మోదీ నోట ముదిగుంట:ఇంకుడు గుంతలతో జలవిజయం
x
ముదిగుంట గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలిస్తున్న మంచిర్యాల అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య

మోదీ నోట ముదిగుంట:ఇంకుడు గుంతలతో జలవిజయం

ఇంటింటా నీటి సంరక్షణ... ముదిగుంట ఆదర్శ గ్రామంగా ఎదుగుదల


తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ గ్రామాన్ని ప్రస్తావించడంతో, గ్రామస్థులు కలిసికట్టుగా సాధించిన జలవిజయం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.

చుట్టూ పొలాలు, అటవీప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ముదిగుంట గ్రామ ప్రజలు సాధించిన జలవిజయాన్ని ప్రధాని మోదీ ప్రస్థావించారు. ఉపాధి హామి పథకం కింద నిధులతో గ్రామస్థులు కలిసి కదిలి ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో గ్రామంలో భూగర్భజలమట్టం పెరిగింది. జల సంరక్షణ కోసం ముదిగుంట గ్రామస్థులు ఇంటింటా ఉద్యమంలా నిర్మించుకున్న ఇంకుడు గుంతల వల్ల ఆ గ్రామం ఖ్యాతి జాతీయ స్థాయికి ఎదిగింది.

ఇంటింటా ఇంకుడు గుంతలు

అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న ముదిగుంట గ్రామంలో 1571 మంది జనాభా ఉన్నారు. 443 కుటుంబాలుండగా ఇందులో 353 మంది వారి ఇళ్లలో ఉపాధి హామి పథకం నిధులతో ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు. ఇంకుడు గుంతలే కాకుండా నీటి కుంటలను కూడా నిర్మించుకున్నారు. గ్రామంలో బోర్ల వద్ద నీరు ఇంకేలా ఇంకుడు గుంతలు తవ్వారు. దీంతో గ్రామంలో భూగర్భజల నీటిమట్టం పెరిగింది. వర్షపు నీరు, వాడిన నీరు వృథా కాకుండా భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో గతంలో ఉన్న నీటి సమస్య ఇంకుడు గుంతల నిర్మాణంతో తీరిందని గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్ చెప్పారు.



అడవిలో నీటి కుంటల నిర్మాణం

ముదిగుంట గ్రామాన్ని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన నిధులతో మూడు నీటి కుంటలను తవ్వారు. ఈ నీటి కుంటల్లో నీరు నిల్వ ఉండటంతో ఈ వేసవికాలంలోనూ వన్యప్రాణుల దప్పిక తీరుతుంది. ముడిగుంట గ్రామాన్ని ప్రశంసించినందుకు ప్రధాని మోదీకి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కృతజ్ఞతలు తెలిపారు. జలసంచాయీ జన్ భాగిదారి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అవార్డు అందుకున్నారు. ప్రధాని మోదీ ప్రశంసలతో ముదిగుంట గ్రామం మంచిర్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 132వ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ముడిగుంట గ్రామాన్ని ప్రశంసించినందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సర్పంచ్ ఆకుల రవికుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ముదిగుంట ఆదర్శం

తమ గ్రామంలో ఇంకుడుగుంతలను నిర్మించుకోవడమే కాకుండా మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాల్వలను నిర్మించుకున్నామని గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్ చెప్పారు. దీనివల్ల గ్రామంలో దోమల బెడద సమస్య తీరిందన్నారు. ముదిగుంట గ్రామస్థుల సహకారానికి సర్పంచ్‌తో పాటు అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ పారిశుధ్యం, సుస్థిర నీటి నిర్వహణలో ముడిగుంట ఇప్పుడు జాతీయ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

మోదీ నోట సూర్యాపేట యువకుడి పేరు

సూర్యాపేట జిల్లాకు చెందిన కోట్ల రఘువీర్ రెడ్డి పేరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రస్థావించారు. రఘువీర్ రెడ్డి అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్థుతం పంటలసాగు నుంచి పంట కోతల వరకు ఆధునిక సాంకేతికత, యంత్రపరికరాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశంపై కోట్ల రఘువీర్ రెడ్డి వ్యాసం రాసి ప్రధానికి పంపించారు. పంటల సాగులో సాంకేతికతపై రాసిన వ్యాసం ప్రధాని మోదీని ఆకట్టుకుంది. దీంతో మోదీ రఘువీర్ రెడ్డి పేరును మన్ కీ బాత్ లో ప్రస్థావించి అభినందించారు.
చిన్న గ్రామం అయినా, పెద్ద మార్పు తీసుకురావచ్చని ముదిగుంట మరోసారి నిరూపించింది. ప్రజల భాగస్వామ్యం, సరైన ప్రణాళిక ఉంటే జల సంరక్షణ సాధ్యమేనని ఈ గ్రామం చూపించింది. ఇప్పుడు ముదిగుంట కేవలం ఒక గ్రామం కాదు… దేశానికి మార్గదర్శకంగా నిలిచిన ఆదర్శంగా మారింది.
Read More
Next Story