
మాదకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని బృందాలు
తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్ళు భయపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు
తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని బృందాలను ఏర్పాటు చేయబోతున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 2025 వార్షిక నివేదిక విడుదల సందర్భంగా శనివారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. నేరాల నియంత్రణలో పోలీసుశాఖ మెరుగైన ఫలితాలను సాధించినట్లు చెప్పారు. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో తెలంగాణ పోలీసు ముందుంజలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్ళు భయపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో నేరాలు 15శాతం తగ్గినట్లు తెలిపారు. సైబర్ నేరాలు 8 శాతం, మహిళలపై నేరాలు 6శాతం, పోక్సో కేసులు కూడా బాగా తగ్గాయన్నారు. గతేడాది అత్యాచార కేసులు 484 నమోదైతే ఈ ఏడాది 405కి తగ్గినట్లు చెప్పారు. కిడ్నాప్ కేసులు పోయిన సంవత్సరం 324 నమోదైతే ఈ ఏడాది 166 మాత్రమే ఫైల్ అయినట్లు వివరించారు. ప్రాపర్టీ వివాద కేసులు పోయిన ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 64శాతం తగ్గాయన్నారు. నేరాల్లో శిక్షలుపడిన కేసుల సంఖ్య బాగా పెరిగినట్లు చెప్పారు. రోడ్డుప్రమాదాల సంఖ్య 3.058 నుండి 2,678కి తగ్గినట్లు తెలిపారు.
సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కమిషనర్ నొక్కిచెప్పారు. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం సమర్ధవంతంగా పనిచేస్తున్న కారణంగానే నేరాల సంఖ్య తగ్గుతోందన్నారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది పజోనల్ వారీగా నార్కోటిక్ టీములను ఏర్పాటుచేయబోతున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. కొత్త సంవత్సరాది వేడుకల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మద్యంతాగిన వారు బయటకు రావద్దని హెచ్చరించారు. కుటుంబసభ్యులతో ఇళ్ళల్లోనే వేడుకలు జరుపుకుంటే చాలామంచిదని కమిషనర్ సజ్జనార్ సూచించారు.

