నల్గొండ జిల్లా  ఐ.టి టవర్‌లు ఇలా మూలుగుతున్నాయ్
x
సూర్యాపేట లో ఏర్పాటు చేసిన ఐ. టి టవర్

నల్గొండ జిల్లా ఐ.టి టవర్‌లు ఇలా మూలుగుతున్నాయ్

కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్లు ఉద్యోగాల లక్ష్యం సాధించలేక ఖాళీగా మారిన పరిస్థితి.


తెలంగాణ జిల్లాల్లో కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లు ఆశించిన ఫలితం ఇవ్వక క్రమంగా ప్రాచుర్యం కోల్పోతున్నాయి. కనీసం నిర్దేశించిన ఉద్యోగాలను కూడా కల్పించలేక నిరుద్యోగులకు ప్రయోజనం అందించలేకపోయాయి. టైర్-II నగరాలకు ఐటీ విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటలో ఐటీ టవర్లు ఏర్పాటు చేసింది. వీటిలో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు యూనిట్లు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తాయని ప్రకటించింది. ఐటీ టవర్లలో ఉద్యోగ అవకాశాల పేరుతో భారీగా జాబ్ మేళాలు నిర్వహించారు.

ఈ ఐటీ టవర్ల ద్వారా టైర్-I, టైర్-II పట్టణాల్లో 25,000 ఐటీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో కనీసం 10 శాతం కూడా సాధ్యం కాలేదు. నల్గొండ, సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నల్గొండలో రూ.95 కోట్లతో ఐటీ టవర్ నిర్మించి 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఐదు అంతస్తుల్లో 75,000 చదరపు గజాల వర్క్ ఏరియాతో టవర్ సిద్ధమైంది.

ప్రతి షిఫ్ట్‌కు 2,000 ఐటీ ఉద్యోగులు పనిచేసే సదుపాయం ఉందని ప్రకటించారు. దాదాపు 23 ఐటీ కంపెనీలు బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని, 15 కంపెనీలు 600 ఐటీ ఉద్యోగులను నియమించుకున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నల్గొండ ఐటీ టవర్‌లో పనిచేస్తున్న వారు కేవలం 200 మంది మాత్రమే. అవి ఎక్కువగా డేటా ప్రాసెసింగ్ వంటి తక్కువ వేతన ఉద్యోగాలు.

నల్గొండ లోని ఐ. టి. టవర్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నల్గొండ జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఐటీ టవర్ నిర్వహణను టీసీఎస్ కంపెనీకి అప్పగించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. రెండు సంవత్సరాలు దాటినా అది కార్యరూపం దాల్చలేదు.

సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాత కలెక్టరేట్ అద్దె భవనంలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఆ భవనంలో ఐటీకి అవసరమైన సదుపాయాలు లేవనే చెప్పాలి. జాబ్ మేళా నిర్వహించి 600 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క ఐటీ కంపెనీ కూడా అక్కడ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. స్థానికంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలనే నైపుణ్యం గల యువత కల నెరవేరలేదు.

ఒక విధంగా చెప్పాలంటే ఐటీ టవర్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థకు వైట్ ఎలిఫెంట్‌గా మారాయి. ఐటీ టవర్ల నిర్వహణకు టీఎస్‌ఐఐసి ప్రతి నెల లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ సంస్థకు కొన్ని కంపెనీల నుంచి వచ్చే అద్దె మాత్రం నామమాత్రం.

నల్గొండకు చెందిన ఇంజనీరింగ్ పూర్తి చేసిన పి. సురేష్ కుమార్ ది ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ తన సొంత ఊరిలో ఐటీ టవర్ నెలకొల్పడంతో అక్కడే ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుందని ఆశించానని తెలిపారు. కానీ ఐటీ టవర్‌లో అవకాశాలు లేక హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు.

స్కూప్ కన్సల్టెన్సీ నిర్వాహకులు ఆర్. యుగేందర్ మాట్లాడుతూ ఐటీ రంగం ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక సదుపాయాలు, అనుకూల జీవన పరిస్థితులు, ఐటీ సపోర్ట్ సేవల అందుబాటు కీలకమని అన్నారు. జిల్లా స్థాయిలో ఐటీ టవర్లు విజయవంతం కావడం అంత సులభం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత భవనాలు నిర్మించిన ఐటీ టవర్లలో ఐటీతో పాటు ఇతర సర్వీస్ సెక్టార్ యూనిట్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

Read More
Next Story