
మొయినాబాద్ ఫాంహౌస్ సీజ్.. అసైన్డ్ భూమిగా గుర్తింపు..!
అసైన్డ్ భూమిపై నిర్మాణం, డ్రగ్స్ సరఫరా అనుమానాలపై విచారణ వేగం పెరిగింది. సిట్ కీలక ఆధారాలు సేకరిస్తోంది.
మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అజీజ్‌నగర్ పరిధిలోని ఫాంహౌస్‌ను అధికారులు సీజ్ చేశారు. ఫామ్ హౌస్ నిర్మించిన భూమిని అసైన్డ్ బూమిగా అధికారులు గుర్తించారు. దీంతో పైలట్ రోహిత్ రెడ్డిపై భూ అక్రమాలు, డ్రగ్స్ లింకులపై విచారణ వేగం పెరిగింది. రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి ఈ ఫాంహౌస్‌ను సీజ్ చేశారు. ప్రాథమికంగా ఈ నిర్మాణం అసైన్డ్ భూమిలో జరిగినట్లు గుర్తించారు. నిరుపేదలకు కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. మొదట డ్రగ్స్‌ను సిమ్లా నుంచి తెచ్చినట్లు చూపించినప్పటికీ, అవి స్థానికంగానే సేకరించినట్లు ఆధారాలు లభిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి ద్వారా సరఫరా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫాంహౌస్‌లోని సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ప్రధాన డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
రోహిత్ రెడ్డి పాత్రపై కూడా విచారణ ముమ్మరమైంది. గత కేసులు, ఆర్థిక లావాదేవీలు, బినామీ వ్యవహారాలపై సమాచారం సేకరిస్తున్నారు. రాజకీయ సంబంధాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భూ వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. అజీజ్‌నగర్‌లోని సర్వే నంబర్ 177/33లో 2.20 ఎకరాల్లో నిర్మాణం జరిగిందని గుర్తించారు. రిజిస్ట్రేషన్ రికార్డులు ఒక పేరుతో ఉండగా, భూభారతి రికార్డుల్లో మరో వ్యక్తి పేరు ఉండడం అనుమానాలకు దారి తీసింది.
అసైన్డ్ భూముల విక్రయం చట్టవిరుద్ధం కావడంతో, రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు భూ అక్రమాలపై సమాచారం అందించినట్లు తెలిసింది.
గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డి, ఇప్పుడు మరోసారి చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.
అసలు ఏం జరిగిందంటే
రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీకి సంబంధించి పక్కా సమాచారంతో పోలీసులు ఫాంహౌస్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. డ్రగ్స్ కార్యకలాపాలకు కేంద్రంగా మారిందనే అనుమానాలతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడైంది. పార్టీ సమయంలో అక్కడ ఉన్న విలాసవంతమైన వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అమ్మిన డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రోహిత్.. అభిషేక్ నుంచి 24సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

