
నార్సింగి మైనర్ కేసు: మూడు రోజుల్లో విస్తుబోయే విషయాలు వెల్లడి
పుప్పాలగూడా నుంచి మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలికపై రాంపూర్ వద్ద దారుణం. ముగ్గురు నిందితులు అదుపులో.
హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఒక మైనర్ బాలిక అదృశ్యమైంది. ఈ కేసు తాజాగా సంచలన మలుపు తీసుకుంది. ఈ కేసును మిస్సింగ్ కేసు అనుకున్న పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తాజాగా గుర్తించారు. మూడు రోజుల క్రితం పుప్పాలగూడా పాషా కాలనీలోని ఇంటి నుంచి బాలిక బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు కుటుంబ సభ్యులు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
దర్యాప్తులో సోహెల్ అనే యువకుడు బాలికను నమ్మబలికి తనతో తీసుకెళ్లినట్లు తేలింది. అనంతరం ఘట్‌కేసర్ సమీపంలోని రాంపూర్ ప్రాంతానికి తరలించినట్లు గుర్తించారు. అక్కడ అతను తన స్నేహితులు అర్బాజ్, ఇమ్రాన్‌తో కలిసి దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. నిందితులు గంజాయి సేవించిన తర్వాత ఈ నేరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
బాలికను ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మోసం చేసి తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. విషయం బయటపడగానే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరిన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. కేసులో తదుపరి చర్యలపై పోలీసులు దృష్టి సారించారు.

