x

రేవంత్ ప్రభుత్వానికి సవాలుగా మారిన ‘మమ్మీ’ భద్రత

2100 ఏళ్ళ పురాతన మమ్మీని 1920లో 6వ నిజాం అల్లుడు నవాబ్ నజీర్ జంగ్ ఈ మమ్మీని ఈజిప్టులో వేలంపాటలో కొని 7వ నిజాంకు బహుమతిగా ఇచ్చాడు.


ఈజిప్ట్ నుండి ఎప్పుడో 2100 ఏళ్ళ క్రితం హైదరాబాద్ చేరుకున్న ‘మమ్మీ’ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ హెరిటేజ్ (స్టేట్ మ్యూజియం) సంరక్షణలో ఉన్న ఈ మమ్మీ మామూలుది కాదు ఎక్కడో ఉన్నఈజిప్ట్ నుండి వచ్చింది. ఈజిప్ట్ 6వ ఫారో చక్రవర్తి కూతురు 18 ఏళ్ళ నైషు మరణించిన తర్వాత మమ్మీగా మార్చారు. 2100 ఏళ్ళ పురాతన మమ్మీని 1920లో 6వ నిజాం అల్లుడు నవాబ్ నజీర్ జంగ్ ఈ మమ్మీని ఈజిప్టులో వేలంపాటలో కొని 7వ నిజాంకు బహుమతిగా ఇచ్చాడు.

వెయ్యి పౌండ్లకు కొన్న ఈ మమ్మీ ఆ విధంగా హైదరాబాదుకు చేరుకున్నది. అప్పటినుండి నిజాంల భవంతుల్లో ఉన్న ఈ మమ్మీ 1930లో నిర్మించిన స్టేట్ మ్యూజియంకు మారింది. మ్యూజియంలో ఒక గ్లాసు చాంబర్లో భద్రపరిచిన ఈ మమ్మీ వాతావరణ పరిస్ధితుల కారణంగా 2015లో కొంత దెబ్బతిన్నది. అందుకనే 2016లో జర్మనీకి చెందిన గ్లాస్ బౌ హన్ కంపెనీ నిపుణుడు మార్కస్ ను ప్రభుత్వం హైదరాబాద్ కు పిలిపించింది.

నిపుణుడి సూచనల ప్రకారం రు. 58 లక్షల ఖర్చుతో ఆక్సిజన్ తగలని ‘నైట్రోజన్ ఎయిర్ టైట్ గాజు చాంబర్’ రెడీ చేయించి అందులో భద్రపరిచింది ప్రభుత్వం. అయితే 2023లో ఆ చాంబర్ పాడైపోవటంతో మళ్ళీ నైట్రోజన్ ఎయిర్ టైట్ గాజు చాంబర్, క్లైమేట్ కంట్రోల్ యూనిట్, నైట్రోజన్ జనరేటర్, మెయిన్ టైనెన్స్ సర్వీసు అందించే సంస్ధలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ఇందుకోసం జర్మన్ కంపెనీతో పాటు ఇతరత్రా కంపెనీలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. దేశం మొత్తం కోల్ కత్తా, లక్నో, ముంబాయ్, బరోడా, జైపూర్, హైదరాబాద్ మ్యూజియాల్లో మాత్రమే మమ్మీలున్నాయి. దక్షిణాధి రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఈజిప్ట్ మమ్మీ ఉందని మ్యూజియం డైరెక్టర్ కూతాడి అర్జున్ రావు గర్వంగా చెప్పారు. ఈజిప్ట్ మమ్మీ సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Read More
Next Story