తల్లీపిల్లల ఆత్మహత్య కేసులో మెసేజ్‌ల ట్విస్ట్
x

తల్లీపిల్లల ఆత్మహత్య కేసులో మెసేజ్‌ల ట్విస్ట్

హైదరాబాద్ సమీపంలో తల్లి ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి మృతి. మొబైల్‌లో అనుమానిత మెసేజ్‌లు గుర్తింపు, CCS దర్యాప్తు కొనసాగుతోంది.


హైదరాబాద్ సమీపంలో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి మృతి చెందిన కేసులో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ బయటపడింది. విజయశాంతి రెడ్డి మొబైల్‌లో కొన్ని అనుమానిత మెసేజ్‌లు గుర్తించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది. ఇటీవల చర్లపల్లి–ఘటకేసర్ మధ్య రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. మృతి చెందిన తల్లి పేరు విజయశాంతి రెడ్డి అని పోలీసులు గుర్తించారు. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

ఆమెతో పాటు కుమారుడు విశాల్, కూతురు చేతన కూడా మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే డీఎస్పీ వివరాల ప్రకారం, 30న అర్ధరాత్రి విజయశాంతి ఇద్దరు పిల్లలను తీసుకుని స్టేషన్‌కు వచ్చింది. కొద్దిసేపు ప్లాట్‌ఫామ్‌పై తిరిగిన తర్వాత చర్లపల్లి వైపు ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లింది.

గూడ్స్ ట్రైన్ వస్తున్న సమయంలో ముగ్గురూ ట్రాక్ మధ్యలో నిల్చున్నట్లు లోకో పైలట్ ప్రత్యక్షంగా చూశారని పోలీసులు తెలిపారు. లోకో పైలట్ కేకలు వేసినా వారు పక్కకు జరగలేదని సమాచారం. ఈ ఘటన తర్వాత కారులో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, బతకడం భారంగా ఉందని అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా, కుటుంబ కలహాలు లేవని వారు చెప్పినట్లు వెల్లడించారు. ఆమె పనిచేస్తున్న సంస్థలో కూడా ఎలాంటి సమస్యలు కనిపించలేదని తెలిపారు. విజయశాంతి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను CCS పోలీసులకు పంపించారు. లాస్ట్ కాల్ డీటెయిల్స్‌తో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌ను సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా పంపించారు.

ఈ ఘటనపై విజయశాంతి భర్త మాట్లాడుతూ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాను దుబాయ్‌లో ఉన్నానని, ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఆర్థికంగా కూడా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.

సూసైడ్ నోట్‌లో కూడా స్పష్టమైన కారణాలు లేవని, పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని భర్త కోరారు. ఈ కేసులో అనుమానిత మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి నిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Read More
Next Story