మేడారం సామూహిక అత్యాచారం: మహిళా కమిషన్ ఏం తేల్చిందంటే..!
x

మేడారం సామూహిక అత్యాచారం: మహిళా కమిషన్ ఏం తేల్చిందంటే..!

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ప్రచారాన్ని ఎన్‌సీడబ్ల్యూ కమిటీ ప్రాథమికంగా ఖండించింది. అసలు అక్కడ ఏం జరిగింది.. ఫుల్ టైమ్‌లైన్..


వనదేవతలను పూజించుకునే మేడారం జాతరలో ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్త యావత్ దేశాన్ని విస్తుబోయేలా చేసింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ అంశం రోజురోజుకు ఉద్రిక్తం అవుతున్న క్రమంలో దీనిపై పోలీసులు, మహిళా కమిషన్ దృష్టి సారించారు. ఘటన జరిగిందని ప్రచారం జరుగుతున్న స్థలాన్ని అధికారులు పరిశీలించారు. దీనిని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిన విచారణలో వేగం పెంచింది. తాజాగా అసలు అక్కడ ఏం జరిగింది అన్న అంశంపై మహిళా కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రచారమవుతున్న ఘటన అసలు జరగలేదని కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో నెలకొన్న గందరగోళానికి స్పష్టత వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆరోపణలు

జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర జరిగింది. ఈ జాతర సమయంలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలికను పొదల్లోకి తీసుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువకులు దాడి చేశారన్న ప్రచారం సాగింది.

ఈ కథనాలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఆరోపణల నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డప్ అధ్యక్షత వహించారు. సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా ఉన్నారు. అవసరమైతే జిల్లా న్యాయ సేవా సంస్థ నామినేట్ చేసే న్యాయవాది సహాయం తీసుకోవాలని నిర్ణయించారు.

ఎన్‌సీడబ్ల్యూ విచారణ

కమిటీ ములుగుకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌లతో సమావేశమై వివరాలు సేకరించింది. గ్యాంగ్ రేప్ జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. పరిశీలన అనంతరం జాతర సమయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

ఈ ప్రచారాన్ని చేసిన ఒక యూట్యూబ్ రిపోర్టర్ కూడా తన కథనం తప్పని అంగీకరిస్తూ పోలీసులకు క్షమాపణ లేఖ ఇచ్చినట్టు కమిటీ గుర్తించింది. ఈ సందర్భంగా ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డప్ స్పందించారు. మహిళల హక్కుల పరిరక్షణ బాధ్యత కలిగిన జాతీయ స్థాయి సంస్థగా ఇలాంటి అంశాలను కమిషన్ గంభీరంగా పరిగణిస్తుందని తెలిపారు.

మహిళలపై నేరాలు ఎక్కడైనా జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని, అలాగే తప్పుడు ప్రచారాన్ని కూడా సహించబోమని స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇదే సమయంలో స్థానిక పోలీసులు కూడా ఈ ప్రచారాన్ని ఇప్పటికే ఖండించారు. సమగ్ర దర్యాప్తులో అలాంటి ఘటన ఏదీ జరగలేదని వెల్లడించారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల నుంచి లిఖితపూర్వక నివేదిక అందిన తర్వాత విచారణ కమిటీ తన తుది నివేదికను జాతీయ మహిళా కమిషన్‌కు సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై స్పష్టత రానుంది.

మేడారం జాతర గ్యాంగ్ రేప్ ఆరోపణలు – టైమ్‌లైన్

జనవరి 28–31, 2026

ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర నిర్వహణ. లక్షలాది భక్తులు హాజరు.

జాతర ముగిసిన వెంటనే

13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు. వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలికను పొదల్లోకి తీసుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువకులు దాడి చేశారన్న కథనాలు వైరల్.

తదుపరి రోజులు

మీడియా, సోషల్ మీడియాలో గ్యాంగ్ రేప్ అంటూ విస్తృత కథనాలు. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లపై విమర్శలు.

ఈ ప్రచారంపై స్పందనగా

ములుగు జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాంటి ఘటన జరగలేదని ప్రాథమికంగా తేల్చారు. డీఎస్పీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

విషయం జాతీయ మహిళా కమిషన్‌కు చేరడం

మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఎన్‌సీడబ్ల్యూ సుమోటోగా స్వీకరణ.

ఎన్‌సీడబ్ల్యూ చర్య

చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఆదేశాలతో విచారణ కమిటీ ఏర్పాటు. డెలినా ఖోంగ్‌డప్ అధ్యక్షురాలిగా, కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా నియామకం.

కమిటీ ములుగు చేరిక

ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌లతో భేటీ. పోలీసుల నుంచి వివరాల సేకరణ.

ఘటన స్థల పరిశీలన

గ్యాంగ్ రేప్ జరిగిందని ప్రచారం చేసిన ప్రాంతాన్ని కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించింది.

ప్రాథమిక నిర్ధారణ

మేడారం జాతరలో బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని కమిటీ తేల్చింది.

ప్రస్తుత స్థితి

పోలీసుల నుంచి లిఖితపూర్వక నివేదిక కోసం కమిటీ ఎదురుచూపు. ఆ నివేదిక ఆధారంగా ఎన్‌సీడబ్ల్యూ తుది రిపోర్ట్ సమర్పణకు సిద్ధం.

Read More
Next Story