంలో ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు నెలకొంది.తెలంగాణలో ఒకప్పుడు భారీ సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నైతికతపై కూడా ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

ఫాంహౌస్ లో డ్రగ్స్ బాగోతం గుట్టురట్టు

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో తెలంగాణ పోలీసుల ఈగల్ (EAGLE) బృందం ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం రేగింది. డ్రగ్స్ సేవిస్తున్నారని అనుమానంతో పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఈగల్ దాడి తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మరో నలుగురికి మాదకద్రవ్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

కాల్పుల కలకలం

పోలీసులు అక్కడికి చేరుకోగానే ఫామ్‌హౌస్‌లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆందోళనకు గురై హంగామా చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో నమీద్ మిశ్రా అనే వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.పోలీసులను భయపెట్టడానికి నమీద్ మిశ్రా తుపాకీతో కాల్పులు జరిపాడుఅయితే కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్‌, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడి నుంచి 2.5 గ్రాముల కొకైన్‌ను కూడా అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

పోలీసుల అదుపులో 10 మంది

ఈ డ్రగ్స్ పార్టీ దాడుల సమయంలో ఫామ్‌హౌస్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.అందులో కొందరికి నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్వోటీ (SOT) పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో మరే ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయేమో గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను కూడా రంగంలోకి దించారు.ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పార్టీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఒకప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపింది. ఇప్పుడు అదే ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలంతో మరోసారి వార్తల్లోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఈ ఘటనతో మొయినాబాద్ ఫామ్ హౌస్ మరోసారి రాజకీయ వివాదాల కేంద్రంగా మారింది.
Read More
Next Story