
నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్, మూడు మృత దేహాలు లభ్యం
మరో ముగ్గురి ఆచూకి కోసం గాలింపు
హైదరాబాద్ నాంపల్లిలో అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా నిర్మించిన ఫర్నిచర్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. 20 గంటలకు పైగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేపన్ అనంతరం ఈ మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది ఆదివారం గుర్తించింది. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి గురించి ఆందోళన మొదలయింది. వారు సజీవంగా ఉండే అవకాశం తక్కువ అని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకి గుర్తించేందుకు రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి సహాయ చర్యల్లో ఉన్నారు. సహాయచర్యలను అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్, సీపీ సజ్జనార్‌లు పర్యవేక్షిస్తున్నారు.
శనివారం మధ్యాహ్నం నాంపల్లిలోని నాలుగు అంతస్తుల ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైరింజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు చిక్కుకున్నారని అనుమానం. సెల్లారులో వాచ్‌మెన్ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. ఇపుడు గుర్తించిన ఇద్దరు మృతదేహాలు అందులోని వారివే. రెస్క్యూ ఆపరేషన్‌కు పొగ, వేడి అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని పోలీసులు తవ్విస్తున్నారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్‌లోకి వెళ్లడానికిమార్గం ఏర్పడింది.
సెల్లార్ అంతా ఫర్నీచర్ పరిచి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతున్నదని అధికారులు చెబుతున్నారు. ప్రమాద ఘటపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇలా ఉంటే, అగ్నిప్రమాదంతో ఈ నాలుగు అంతస్తుల భవనం బాగా బలహీనం పడినట్లుభావిస్తున్నారు.
ఫైర్ సేఫ్టీపై విచారణ: పొన్నం ప్రభాకర్
ఫైర్ సేఫ్టీ కి సంబంధించి నిబంధనలు పాటించకుండా అగ్నిప్రమాద ఘటనకు కారణమైన నాంపలిల్లి ఫర్మిచర్ షాపు యజమాని పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ ఇంచార్జి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీస్ అధికారులను కోరారు. అగ్ని ప్రమాదం పై పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ,పోలీస్ ,రెవెన్యూ , హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు ఉంటే పిర్యాదు చేయాలని కోరారు.
ప్రమాదంలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాద ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ,బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.

