నాదర్‌గుల్ భూముల వివాదం.. అసలేం జరుగుతోంది?
x

నాదర్‌గుల్ భూముల వివాదం.. అసలేం జరుగుతోంది?

373 ఎకరాల భూమిపై కోర్టు తీర్పులు, ప్రభుత్వ వాదనలు, రాజకీయ ఆరోపణలతో నాదర్‌గుల్ వివాదం క్లిష్టంగా మారింది.


హైదరాబాద్ శివాదులో ఉన్న నాదర్‌గుల్ భూముల చుట్టే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. చాలా కాలంగా వీటి విషయంలో భారీ రాజకీయ వివాదం నడుస్తోంది. మధ్యాలో కొన్నాళ్లు చల్లబడినా ఇప్పుడు మరోసారి ఈ భూముల వివాదం రాజుకుంది. రాజకీయంగా కాకరేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ భూముల విషయంలో పేలుతున్న మాటల తూటాలు ఈ అంశాన్ని మరింత కీలకంగా మారుస్తున్నాయి. ప్రభుత్వం అన్యాయంగా పేదల భూములను లాక్కుంటున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించారు. వాటాలు రాలేదని వారు ఇప్పుడు వివాదం చేస్తున్నారని, అసలు ఈ భూములకు రిజిస్ట్రేషన్‌లు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.

నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613 పరిధిలో సుమారు 373 ఎకరాల భూమి యాజమాన్యంపై సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. పాత రికార్డుల ప్రకారం ఈ భూమి ఒకప్పుడు ప్రైవేట్ ఆస్తిగా నమోదు అయింది. తర్వాత కాలంలో ఇది ప్రభుత్వ భూమి కాదా అన్న అంశంపై వివాదం మొదలైంది. ఈ భూమిని ఒక దశలో నిషేధిత జాబితాలో చేర్చారు. మరోవైపు, ప్రైవేట్ పక్షాలు తమకు హక్కులు ఉన్నాయని కోర్టులను ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఈ అంశం విచారణకు వెళ్లింది. వివిధ దశల్లో వచ్చిన తీర్పులు భిన్నంగా ఉండటంతో స్పష్టత లేకుండా పరిస్థితి క్లిష్టమైంది.

ఇక 2014లో అప్పటి ప్రభుత్వం ఈ భూములకు రిజిస్ట్రేషన్లు జరిపిందని, 2016లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కూడా పేర్కొంటోంది. అయితే ఈ వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రూ.7 వేల కోట్ల విలువైన భూమిలో కుంభకోణం జరుగుతోందని, పేదల భూములను ఆక్రమిస్తున్నారని విమర్శిస్తున్నారు. కొంతమంది కంపెనీలు, ప్రభావశీలుల ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనికి ప్రతిగా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. గత ప్రభుత్వ కాలంలోనే కీలక నిర్ణయాలు జరిగాయని, ఇప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతోందని అంటోంది. తమకు లేదా కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ఇక ఈ వ్యవహారంలో ఉన్న సంస్థలు కూడా స్పందించాయి. తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, కోర్టు తీర్పుల ఆధారంగా భూములను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నాయి. రాజకీయ ఆరోపణలను అవాస్తవంగా కొట్టిపారేశాయి.

ప్రస్తుతం ఈ భూములపై న్యాయపరమైన వివాదం కొనసాగుతూనే ఉంది. కోర్టు తుది నిర్ణయం రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. మొత్తానికి, నాదర్‌గుల్ భూముల వివాదం యాజమాన్యం, కోర్టు తీర్పులు, రాజకీయ ఆరోపణలు కలిసిన క్లిష్ట అంశంగా మారింది. ఈ వివాదానికి పూర్తి స్థాయి స్పష్టత రావాలంటే న్యాయస్థానాల తుది తీర్పు కీలకం కానుంది.

Read More
Next Story