‘ఘోస్ట్ స్కూల్స్’ లో  నల్గొండ నెంబర్ 1
x
నల్గొండ మండలం బంటుగూడెం గ్రామంలో మూతపడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

‘ఘోస్ట్ స్కూల్స్’ లో నల్గొండ నెంబర్ 1

· జిల్లాలో 315 ప్రభుత్వ పాఠశాలలు మూసివేత, · వీటిలో ౩౦౦ ప్రాధమిక పాఠశాలలే, ప్రవేట్ బడి బాట పడుతున్న విద్యార్థులు


నల్గొండ జిల్లా (Nalgonda) మరొకసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఈసారి కూడా గర్వించదగ్గ కారణంతో కాదు.సున్నా(zero) విద్యార్థుల వల్ల మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలల్లో నల్గొండ జిల్లా దేశంలోనే అగ్రభాగంలో ఉంది. విద్యార్థులు లేక మూత పడి తర్వాత శిధిలమయి పోతున్న ఈ పాఠశాలలను ఘోస్ట్ స్కూల్స్ (Ghost Schools) అంటారు. అంటే ఘోస్ట్ స్కూళ్లలో నల్గోండ నెంబర్ వన్ అయిపోయిందన్న మాట. ఫ్లోరైడ్ సమస్యతో వంకర తిరిగిన అవయవాలతో జీవచ్ఛవాలుగుగా మారిన భాదితుల గాథలతో నల్గొండ జిల్లా ప్రపపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే !

నల్గొండ జిల్లాలో గ్రామీణ ప్రాతంలో 315 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. అంతమాత్రాన ఆ గ్రామాలలో అసలు విద్యార్థులు లేరనికాదు. ఉన్న విదార్థులు సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు చెల్లించి వెళుతున్నారు. దీనితో లక్షలాది రూపాయలతో ప్రభుత్యం నిర్మించిన పాఠశాల గదులు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఐనా సరే జిల్లాలో విద్యాశాఖ అధికారుల్లో ఈ పరిస్థితిని సరిచేసే చలనం కనిపించడం లేదు.

నల్గొండలో సున్నా విద్యార్థుల నమోదుతో మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 315కు చేరింది. వీటిలో ౩౦౦ ప్రభుత్వ పాఠశాలలు కావటంతో ఇది ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనటంలో సందేహంలేదు. జిల్లాలో సున్నా విదార్థుల నమోదుతో మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుండటం ఆందోళనకరం.



దేశవ్యాప్తంగా విద్యార్థుల నమోదు లేని మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 5,149 గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 315 పాఠశాలలు ఒక్క నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇది దాదాపు ఏడు శాతం. విద్యార్థులు లేరనే కారణంతో నల్గొండ జిల్లాలో ప్రతి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ధోరణి నికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతోఉంది.. 2025-26 విద్యా సంవత్సరంలో నల్గొండలో సున్నా విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలల సంఖ్య 315కు చేరింది, ఇది విషయంలో ఈ జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది.


నల్గొండ మండలం బంటుగూడెం గ్రామంలో మూతపడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

ఈ విషయంను కేంద్ర విద్యా శాఖ పార్లమెంటులో ఒక సందర్భంలో తెలియచేయటంలో విషయం బయటకు వచ్చింది. జిల్లాలోని మొత్తం 315 సున్నా విద్యార్థుల నమోదు పాఠశాలల్లో, 300 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలే. మిగిలిన 15 పాఠశాలల్లో, నాలుగు ఉన్నత పాఠశాలలు మరియు ఎనిమిది ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సుమారు 150 సున్నా విద్యార్థుల నమోదు పాఠశాలలు గిరిజన జనాభా అధికంగా ఉన్న చందంపేట, దేవరకొండ, పెదవూర, నేరేడుకొమ్ము, తిరుమలగిరి (సాగర్) మరియు గుండ్లపల్లి అనే ఆరు మండలాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి.

మొదట్లో, ఈ గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికి ఇష్టపడ్డారు, కానీ కొన్ని సంవత్సరాలకే భారీ ఫీజులు చెల్లించడానికి తమ సంపాదన మొత్తం సరిపోవడం లేదని, అప్పుల పాలవుతున్నామని గ్రహించారు.

కనగల్ మండలంలోని బొమ్మపల్లిలోని ప్రభుత్వ పాఠశాల మూడు సంవత్సరాల క్రితం మూసివేయబడిన పాఠశాలల్లో ఒకటి. 500 జనాభా ఉన్న బొమ్మపల్లిలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు 50 మంది ఉన్నారు. విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు తీసుకవెళ్ళటానికి ప్రతిరోజూ గ్రామానికి రెండు బస్సులు వస్తాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం, బొమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండేవారు. కరువు సమయంలో గ్రామస్తులు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు కూడా ఈ సంఖ్య తగ్గలేదు.

ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో విద్య నాణ్యత మెరుగ్గా ఉంటుందనే అపోహను తొలగించి, ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైనందుకు గ్రామస్తులు ఉపాధ్యాయులను, విద్యాశాఖ అధికారులను నిందిస్తున్నారు. ఇదే వారిని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడం మానేసేలా చేసింది.

బొమ్మపల్లి గ్రామస్థుడైన నల్లబెల్లి సైదులు మాట్లాడుతూ “ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10కి పడిపోయినప్పుడు, వారి పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలలకు పంపమని ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకు సూచించారు. దీనివల్ల పాఠశాలలో విద్యార్థుల చేరిక సున్నాకి పడిపోయి మూసివేతకు దారి తీసింది. మా కుటుంబం ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లల పాఠశాల ఫీజుల కోసం రూ. 56,000 చెల్లించవలసి వస్తోందని, ఇది ఆర్థిక భారంగా మారింది,”అన్నారు.


నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూసివేయబడిన బంటుగూడెం గ్రామస్థురాలైన జోగు పార్వతమ్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన 20 మంది విద్యార్థులు సమీప పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని ఆమె చెప్పారు. ‘‘ముగ్గురు పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపడానికి తన కుటుంబం సంవత్సరానికి రూ. 80,000 పాఠశాల ఫీజుగా చెల్లిస్తోందని, ఇది తమ కుటుంబానికి భరించలేని భారం,’ అని ఆమె వాపోయారు. తల్లిదండ్రులు మళ్లీ 10 మంది విద్యార్థులను పాఠశాలకు పంపితే, తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తిరిగి తెరుస్తారా అని ఆమె ఆత్రుతగా ప్రశ్నించారు. పేద కుటుంబాల ప్రయోజనం కోసం పాఠశాలను తిరిగి తెరవాలని ఆమె జిల్లా అధికారులను అభ్యర్ధించారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు పి. నాగరాజు మాట్లాడుతూ, విద్యార్థులు లేరని ప్రభుత్వ పాఠశాల ను మూసివేయటం విచారకరం. ఇది విద్యా వ్యవస్థకే మాయని మచ్చ అన్నారు. "ఎవ్వరు రావటం లేదని మూసివేయటాని ప్రభుత్వ పాఠశాలలు కిరాణా షాప్స్ కావు. ఒక విద్యా సంవత్సరాలో విద్యార్థులు లేకపోతే వచ్చే విద్యా సంవత్సరంలో తమ పిల్లను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా తల్లితండ్రులలో అవగాహన కల్పించి పాఠశాలను కొనసాగించాలి," అని నాగార్జున అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతపై ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రచారం చేస్తున్న అపోహలపై తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి విద్యాశాఖ అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అయన ఆరోపించారు.

ప్రముఖ విద్యావేత్త మారం వెంకట గోనా రెడ్డిమాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలను మూసివేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అసమానతలు, పిల్లలలో పోషకాహార లోపం మరియు బడి మానేసే వారి సంఖ్య పెరుగుతాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పేద కుటుంబాల పిల్లలు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కోల్పోతారని ఆయన గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి నల్గొండ జిల్లాలోని మూసివేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.




Read More
Next Story