Netflix in Hyderabad
x

‘హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే’

హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియో ప్రారంభం. ఫ్యూచర్ సిటీలో విస్తరణకు భూమి కేటాయించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.


హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తానని రేవంత్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రావడంతో ఆ దిశగా కీలక ముందడుగు పడినట్లేనని రేవంత్ భావిస్తున్నారు. అంతేకాకుండా.. తెలంగాణను విశ్వవ్యాప్తం చేయడంలో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డీవీడీలు అద్దెకు ఇచ్చే స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరిన నెట్‌ఫ్లిక్స్ ప్రయాణం ప్రపంచానికే స్ఫూర్తిదాయంగా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో సౌకర్యం ద్వారా రాష్ట్రం అంతర్జాతీయ వినోద రంగంలో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉందని తెలిపారు.

ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్‌లో ఇది రెండో అతిపెద్ద ఐలైన్ స్టూడియోగా ఏర్పడింది. ఈ స్టూడియో ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ కొత్త అవకాశాలకు వేదిక కానుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఘట్టం వచ్చిందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు రావడం ద్వారా అంతర్జాతీయ స్థాయి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అవసరమైతే సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా హైదరాబాద్‌కు మార్చాలని కోరుతున్నట్లు చెప్పారు.

సినిమా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి ఆధునిక స్థాయికి ఎదిగిందని ఆయన వివరించారు. హైదరాబాద్ టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కు కూడా కేంద్రంగా మారాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు.

ప్రపంచానికి వినోదాన్ని అందించాలన్న లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్ పనిచేస్తుండగా, ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ముందుకు సాగుతోందని సీఎం వివరించారు. ఈ రెండు లక్ష్యాల మధ్య సారూప్యత ఉందని ఆయన పేర్కొన్నారు. డీవీడీల అద్దె సేవల నుంచి ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఓటీటీ రంగంలో ప్రపంచ లీడర్‌గా ఎదిగిందని సీఎం గుర్తుచేశారు. ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణను పరిచయం చేయడంలో ఈ ఐలైన్ స్టూడియో సౌకర్యం ఉపయోగపడుతుందని అన్నారు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ క్రీడా రంగంపై కూడా దృష్టి పెట్టిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా క్రీడాభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ మరియు హైదరాబాద్ కలిసి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభంతో హైదరాబాద్ అంతర్జాతీయ వినోద రంగంలో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read More
Next Story