భారత్ కు కొత్త  దిక్సూచీ ‘నావిక్’: ఇస్రో చీఫ్
x

భారత్ కు కొత్త దిక్సూచీ ‘నావిక్’: ఇస్రో చీఫ్

విజయవంతమైన ఎన్విఎస్-3 ప్రయోగం


Click the Play button to hear this message in audio format

భారత అంతరిక్ష రంగానికి కీలక ముందడుగు పడింది. దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్‌’ మళ్లీ కనీస స్థాయి కార్యకలాపాలకు అవసరమైన నాలుగు ఉపగ్రహాల సామర్థ్యాన్ని సాధించింది. ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టడంతో పొజిషనింగ్‌, నావిగేషన్‌, టైమింగ్‌ సేవలు పునరుద్ధరించినట్లు ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. నావిక్‌ వ్యవస్థ దేశానికి వ్యూహాత్మక జాతీయ ఆస్తి అని ఆయన అభివర్ణించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి శుక్రవారం నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో కచ్చితంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎన్‌వీఎస్‌-01 సహా మూడు ఉపగ్రహాలు విజయవంతంగా పనిచేస్తుండగా, తాజాగా మరో ఉపగ్రహం చేరడంతో నావిక్‌ వ్యవస్థ కనీస కార్యాచరణ స్థాయికి తిరిగి వచ్చింది.
నావిక్‌ అంటే నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టెలేషన్‌. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌కు పొజిషనింగ్‌, నావిగేషన్‌, సమయ నిర్ధారణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం ఉంటుంది. రైళ్లు, వాహనాలు, నౌకల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయడం వంటి పౌర అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, కేంద్రం ప్రతిపాదించిన ‘ఒక దేశం – ఒక సమయం’ ప్రాజెక్టులోనూ నావిక్‌ కీలక పాత్ర పోషిస్తుందని నారాయణన్‌ తెలిపారు.
ఈ ఉపగ్రహ వ్యవస్థలో దేశీయంగా తయారైన అటామిక్‌ క్లాక్‌లలో ఒకదాన్ని ఇప్పటికే కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, సెప్టెంబర్‌లో ప్రయోగించిన భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్‌-05 కూడా అద్భుతంగా పనిచేస్తోందని, దాని నుంచి ఇస్రోకు అత్యుత్తమ డేటా అందుతోందని చెప్పారు.
ఎన్‌వీఎస్‌-03 ప్రయోగంలో అన్ని వాహక వ్యవస్థలు అంచనాలకు అనుగుణంగా పనిచేశాయని నారాయణన్‌ వివరించారు. వరుసగా రెండు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల మధ్య కేవలం 56 రోజుల వ్యవధి మాత్రమే ఉండటం మరో విశేషమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు, విద్యాసంస్థలను ఆయన అభినందించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మొత్తం బడ్జెట్‌లో దాదాపు 80 శాతం భారతీయ పరిశ్రమలకే వెచ్చించినట్లు తెలిపారు.
నావిక్‌ వ్యవస్థ పునరుద్ధరణతో దేశీయ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌ సేవలకు మరింత బలం చేకూరనుంది. పౌర అవసరాలతో పాటు జాతీయ స్థాయిలో స్వతంత్ర నావిగేషన్‌ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ వ్యవస్థ కీలకంగా మారనుంది.
Read More
Next Story