ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. వేధింపులే కారణమా !
x

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. వేధింపులే కారణమా !

యాదాద్రి జిల్లాలో విషాదం. అత్తింటి వేధింపులు భరించలేక తన ఇద్దరు పిల్లలను చంపి, ఐశ్వర్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింటి వారి వేధింపులు తాళలేక ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి, తాను కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండలం గొల్లగూడెంలో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు బాధితురాలి సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

అసలేం జరిగింది?

గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్యకు, మేకల మహేష్‌తో వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా అత్తింటి వారి వేధింపులతో ఐశ్వర్య తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. భర్త, అత్తమామల వేధింపులు మితిమీరిపోవడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి గల కారణాలను ఆమె వివరించింది. తన భర్త మహేష్ తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా కొనిపెట్టలేదని పేర్కొంది. తన భర్త స్వతహాగా నిర్ణయాలు తీసుకోకుండా.. తల్లిదండ్రులు, సోదరి మాటలు విని తనను వేధించేవాడని ఐశ్వర్య ఆరోపించింది.

పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది?

తన పిల్లలను గొప్పగా చదివించాలని కలలు కన్నట్లు ఐశ్వర్య తన లేఖలో రాసింది. కానీ తాను లేకపోతే తన పిల్లలను చూసేవారు ఎవరూ ఉండరని, అత్తింటి వారు వారిని సరిగ్గా చూసుకోరనే ఆందోళనతోనే వారిని కూడా తనతో పాటు తీసుకెళ్తున్నట్లు (చంపేస్తున్నట్లు) అందులో పేర్కొంది. తన మరణానికి కారణమైన వారు జీవితాంతం జైలులోనే ఉండాలని, అప్పుడే తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె తన ఆఖరి వాంగ్మూలంలో కోరింది.

సమాచారం అందుకున్న బీబీనగర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషాద ఘటనతో గొల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More
Next Story