
నీట్ పరీక్షలకు భారీ భద్రత.. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర సెక్షన్ 163
దేశవ్యాప్తంగా పరీక్షకు లక్షలాది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షా సమయాలు, నిబంధనలు, విద్యార్థులకు సూచనలు విడుదలయ్యాయి.
దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షాకేంద్రాల దగ్గర సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఆదివారం జరిగే ఈ కీలక పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
భద్రత పరంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడటంపై పరిమితులు విధించారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురికిపైగా గుమికూడరాదని సూచించారు. అలాగే 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక విద్యార్థులకు కూడా ఎన్‌టీఏ ముఖ్య సూచనలు జారీ చేసింది. పరీక్షకు కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. మధ్యాహ్నం 1.30 తర్వాత గేట్లు మూసివేస్తారని తెలిపింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వర్షం వచ్చే అవకాశం ఉండడంతో అడ్మిట్ కార్డు, ఫోటోలు తడవకుండా ట్రాన్స్‌పరెంట్ పౌచ్‌లో పెట్టుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చని, లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

