
ఎయిర్‌పోర్ట్ తరహాలో నాంపల్లి రైల్వే స్టేషన్.. 2027లో పూర్తి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ వేగంగా కొనసాగుతోంది. స్కైవాక్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, లాంజ్‌లు సహా ఆధునిక సదుపాయాలు ఏర్పాటు.
అమృత్ భారత్‌లో భాగంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్‌లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. వీటిలో నాంపల్లి రైల్వేస్టేషన్ కూడా ఒకటి. తాజాగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అంతా పూర్తయిన తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్.. విమానాశ్రయం తరహాలో ఉంటుందని, అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ త్వరలోనే పూర్తిగా కొత్త రూపంలో కనిపించబోతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్ తరహా అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి 2027 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇటీవల నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన సమీక్షలో స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా మార్చేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. మొదటి దశలోనే రూ.327 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేషన్ నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్ వరకు నేరుగా వెళ్లేందుకు ఆధునిక స్కైవాక్ నిర్మించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు సులభంగా మెట్రో చేరుకునేలా ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.
స్టేషన్‌లో విలాసవంతమైన వెయిటింగ్ హాళ్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలాలు, విశాలమైన మల్టీ లెవల్ పార్కింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే 16 లిఫ్టులు, 8 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నారు. సీసీటీవీ పర్యవేక్షణ, ఉచిత వై-ఫై, ఫార్మసీ, వైద్య సౌకర్యాలు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించనున్నారు.
స్టేషన్ చారిత్రక నిర్మాణ శైలిని కాపాడుతూ లోపలి భాగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొత్త ప్రవేశ ద్వారాలు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, ఆధునిక ఫర్నిచర్‌తో స్టేషన్ ఆకర్షణీయంగా మారనుంది. ప్రస్తుతం నాంపల్లి స్టేషన్ నుంచి రోజుకు సుమారు 60 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, సగటున 28 వేల మంది ప్రయాణికులు సేవలు వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్‌ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 40కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడతో పాటు నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ వంటి నగరాల్లో కూడా ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు సుమారు రూ.47 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్త రైల్వే లైన్లు, డబుల్ మరియు మల్టీ లైన్ల నిర్మాణం కొనసాగుతోందని వెల్లడించారు.
అదనంగా రైల్వే భద్రతను మెరుగుపరచేందుకు కవచ్ టెక్నాలజీని రాష్ట్రంలో మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు రూట్లలో అమలు చేసిన ఈ వ్యవస్థను మరిన్ని కిలోమీటర్లకు విస్తరించే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరానికి మరో ముఖ్య గుర్తింపుగా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

