Revanth Reddy at Stand With Her Event
x

మూసీ ప్రాజెక్టు ఆస్తులు గుంజుకోవడానికి కాదు: రేవంత్ రెడ్డి

“Musi Invites” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనం, అభివృద్ధి, పరిహారం, విమర్శలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.


మూసీ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులు గుంజుకునేందుకు కూడా కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన “Musi Invites” కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాజెక్టు భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమమని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతతో వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

ప్రభుత్వ దృష్టి అభివృద్ధిపైనే

ప్రభుత్వం అధికారాన్ని ప్రజలపై ఆధిపత్యం కోసం కాకుండా కాపలాదారుగా వినియోగిస్తుందని సీఎం చెప్పారు. మానవ నాగరికత నదుల చుట్టూనే అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న సమయంలో మనం వెనకబడితే భవిష్యత్ తరాలు క్షమించవని తెలిపారు. మూసీ అభివృద్ధి ఎలా చేయాలనే అంశంపై అన్నివర్గాల మేధావులతో సమావేశమై సూచనలు తీసుకున్నామని సీఎం చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, తప్పులు ఉంటే సూచనలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మూసీ చరిత్ర, హైదరాబాద్ అభివృద్ధి

1908లో మూసీ వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో సంప్రదించి వరదల నియంత్రణ కోసం నిజాం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారని వివరించారు. ఆ రిజర్వాయర్లు వందేళ్లుగా నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటమే కాకుండా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయని తెలిపారు. ఇంత గొప్ప వారసత్వ సంపద కలిగిన నగరాన్ని అలాగే వదిలేయాలా అనే ప్రశ్నను సీఎం లేవనెత్తారు.

గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు మూసీ ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నారో కారణం చెప్పాలని కోరారు. 1994 నుంచి ఇప్పటి వరకు పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదని ఆయన తెలిపారు. చరిత్రలో దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అమలు చేసిన నాయకులే గుర్తుండిపోతారని అన్నారు. ఒకప్పుడు నిజాం హైదరాబాద్ నగరాన్ని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.

మూసీ కాలుష్యం, చారిత్రక ప్రాధాన్యం

మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన బాపూ ఘాట్ చారిత్రక ప్రాధాన్యాన్ని సీఎం ప్రస్తావించారు. అంతటి చరిత్ర ఉన్న ప్రదేశాన్ని ఎంతమంది పర్యాటకులు సందర్శిస్తున్నారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్రస్తుతం కాలుష్యంతో మూసీ నది విషతుల్యంగా మారిందని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసీ నది హైదరాబాద్ చేరుకునే సరికి కాలుష్యంతో నిండిపోతుందని వివరించారు.

మానవ తప్పిదాల కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మూసీ నది, హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేయాలా, లేక మూసీతో పాటు నగరాన్ని పునరుజ్జీవింపజేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రూ. 5వేల కోట్ల తప్పుడు ప్రచారం

మూసీ పరివాహక ప్రాంతంలో బుల్డోజర్లు తీసుకెళ్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేస్తామని చెప్పగానే కొందరు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతమంది బ్యూటిఫికేషన్‌ను లూటిఫికేషన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, 5 వేల కోట్లతో గాంధీ విగ్రహం నిర్మిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాలను ప్రపంచానికి చూపిన నాయకుడని, అలాంటి మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించకపోయినా ఫరవాలేదని, కానీ దయచేసి అడ్డుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

పర్యావరణం, సంస్కృతి రక్షణ

మూసీ పునరుజ్జీవనం కేవలం నది శుభ్రపరిచే కార్యక్రమం మాత్రమే కాదని సీఎం అన్నారు. ఇది సంస్కృతి, చరిత్రను కాపాడే ప్రయత్నమని వివరించారు. ఇందులో భాగంగా నల్ల చెరువు, బతుకమ్మ కుంట, బమ్రూక్ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించినట్లు తెలిపారు. మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్న వారు అక్కడ నివసించగలరా అని సీఎం ప్రశ్నించారు. అవసరమైతే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇచ్చినా మూడు నెలలు అక్కడ ఉండగలరా అని ఆయన అన్నారు.

పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించడం, బ్లూ కాలర్ ఉద్యోగాలు సృష్టించడం, పర్యాటక అభివృద్ధి, నైట్ ఎకానమీ పెంపు కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యమని సీఎం చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటే మళ్లీ వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం అభివృద్ధి ఇంజన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు.

బాధితులకు పరిహారం, పునరావాసం

ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో కూడా కొంతమంది భూములు కోల్పోయారని సీఎం గుర్తుచేశారు. అదే విధంగా మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వాలో సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న నిరాశ్రయుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. జన ఆందోళన్ సంఘంతో చర్చలు జరిపి వారికి ఇండ్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్కూళ్లు, ఇతర సౌకర్యాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు కూడా తీసుకుంటున్నామని వివరించారు.

ప్రభుత్వం పేదల మేలు కోసమే పనిచేస్తుందని సీఎం అన్నారు. పేదలను నిరాశ్రయులను చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తాను ప్రజల్లో ఒకడినని, ప్రజల సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మూసీ పునరుజ్జీవనం జరిగితే ప్రభుత్వం, నాయకత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతో కొందరు అడ్డుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన కోరారు.

Read More
Next Story