నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయం:పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్
x
తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాలు

నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయం:పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్

ఉడాన్ 2.0లో తెలంగాణకు మరో ఎయిర్‌పోర్ట్, మామునూర్‌కు మళ్లీ రెక్కలు… త్వరలో శంకుస్థాపన


తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాల్వంచ, బసంత్ నగర్ ప్రాంతాలు ఫీజిబుల్ కాకపోవడంతో, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

తెలంగాణలో కొత్తగా నాగార్జునసాగర్ లో విమానాశ్రయం నిర్మించాలనే విషయం తెరమీదకు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు ఉండటం వల్ల విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేయడంలో అడ్డంకులు ఏర్పడనున్నందున కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ఫీజిబులిటీ లేదని ఎయిర్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. దీంతో పాల్వంచ, బసంత్ నగర్ విమానాశ్రయాల నిర్మాణం విషయం తెరమరుగుకాగా కొత్తగా నాగార్జునసాగర్ విమానాశ్రయం నిర్మాణం చేపడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు తాజాగా ప్రకటించారు. పాల్వంచ, బసంత్ నగర్ స్థలాల స్థానంలో కొత్త స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తే ఆయా ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం అంశం పరిశీలిస్తామని కేంద్ర మంత్రి వివరించారు.

ఉడాన్ 2.0 పథకం కింద విమానాశ్రయాల నిర్మాణం

ఉడాన్ 2.0 పథకం కింద ఎయిర్ స్ట్రిప్ లుగా ఉన్న ఆదిలాబాద్, నాగార్జునసాగర్ లలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి వీలుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. బేగంపేట విమానాశ్రయం రన్ వే కింద ట్రాఫిక్ టన్నెల్ కు అనుమతిస్తామని చెప్పారు. మరో వైపు ఆదిలాబాద్ ఏరోడ్రోమ్ స్థలంలో కొంత భూసేకరణ చేసి ఎయిర్ పోర్టు నిర్మించాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్ శివార్లలో రక్షణశాఖ ఏరోడ్రోమ్ కింద 369 ఎకరాల స్థలం ఉందని, దీంతోపాటు మరో 415 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు యత్నిస్తున్నారు. ఆదిలాబాద్ ఏరోడ్రోమ్ కు ఆనుకొని ఉన్న ఖానాపూర్, ఇందిరమ్మ, అనుకుంట కాలనీల్లో భూసేకరణకు సర్వే చేశారు. రక్షణ శాఖ ఏరోడ్రోమ్ భూములను ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగిస్తే, మిగతా భూమిని సేకరించి విమానాశ్రయం నిర్మాణ పనులు చేపడతామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

త్వరలో మామునూర్ విమానాశ్రయం పనులకు శంకుస్థాపన

వరంగల్ జిల్లాలోని మామునూర్ విమానాశ్రయం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని నిర్ణయింబచారు. జూన్ నెలలో దీనికి శంకుస్థాపన చేసేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. మామునూర్ విమానాశ్రయ స్థలంతోపాటు 253 ఎకరాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్రానికి అప్పగించింది. ఈ స్థలంలో నీటివనరులు, రాళ్లు ఉన్నాయా అనేది నిట్ ప్రొఫెసర్లు సర్వే కూడా చేశారు. 1939వ సంవత్సరంలో ఏర్పాటైన మామునూర్ విమానాశ్రయం కొంత కాలం నడిచాక మూతపడింది.696 ఎకరాల విమానాశ్రయ స్థలం ఉంది. నేల స్వభావంపై పరీక్షలు చేయించారు. వరంగల్ ప్రాంత అభివృద్ధికి కీలకమైన విమానాశ్రయం నిర్మాణానికి తాము సాంకేతిక సహకారం అందిస్తున్నామని వరంగల్ నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సంబూది చెప్పారు. 1.8 కిలోమీటర్లు ఉన్న రన్ వేను 2.5 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాలు విమానయాన రంగంలో కీలక కేంద్రాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More
Next Story