
ఫ్లైఓవర్లు పెరుగుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తగ్గడం లేదు?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) ఫ్లైఓవర్లు పెరుగుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తగ్గడం లేదు?
2) రేపటి నుంచే TIMSలో IP సేవలు.. ఛార్జీలు ఎంతంటే?
3) గణేష్ ఉత్సవానికి GHMC మెగా ప్లాన్!
1) ఫ్లైఓవర్లు పెరుగుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తగ్గడం లేదు?
హైదరాబాద్‌లో ఉదయం ఆఫీస్‌కు బయల్దేరితే.. గంటల ప్రయాణం. సాయంత్రం ఇంటికి చేరాలంటే.. మరో గంట టెన్షన్! ఒక్క సిగ్నల్ దాటడానికి 10 నిమిషాలు..10 కిలోమీటర్లు వెళ్లడానికి అరగంటకుపైగా సమయం! ఫ్లైఓవర్లు వస్తున్నాయి.. అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు.. ఎలివేటెడ్ కారిడార్లు ప్లాన్ చేస్తున్నారు. కానీ.. హైదరాబాద్ ట్రాఫిక్ మాత్రం ఎందుకు తగ్గడం లేదు? ఒక జంక్షన్‌లో రద్దీ తగ్గితే.. మరోచోట కొత్త బాటిల్‌నెక్ తయారవుతోంది. అసలు సమస్య రోడ్లు తక్కువగా ఉండటమా? లేక.. నగర రవాణా వ్యవస్థను సమగ్రంగా ప్లాన్ చేయకపోవడమా?
హైదరాబాద్‌లో ప్రస్తుతం 94 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వాటిలో 56 లక్షలకు పైగా టూవీలర్లు.. దాదాపు 15 లక్షల కార్లు ఉన్నాయి. ప్రతి ఏడాది సుమారు 3.5 లక్షల కొత్త వాహనాలు నగర రోడ్లపైకి వస్తున్నాయి. మరోవైపు.. హైదరాబాద్ మహానగరంలోని ప్రైమరీ రోడ్ నెట్‌వర్క్ సుమారు 900 కిలోమీటర్లు మాత్రమే. అంటే.. వాహనాల సంఖ్య పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా రోడ్డు సామర్థ్యం పెరగడం లేదు. ప్రధాన రహదారులపై కిలోమీటర్‌కు సగటున దాదాపు 9,500 వాహనాల ఒత్తిడి ఉందనే అంచనాలు పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇప్పటికే సుమారు 53 ఫ్లైఓవర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 11 ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. 9 అండర్‌పాస్‌లు పూర్తయ్యాయి. మరో అండర్‌పాస్ నిర్మాణంలో ఉంది. ఇక కేబీఆర్ పార్క్ పరిధిలోనే 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగా హెచ్-సిటీ ప్రాజెక్టులో మరో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లకు ప్రణాళికలు ఉన్నాయి.
అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఫ్లైఓవర్లు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందా? నిపుణుల ప్రకారం.. ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్‌ను పైకి పంపితే.. ఆ వాహనాలు చివరకు మరో జంక్షన్‌కు చేరుతాయి. అక్కడ రోడ్డు సామర్థ్యం సరిపోకపోతే.. కొత్తగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. అంటే.. ఒక్కో జంక్షన్‌ను విడిగా పరిష్కరించడం కంటే.. మొత్తం నగర ప్రయాణ వ్యవస్థను ఒకే ప్లాన్‌లో చూడాల్సిన అవసరం ఉంది.
ఇటీవల హెచ్-సిటీ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు, వన్‌వే విధానం అమల్లోకి రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అధికారులు పైలట్ డ్రైవ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్యలు చేపట్టామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం డైవర్షన్లు, ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత లేకపోవడం.. ఒకే మార్గంలో వాహనాల ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
దీంతో జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్..పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్.. మాదాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు ప్రయాణం చాలాసార్లు నరకప్రాయంగా మారుతోంది. ట్రాఫిక్ సమస్య కేవలం కేబీఆర్ పార్క్ చుట్టూనే లేదు. గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, బీహెచ్‌ఈఎల్, మియాపూర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు కనెక్టింగ్ రోడ్ల పరిస్థితి కూడా సమస్యగా మారుతోంది.
వర్షాలు పడితే గుంతల్లో నీరు నిలుస్తోంది. వాహనాలు నెమ్మదిస్తున్నాయి. ఒక్కో రోడ్డుపై చిన్న అడ్డంకి ఏర్పడినా.. దాని ప్రభావం కిలోమీటర్ల మేర కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది రోజువారీ సమస్యగా మారుతోంది. రోడ్లపై ప్యాచ్‌వర్క్ చేసినా.. వర్షం పడిన తర్వాత అవి మళ్లీ దెబ్బతింటున్నాయనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలో మరో కీలక అంశం వివిధ శాఖల మధ్య సమన్వయం.
ట్రాఫిక్ పోలీసులు..జీహెచ్‌ఎంసీ..వాటర్ వర్క్స్..రోడ్ల నిర్మాణ సంస్థలు..కేబుల్, పైప్‌లైన్ ఏజెన్సీలు..ఇవన్నీ ఒకే నగరంలో ఒకే రోడ్లపై పనిచేస్తున్నాయి. ఒక శాఖ రోడ్డు నిర్మిస్తే.. మరో శాఖ కేబుల్ లేదా పైప్‌లైన్ కోసం తవ్వుతుంది. మళ్లీ రోడ్డు మరమ్మతు చేయాలి. ఈ పనులన్నీ ఒకే సమన్వయ ప్రణాళిక లేకుండా జరిగితే.. రోడ్డు సామర్థ్యం పెరగకపోగా.. ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరుగుతాయి. అందుకే రోడ్డు నిర్మాణానికి ముందే కేబుల్స్, డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మార్గాలు అన్నీ ఒకే ప్రణాళికలో ఉండాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్‌లో మెట్రో ఉంది. ఎంఎంటీఎస్ ఉంది. ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అయినా వ్యక్తిగత వాహనాల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి లాస్ట్ మైల్ కనెక్టివిటీ. మెట్రో స్టేషన్ వరకు వెళ్లాలి. అక్కడి నుంచి ఆఫీస్‌కు మరో వాహనం కావాలి. బస్సుల ఫ్రీక్వెన్సీ సరిపోకపోవచ్చు. పార్కింగ్ సమస్య ఉండొచ్చు. ఈ కారణాలతో చాలామంది సొంత బైక్, కారు వైపు మొగ్గుతున్నారు. అందుకే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కేవలం మరో ఫ్లైఓవర్ నిర్మించడం కాదు. మెట్రో–ఎంఎంటీఎస్–ఆర్టీసీ–ఫీడర్ సర్వీసులు–పార్కింగ్–రోడ్లు–ఉద్యోగ కేంద్రాలు.. ఇవన్నీ ఒకే రవాణా వ్యవస్థలో భాగం కావాలి.
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం.. హైదరాబాద్‌లో ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏడాదికి సుమారు 123 గంటలు కోల్పోతున్నారు. అంటే.. ఐదు రోజులకు పైగా సమయం! 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాలు పడుతోంది. సాయంత్రం పీక్ అవర్స్‌లో ఇదే దూరానికి సుమారు 39.5 నిమిషాలు పడుతోంది.
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ ఇంజనీర్ టి. సత్యనారాయణ రెడ్డి అభిప్రాయం ప్రకారం.. మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ వేగం గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఉండాలి. కానీ హైదరాబాద్‌లో సగటు వేగం సుమారు 15 కిలోమీటర్లకు పడిపోయిందని.. సాయంత్రం వేళల్లో అది 10 కిలోమీటర్లకు కూడా తగ్గుతోందని ఆయన చెబుతున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్‌ను శాశ్వతంగా తగ్గించాలంటే.. విడివిడిగా ప్రాజెక్టులు చేపట్టడం కాకుండా సిటీ మోబిలిటీపై సమగ్ర ప్రణాళిక అవసరం. హైదరాబాద్ ఎదుర్కొంటున్నది కేవలం ట్రాఫిక్ సమస్య కాదు.. అర్బన్ ప్లానింగ్ సమస్య. నగరమంతా కదిలేలా ఒకే సమగ్ర ట్రాఫిక్ ప్లాన్ రూపొందించడమే అసలు పరిష్కారమా? ఇదే ఇప్పుడు హైదరాబాద్ ముందున్న అతిపెద్ద ప్రశ్న.
2) రేపటి నుంచే TIMSలో IP సేవలు.. ఛార్జీలు ఎంతంటే?
ఇప్పటికే ప్రారంభమైన టిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి ఇన్‌పేషెంట్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే.. సాధారణ ప్రజలకు ఇక్కడ వైద్యం ఉచితంగా ఉండదు. నిమ్స్ తరహాలో నిర్దేశిత ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత వైద్యం అందించే అవకాశం ఉంటుంది. సనత్‌నగర్ TIMS ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ప్రారంభమైన వెంటనే ఔట్ పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ట్రయల్ రన్ సమయంలో రోజుకు సుమారు 200 మంది వరకు ఆస్పత్రికి వచ్చేవారు. అయితే ఆస్పత్రి ప్రారంభమైన తర్వాత రోగుల సంఖ్య వేగంగా పెరిగింది. గురువారం నాడు 700 మందికి పైగా ఓపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వైద్యులు మధ్యాహ్నం 2 గంటల వరకు రోగులకు సేవలు అందిస్తున్నారు.
ఇక శుక్రవారం నుంచి మరో కీలక అడుగు పడుతోంది. ఇన్‌పేషెంట్ సేవలు అంటే.. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందే సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. అంటే సనత్‌నగర్ TIMS క్రమంగా పూర్తి స్థాయి ఆస్పత్రిగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.అయితే ఇన్‌పేషెంట్ సేవలు ప్రారంభమైన వెంటనే ఆపరేషన్లు మొదలయ్యే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రక్రియ. ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులను పెద్ద సంఖ్యలో సందర్శకులు సందర్శించారు. దీంతో ఆస్పత్రిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్పత్రి మొత్తం ఫ్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ గురువారంతో పూర్తయింది.
దీంతో శుక్రవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.అయితే ఆపరేషన్ థియేటర్లకు సంబంధించి మరో దశ ఫ్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఫ్యూమిగేషన్ అనగా ఒక నిర్దిష్ట స్థలాన్ని లేదా గదిని రసాయన వాయువులు లేదా పొగతో నింపి, అక్కడ ఉన్న హానికరమైన సూక్ష్మజీవులు, కీటకాలు లేదా పురుగులను నిర్మూలించే ప్రక్రియ. ఆస్పత్రి పూర్తిగా ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే సర్జరీలు ప్రారంభిస్తారు. అందుకే ఆపరేషన్లు ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రెండు, మూడు వారాల్లో సర్జరీలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
సనత్‌నగర్ TIMSను సాధారణ ప్రభుత్వ ఆస్పత్రులకు భిన్నంగా.. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో వైద్య సేవలు అందించేలా నిర్మించారు. ఈ ఆస్పత్రిని సుమారు రూ.1,126 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం 1,082 పడకలు ఉన్నాయి. వాటిలో దాదాపు 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అంతేకాదు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్ సదుపాయాల పరంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
17 పాథాలజీ ల్యాబ్‌లు..12 మైక్రోబయాలజీ ల్యాబ్‌లు..10 బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు..5 ప్రత్యేక ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.మొత్తంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో రోగులకు వైద్యం అందించేలా ఆస్పత్రిని రూపొందించారు.
ఆస్పత్రి భారీగా విస్తరించడంతో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో అవసరం. సనత్‌నగర్ TIMS కోసం ప్రభుత్వం 2,360 పోస్టులను మంజూరు చేసింది. వైద్యులు, నర్సింగ్, టెక్నికల్ సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బందితో ఆస్పత్రి సేవలను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఆస్పత్రిని మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మించారు. అంటే ఇది కేవలం మరో ప్రభుత్వ ఆస్పత్రి కాకుండా.. భారీ స్థాయి తృతీయ శ్రేణి వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మరి చికిత్స ఉచితమా? ఇప్పుడు అందరి దృష్టి ఉన్న ప్రశ్న ఇదే. సనత్‌నగర్ TIMSలో వైద్యం పూర్తిగా ఉచితమా? అధికారుల సమాచారం ప్రకారం.. సాధారణ రోగుల నుంచి నిమ్స్ తరహాలో నిర్దేశిత ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో వైద్యం అందించడమే ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో అర్హత ఉన్న పేద రోగులకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆపరేషన్ థియేటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అంటే..ఓపీ → ఐపీ → సర్జరీలు అనే దశలవారీగా సనత్‌నగర్ TIMS పూర్తి స్థాయి కార్యకలాపాల్లోకి వెళ్లనుంది.
3) గణేష్ ఉత్సవానికి GHMC మెగా ప్లాన్!
వినాయక చవితి సెప్టెంబర్ 14న జరగనుండగా.. నిమజ్జనం సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవం, నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు, వాహనాలు, గణేష్ విగ్రహాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండటంతో.. GHMC ఇప్పటి నుంచే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఈసారి కొత్తగా చేర్చిన సర్కిళ్లు, జోన్లు, విలీనం చేసిన ప్రాంతాలతో పాటు బాలాపూర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు.
నిమజ్జనం సమయంలో ట్రాఫిక్‌ను ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ఎక్కడెక్కడ క్రేన్లు, పడవలు, ఈతగాళ్లు ఉంటారు? పారిశుధ్యం, వైద్యం, అత్యవసర సేవలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వినాయక చవితి సందర్భంగా దాదాపు పది రోజుల పాటు హైదరాబాద్‌లో గణేష్ మండపాలు, ఊరేగింపులు, భక్తుల రాకపోకలతో నగరం సందడిగా మారనుంది. ముఖ్యంగా నిమజ్జనం రోజున హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
ఒకవైపు భారీ విగ్రహాలు.. మరోవైపు వేలాది చిన్న, మధ్య తరహా విగ్రహాలు.. వాటిని నిమజ్జన ప్రదేశాలకు తీసుకెళ్లే వాహనాలు..భక్తుల ఊరేగింపులు..ఇవన్నీ ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నిర్వహణ GHMC, పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆగస్టు 20న GHMC ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేవలం GHMC పనులపైనే కాకుండా.. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంపై కూడా ప్రత్యేకంగా చర్చించారు.
ఎందుకంటే గణేష్ ఉత్సవం అంటే కేవలం పారిశుధ్యం మాత్రమే కాదు. ట్రాఫిక్.. విద్యుత్.. రోడ్లు.. నీటి సరఫరా.. ఫైర్ సేఫ్టీ.. వైద్యం.. పోలీసింగ్.. నిమజ్జన ఏర్పాట్లు.. ఇవన్నీ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే పోలీస్, ఫైర్, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, R&B, HMWSSB, HMDA, DM&HO, మెట్రో రైల్, HRDC, టూరిజం తదితర శాఖలతో జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈసారి మరో కీలక అంశం కొత్తగా GHMCలో చేర్చిన సర్కిళ్లు, జోన్లు, విలీనం చేసిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో గణేష్ మండపాలు, విగ్రహాల సంఖ్య, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలపై ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్రధాన నగర ప్రాంతాల్లోనే కాకుండా కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో కూడా..రోడ్లు ఉన్నాయా? లైటింగ్ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా ఎలా ఉంటుంది? అంబులెన్స్ వెళ్లే మార్గం ఉందా? ట్రాఫిక్ డైవర్షన్ అవసరమా? అనే అంశాలను ముందుగానే పరిశీలించనున్నారు. అంటే.. ఈసారి గణేష్ ఉత్సవ ఏర్పాట్లను పాత GHMC పరిధికే పరిమితం చేయకుండా.. విస్తరించిన నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో బాలాపూర్ ఊరేగింపుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపులో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో.. ఇక్కడి నుంచి నిమజ్జన ప్రదేశాల వరకు రహదారులు, ట్రాఫిక్, బారికేడింగ్, క్రేన్లు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు. బాలాపూర్ ఉత్సవ కమిటీతో పాటు పోలీసులు, GHMC, ఇతర లైన్ డిపార్ట్‌మెంట్లు కలిసి పనిచేసేలా ప్రత్యేక సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
ఒకవేళ రోడ్డుపై సమస్య తలెత్తినా.. ఏ శాఖ స్పందించాలి? ఎవరు పరిష్కరించాలి? అన్నది స్పష్టంగా ఉండేలా వ్యవస్థను రూపొందించనున్నారు.ఇక నిమజ్జన ప్రదేశాల దగ్గర భారీ విగ్రహాలను సురక్షితంగా నీటిలోకి తరలించడం మరో పెద్ద సవాలు. దీని కోసం ప్రధాన సరస్సులు, చెరువులు, నిమజ్జన ప్రదేశాల్లో స్థిర, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు.. అవసరమైన చోట్ల మొబైల్ కంట్రోల్, సమన్వయ వ్యవస్థలను ఉపయోగించనున్నారు.
నిమజ్జనం సమయంలో ప్రమాదాలు జరగకుండా..పడవలు.. ఈతగాళ్లు.. లైఫ్ సేవింగ్ పరికరాలు..అందుబాటులో ఉంచనున్నారు. భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే సమయంలో క్రేన్ ఆపరేషన్, భక్తుల కదలికలు, పోలీస్ బారికేడింగ్ వంటి అంశాలను సమన్వయం చేయనున్నారు. గణేష్ నిమజ్జనం అంటే విగ్రహాల తరలింపుతో పాటు పెద్ద మొత్తంలో వ్యర్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి. మండపాల దగ్గర..ఊరేగింపు మార్గాల్లో..నిమజ్జన ప్రదేశాల్లో..భక్తులు భారీగా చేరే ప్రాంతాల్లో..పారిశుధ్య నిర్వహణ కీలకంగా మారుతుంది.
అందుకే GHMC 24 గంటలూ పనిచేసే పారిశుధ్య సిబ్బందిని మోహరించనుంది. మొబైల్ టాయిలెట్లు.. ఫాగింగ్ బృందాలు.. గణేష్ యాక్షన్ టీమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా వ్యర్థాలను వెంటనే తొలగించేలా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు.
లక్షలాది మంది భక్తులు ఒకేచోటకు చేరే సందర్భంలో వైద్య అత్యవసర పరిస్థితులను కూడా ముందుగానే అంచనా వేయాలి. అందుకే అంబులెన్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా తొక్కిసలాట, ప్రమాదం, అనారోగ్య సమస్య, నీటిలో ప్రమాదం లాంటి పరిస్థితులు ఏర్పడితే.. వెంటనే స్పందించేలా అత్యవసర వ్యవస్థను సిద్ధం చేయనున్నారు. అదే సమయంలో ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి అంశాలపై కూడా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.
నిమజ్జనం సమయంలో అత్యంత కీలకమైనది రోడ్ల పరిస్థితి. విగ్రహాలు తీసుకెళ్లే వాహనాలు సాఫీగా వెళ్లాలంటే రోడ్లపై గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలు ఉండకూడదు. అందుకే సెప్టెంబర్ 13లోపు ఊరేగింపు మార్గాల్లో రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని GHMC లక్ష్యంగా పెట్టుకుంది. అదే తేదీలోగా క్రేన్‌లకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అంటే ఒకేసారి వేలాది వాహనాలు, భారీ విగ్రహాలు, భక్తుల ఊరేగింపులు, ప్రజల రాకపోకలు. అందుకే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఈసారి కీలకంగా మారనుంది. ఎక్కడ వన్‌వే? ఎక్కడ డైవర్షన్? భారీ వాహనాలకు ఏ మార్గం? భక్తుల కోసం ఎక్కడ పార్కింగ్? అత్యవసర వాహనాలకు ప్రత్యేక మార్గం ఎక్కడ? అనే అంశాలపై పోలీసులు, GHMC ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఈసారి GHMC ముందున్న మూడు ప్రధాన సవాళ్లు
1. భారీ జనసందోహం, ట్రాఫిక్‌ను సురక్షితంగా నిర్వహించడం.
2. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో కూడా సమాన స్థాయిలో ఏర్పాట్లు చేయడం.
3. నిమజ్జనం తర్వాత నగరాన్ని వేగంగా శుభ్రం చేయడం, సరస్సులు, చెరువుల వద్ద భద్రతను కాపాడటం.వీటితో పాటు బాలాపూర్ ఊరేగింపును కూడా ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది.
గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షకు చేరువగా గణేష్ విగ్రహాలు కొలువుదీరాయి. GHMC పరిధిలోనే నిమజ్జనం చేసిన విగ్రహాల సంఖ్య 2.68 లక్షలకు చేరింది. ఈసారి 16 అడుగుల ఎత్తు పరిమితితో పాటు కొత్త ప్రాంతాలపై GHMC ప్రత్యేక దృష్టి పెట్టింది.”
Next Story

