తెలంగాణ స్థానిక ఎన్నికల్లో డబ్బు పంపిణీ బహిర్గతం
x
స్థానిక ఎన్నికల్లో నియమావళికి రాజకీయ పార్టీల తిలోదకాలు: ఓటర్లకు తాయిలాలు, డబ్బు పంపిణీ

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో డబ్బు పంపిణీ బహిర్గతం

ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర? ప్రజాస్వామ్యానికి ముప్పు


తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా, డబ్బు ప్రవాహం మాత్రం ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓటుకు వేల రూపాయలు, గృహోపకరణాలు, మద్యం విందులు, డిజిటల్ బదిలీల వరకు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి బహిరంగంగా ఉల్లంఘించినా, అధికార యంత్రాంగం కళ్లుమూసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు స్థానిక ఎన్నికల పారదర్శకతపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 12,760 గ్రామ పంచాయతీలు,1,13,534 వార్డు స్థానాలకు జరిగిన పంచాయతీ పోరులో ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించారు. అభ్యర్థులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తెలంగాణ ఎన్నికల కమిషన్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషించింది.ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ, మద్యం దావత్ లు చేస్తూ నియమావళిని ఉల్లంఘించినా అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఓటర్లకు డబ్బు పంపిణీ

గ్రామపంచాయతీలో ఎన్నికల్లో పలు గ్రామాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓటుకు రూ.2వేల నుంచి 2,500 రూపాయలు, పోటీ తీవ్రంగా ఉంటే రూ.4వేల నుంచి రూ.5వేల దాకా పంపిణీ చేశారు. కొందరు అభ్యర్థులు ఫోన్ పే, గూగుల్ పే యాప్ ల ద్వారా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేశారు.జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో డబ్బులు పంచుతున్న అభ్యర్థిని పట్టుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న వార్డు అభ్యర్థి రాజును పట్టుకుని అతని వద్ద నుంచి రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు.నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవిని రూ.52 లక్షలకు, ఉప సర్పంచ్ పదవిని రూ.15 లక్షలకు కొనుగోలు చేశారని ఫిర్యాదులున్నాయి. చందూర్ మండలంలోని లక్ష్మాపూర్‌లో సర్పంచ్ పదవికి రూ.45 లక్షలు, ఉప సర్పంచ్ పదవికి రూ.10 లక్షలు ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు.

మేజర్ గ్రామ పంచాయతీల్లో...

నగరాల్లో ఉంటున్న ఓటర్లను గ్రామాలకు రప్పించేందుకు ప్రయాణ ఖర్చులతోపాటు డబ్బులు పంపిణీ చేశారు. రైసు కుక్కర్లు, చీరలు తదితర కానుకలు పంచారు.ఓటుకు రూ.2వేల నుంచి 5వేల దాకా పంపిణీ చేశారు. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఓటు విలువకు మస్తు డిమాండ్‌ ఏర్పడింది. చేవేళ్లలో ఓటుకు అర తులం బంగారం, రూ.30వేలను పంపిణీ చేశారు.ఓటుకు రూ.10వేల నుంచి రూ.30 వేల దాకా పంపిణీ చేశారు. ఒక్కో అభ్యర్థి కోటి రూపాయల నుంచి నుంచి రూ.2 కోట్ల దాకా వెచ్చించారు.

ఓటర్లకు తాయిలాలు

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పదవుల కోసం సంపన్నులు ఎన్నికల బరిలోకి దిగడంతో వారు ఓట్లను భారీగా కొనుగోలు చేశారు. క్రికెట్ బ్యాట్లు, గడియారాలు, కత్తెరలు ఎన్నికల గుర్తు వస్తే వాటిని ఓటర్లకు పంపిణీ చేశారు. టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లు, రైస్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు గిఫ్టులుగా క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.ఫంక్షన్ హాళ్లలో ఓటర్లకు మటన్, చికెన్, మద్యంతో విందులు ఇచ్చారు.ఇంట్లో ఇద్దరు ఓటర్లు ఉంటే హాఫ్ బాటిల్, నలుగురు ఉంటే ఫుల్ బాటిల్ పంపిణీ చేశారు.రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రవాహం పెరిగింది. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే రూ.50వేలు పంపిణీ చేసిన ఉదంతం వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి పట్టణంలో ఓ అభ్యర్థి పంచిన చీరలు, హాట్ బాక్సులు, కుక్కర్లు వద్దంటూ వీధిలో పెట్టారు.ఓటమి పాలైన అభ్యర్థులు తాము పంపిణీ చేసిన డబ్బులు, బహుమతులు వాపసు ఇవ్వాలని కోరుతూ ఓటర్లకు చీరలు, వెండి నాణేలు పంపిణీ చేయడం, ఒక్కో ఓటుకు రూ. 3 వేల వరకు వెచ్చించడం వంటివి ఇప్పుడు సాధారణమైపోయాయి.

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

భార‌త రాజ్యాంగం అనుక‌ర‌ణ 245 -కె, 243 – జడ్ ఏ ద్వారా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, నిస్పక్షపాతంగా జ‌ర‌ప‌డానికి అన్ని అధికారాలు ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల జ‌రిగిన పంచాయతీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, ప్ర‌శాంతంగా జ‌రిగినా నిజాయితీగా మాత్రం జ‌రగ‌లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన ఎస్ఈసీకి లేఖ రాశారు.

పంచాయితీ ఎన్నిక‌ల్లో డబ్బు ప్రవాహం

తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ‌పంచాయతీలు ఉండ‌గా అందులో దాదాపు 2,769 గ్రామ పంచాయితీలు పెద్ద‌గా ఆదాయం లేని మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల‌లో ఉన్నాయి. ఇక మిగిలిన 10 వేల గ్రామ పంచాయితీల్లో స‌గ‌టున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు చేసిన ఖ‌ర్చు కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఉంది.‘‘పంచాయితీ ఎన్నిక‌ల‌లో 10 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందు నుంచి గ్రామాల్లో బాహాటంగా డ‌బ్బులు పంచ‌డం ఇత‌ర వ‌స్తువులు ఇవ్వ‌డం జ‌రిగింది’’అని పద్మనాభరెడ్డి తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఓట‌ర్లు త‌మ‌కు అభ్య‌ర్థులు డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని రాస్తారోకోలు కూడా చేశారు. ప్ర‌స్థుతం తెలంగాణ రాష్ట్రంలో కోటీశ్వ‌రులు మాత్ర‌మే పంచాయితీ ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డ్డారు. ఓట్ల కొనుగోలు, మ‌ద్యం పంపిణీ వంటి వాటి ఖ‌ర్చు భ‌రించ‌లేక చాలామంది విద్యావంతులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఎవ‌రూ కూడా రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదని పద్మనాభరెడ్డి ఆరోపించారు.

ఈసీ కేసు లేవి?

‘‘ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డ త‌రువాత ఓడిన అభ్య‌ర్థి చేతిలో దేవుని ఫొటో ప‌ట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఒట్టు వేయించి ఓటు ఆయ‌న‌కు వేయ‌న‌ట్ల‌యితే తాను ఇచ్చిన డ‌బ్బు వాప‌సు చేయ‌మ‌ని అడ‌గ‌డం జ‌రిగింది. ఇంత జ‌రుగుతున్నా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం చేష్ట‌లుడిగి ఏమీ చేయ‌లేదు. ఈ సంఘ‌ట‌న‌లు డ‌బ్బు పంచిన అభ్య‌ర్థిపైన అలాగే డ‌బ్బు తీసుకున్న ఓట‌ర్ల‌పై కేసు న‌మోదు చేయ‌లేదు’’అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించింది.

కేసులు పెట్టాలని డిమాండ్
మున్సిప‌ల్ ఎన్నిక‌లు స‌జావుగా జ‌ర‌గ‌డానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి జారీచేసింది.ఓట‌ర్ల‌కు ఏ రూపంలో నైనా లంచం లేదా రివార్డులు ఇవ్వ‌కూడ‌దని నియమావళి చెబుతున్నా అభ్యర్థులు యథేచ్ఛగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. బాహాటంగా కోడ్ ఉల్లంఘ‌న‌లు జ‌రుగుతున్నా ఎన్నిక‌ల సంఘం క‌ళ్ళు మూసుకుంది. ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి కాగితాల‌కే ప‌రిమిత‌మైంది.ఇప్ప‌టికైనా ఓటర్లకు డ‌బ్బు, ఇత‌ర వ‌స్తువులు పంచిన అభ్య‌ర్థుల‌పై అలాగే డ‌బ్బు అడిగిన ఓట‌ర్ల‌పై కేసులు న‌మోదు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ, ఎం.పి.టి.సి., జ.డ్పి.టి.సి. ఎన్నిక‌ల‌లో డబ్బు పంప‌కం, కోడ్ ఉల్లంఘ‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరింది.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల దాకా ప్రజల ప్రత్యక్ష పాలనను నిర్ణయించే ఈ ప్రక్రియ డబ్బు ప్రభావానికి లోనైతే, ప్రజాస్వామ్య ఆత్మనే దెబ్బతింటుంది. ఓటు విలువను నోట్ల కట్టలతో కొలిచే పరిస్థితి కొనసాగితే సామాన్యులు, మధ్యతరగతి, నిజాయితీ గల అభ్యర్థులు రాజకీయాల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది.అందుకే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు కావాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలి. ఓటరులోనూ చైతన్యం పెరగాలి. డబ్బుకు కాదు, అభివృద్ధికి ఓటు వేయాలనే స్పృహ పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేకపోతే ఎన్నికలు ఉత్సవాల్లా కనిపించినా, ప్రజల ఆశయాలు మాత్రం నెరవేరవు.


Read More
Next Story