
కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ఎంపీ.. నిధులు ఆలస్యమెందుకంటూ..!
పశుసంవర్ధక పథకాల అమలుపై ఆలస్యం ప్రభావం ఉందని ఎంపీ ఆందోళన. కీలక పథకాలకు ఇంకా నిధులు రాలేదని వెల్లడించారు.
తెలంగాణకు రావాల్సిన నిధులపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. యానిమల్ హస్‌బెండరీ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తీవ్ర ఆలస్యం అవుతోందని చామల.. లేవనెత్తారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో రూ.24,850.33 కోట్ల నిధుల విడుదలపై వివరాలు కోరారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. నిధుల విడుదలలో గణనీయమైన ఆలస్యం జరుగుతోందని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్ర వాటా చాలా పథకాలలో ఇంకా పెండింగ్‌లోనే ఉందని వివరించారు.
ఇంటిగ్రేటెడ్ సాంపిల్ సర్వే స్కీమ్‌కు రూ.92.50 కోట్లు, పశు వ్యాధుల నియంత్రణ కోసం ASCAD పథకానికి రూ.7,421.23 కోట్లు, నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్‌కు రూ.12,304.59 కోట్లు విడుదల కావాల్సి ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో కొన్ని పథకాలకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు రాలేదని పేర్కొన్నారు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు రూ.3,880.40 కోట్లు, లైవ్‌స్టాక్ సెన్సస్‌కు రూ.1,151.61 కోట్లు ఇంకా విడుదల కాలేదని చెప్పారు. ఈ ఆలస్యం వల్ల సంక్షేమ పథకాల అమలు ప్రభావితమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా రైతులు, పశుసంవర్ధక రంగంపై దీని ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ పథకాలు రైతులకు మద్దతు ఇవ్వడంతో పాటు పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తాయని, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిధులను వెంటనే విడుదల చేసి అమలును వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర స్పందనపై ఇప్పుడు దృష్టి నెలకొంది.

