రూ.700కోట్లతో మూసీ తీరాన ఆలయం..
x

రూ.700కోట్లతో మూసీ తీరాన ఆలయం..

మంచిరేవుల వద్ద ఆలయ పునర్నిర్మాణం, గోశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవనంపై కీలక ప్రకటనలు చేశారు.


మూసీ నది పునరుజ్జీవనంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే మూసీ తీరాన రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఆలయ భూమిపూజ చేశారు. ఈ సందర్బంగానే ఈ ఆలయ నిర్మాణం శివాజ్ఞ అని, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని, ఇది కనుమరుగు కాకూడదని ఆకాంక్షించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఆలయ నిర్మాణం ఆగదని, పూర్తి చేసి తీరుతుందని ఆయన అన్నారు. మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణంతో పాటు ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ఖరారు చేసింది.

సుమారు 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఆ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మూసీ పునరుజ్జీవనానికి గతంలో ప్రయత్నాలు జరిగినా ముందుకు సాగలేదని, ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విమర్శలు వచ్చినా ప్రాజెక్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్లే మూసీ కాలుష్యానికి గురైందని, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు. గోదావరి జలాలను తరలించి నదిలో నీరు నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మూసీ కాలుష్యంతో నల్లగొండ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే, కొందరు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యానికి చిహ్నంగా మసీదు, నాగోల్‌లో చర్చిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు.

Read More
Next Story