
ఫారెస్ట్ అకాడమీలో అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన
అటవీ రక్షణలో కొత్త చాప్టర్: పోలీస్-ఫారెస్ట్ అకాడమీల మధ్య ఒప్పందం
పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు
తెలంగాణలో పర్యావరణ సంరక్షణకు మరింత బలం చేకూర్చే దిశగా కీలక ముందడుగు పడింది. అటవీ శాఖ, పోలీస్ శాఖలు కలిసి పనిచేసేలా రెండు ప్రముఖ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదరడం రాష్ట్రానికి శుభసూచకంగా మారింది.
దూలపల్లి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (టీజీఎస్‌ఎఫ్ఏ) , హిమాయత్ సాగర్‌లోని రాజా బహదూర్ వెంకట రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (ఆర్‌బీవీఆర్‌ఆర్) మధ్య శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సామగ్రి, ఫ్యాకల్టీ మార్పిడి చేపట్టనున్నారు. ట్రైనీలకు పరస్పర శిక్షణ అవకాశాలు కల్పించి, శాస్త్రీయ, సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించనున్నారు.
ప్రశంసా పత్రాల ప్రదానం
ఈ సందర్భంగా అడవుల, వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి కొండా సురేఖ ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ అకాడమీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన ముఖద్వారం, స్విమ్మింగ్ పూల్, కేఫెటేరియా నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు
దూలపల్లి తెలంగాణ అటవీ అకాడమీలో ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డా. సీ. సువర్ణ, రాజా బహదూర్ వెంకట రామరెడ్డి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, అవి మన జీవనానికి పునాదిగా పేర్కొన్నారు. గాలి, నీరు, ఆహారం, జీవరాశులన్నీ ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ఉటంకిస్తూ చెట్లను కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంటికి ఒక మొక్క, ప్రతి కుటుంబం ఒక చెట్టు పెంచాలని పిలుపునిచ్చారు.ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ పర్యావరణంపై అవగాహన పెంపు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి రోజు పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమని తెలిపారు. ల్యాండ్‌స్లైడ్స్, వాతావరణ మార్పులు, వరదల వంటి పరిణామాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, ప్రకృతిని కాపాడితేనే అది మనలను కాపాడుతుందని అన్నారు. పోలీస్ అకాడమీలో ఎన్విరాన్‌మెంట్, క్లైమేట్ చేంజ్ అంశాలపై ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని సూచించారు.
అటవీ–పోలీస్ అకాడమీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం పర్యావరణ సంరక్షణలో సమన్వయానికి నాంది పలుకుతూ, భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన చర్యలకు దారి తీసేలా కనిపిస్తోంది.
Next Story

